తెలంగాణలో 531కు చేరిన కరోనా కేసులు

12 Apr, 2020 22:26 IST|Sakshi

ఇద్దరు మృతి.. ఏడుగురు డిశ్చార్జి

531కు చేరిన కరోనా కేసులు.. 16కు చేరిన మరణాలు

ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 412 మంది

భైంసాలో 14 నెలల చిన్నారికి వైరస్‌.. 202కు తగ్గిన హాట్‌స్పాట్లు

సాక్షి, హైదరాబాద్‌/వికారాబాద్‌ : రాష్ట్రంలో ఆదివారం మరో 28 కరోనా పాజి టివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు చనిపోయారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 531కి చేరుకోగా, 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఏడుగురిని డిశ్చార్జ్‌ చేశారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 103 మంది డిశ్చార్జ్‌ అయ్యారని ప్రజారోగ్య డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. ఇంకా ఆసుపత్రుల్లో 412 మంది చికిత్స పొందుతున్నారు. వికారాబాద్‌ జిల్లాలో ఒక్కరోజే 11 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోం ది. మిగిలిన జిల్లాల వివరాలను వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించలేదు. గత రెండ్రోజులు కాస్తంత తక్కువగా నమోదైన కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

వికారాబాద్‌లో 11 కేసులు..
వికారాబాద్‌లో ఆదివారం ఒక్కరోజే 11 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ జిల్లాలో కేసుల సంఖ్య 21కి చేరింది. ఇప్పటికే కరోనా సోకి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వికారాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఆదివారం మృతి చెందాడు. వికారాబాద్‌ పట్టణంలోనే ఒకే రోజు 10 కరోనా కేసులు నమోదవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పాజిటివ్‌ వచ్చినవారిలో ఏడుగురు ఢిల్లీ నుంచి వచ్చిన మతప్రచారకులే ఉన్నారు. ప్రచారంలో భాగంగా వీరు వికారాబాద్‌ పట్టణంతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారిని ఎంత మందిని కలిశారనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. మార్చి మొదటి వారంలో ఢిల్లీ నుంచి 13 మంది మత ప్రచారకులు వికారాబాద్‌ వచ్చారు. ఓ ప్రార్థనా మందిరంలో ఉంటూ ప్రచారం సాగించారు. లాక్‌డౌన్‌ తర్వాత అధికారులు వీరిని గుర్తించి అక్కడే హోం క్వారంటైన్‌ చేశారు. ఇటీవల వీరి నుంచి నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపగా.. ఆదివారం వచ్చిన ఫలితాల్లో ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వెంటనే వారిని చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. తాండూరు మున్సిపల్‌ పరిధిలో మరో కేసు నమోదైంది. మరోవైపు నిర్మల్‌ జిల్లా భైంసాలో 14 నెలల చిన్నారి కరోనా బారిన పడింది. భైంసాకు చెందిన ఓ వ్యక్తి కొద్దిరోజుల క్రితం ఢిల్లీ వెళ్లి రాగా.. అతడికి పాజిటివ్‌ వచ్చినట్టు ఈనెల 8న నిర్ధారణ అయింది. తాజాగా ఆయన కుటుంబ సభ్యుల్లో చిన్నారితోపాటు మరో వ్యక్తికి పాజిటివ్‌ వచ్చినట్టు తేలింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఖమ్మం జిల్లాలో తాజాగా ఒకరికి పాజిటివ్‌ రావడంతో అక్కడ కేసుల సంఖ్య 5కు చేరింది. కొమురంభీం జిల్లా జైనూర్‌లో ఆదివారం ఒక పాజిటివ్‌ కేసు నమోదైంది.

ప్రభుత్వ బ్లడ్‌ బ్యాంకుల్లో అందుబాటులో రక్తం..
లాక్‌డౌన్‌ నేపథ్యంలో అత్యవసర వైద్య అవసరాలు తీర్చడానికి హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఐపీఎం) ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ బ్లడ్‌ బ్యాంకుల్లో రక్తం అందుబాటులో ఉందని ప్రజారోగ్య డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. గర్భిణీలకు ప్రసవ సమయంలో నిరంతరాయమైన సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఆరోగ్యానికి సంబంధించిన అన్ని అత్యవసర పరిస్థితులకు 108 ద్వారా సేవలు పొందొచ్చని పేర్కొన్నారు. కాగా, శనివారం హాట్‌స్పాట్లు (కంటైన్మెంట్‌ జోన్లు) 243 ఉన్నాయని ప్రకటించిన ప్రభుత్వం, ఆదివారం 202 మాత్రమే గుర్తించినట్లు ప్రకటించింది. వీటి సంఖ్య ఎందుకు తగ్గిందన్న వివరాలు తెలుపలేదు.

రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులు, డిశ్చార్జి, మృతుల వివరాలు
                                ఆదివారం నమోదైనవి    మొత్తం
చికిత్స పొందుతున్నవారు              28             412
డిశ్చార్జి అయినవారు                    07              103
చనిపోయినవారు                        02                16
మొత్తం                         531

మరిన్ని వార్తలు