రాష్ట్రంలో 2.99 కోట్ల ఓటర్లు..

8 Feb, 2020 03:38 IST|Sakshi

పురుషులు1,50,41,943

మహిళలు 1,48,89,410

అసెంబ్లీ స్థానాల వారీగా తుది ఓటర్ల జాబితా

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 2,99,32,943 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,50,41,943 మంది పురుష, 1,48,89,410 మహిళ, 1590 మంది థర్డ్‌ జెండర్‌ ఓటర్లున్నారు. కొత్తగా 1,44,855 మంది ఓటర్లుగా నమోదయ్యారు. 12,639 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం–2020లో భాగంగా రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాను శుక్రవారం ప్రకటించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. త్వరలో రాష్ట్రంలోని ఓటర్లందరికీ ప్రామాణిక ఓటరు గుర్తింపు కార్డులను ఉచితంగా జారీ చేయనున్నారు. ఓటర్లకు జీవితాంతం ఒకే విశిష్ట సంఖ్యతో ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. 10 ఆంగ్ల అక్షరాలు, అంకెల (ఆల్ఫా న్యూమరిక్‌) కలయికతో కొత్త నమూనాలో ప్రామాణిక ఓటరు గుర్తింపు (స్టాండర్డ్‌ ఎపిక్‌) కార్డులు జారీ చేస్తోంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లినా.. వారి విశిష్ట ఓటరు సంఖ్య మారదు. చిరునామా మారితే అదే విశిష్ట సంఖ్యతో కొత్త ఓటరు గుర్తింపు కార్డు జారీ చేయనున్నారు.

మరిన్ని వార్తలు