రెండేళ్లలో పరిశ్రమలు.. 3,828

13 Jun, 2017 01:36 IST|Sakshi
రెండేళ్లలో పరిశ్రమలు.. 3,828

రాష్ట్రానికి రూ.73 వేల కోట్ల పెట్టుబడులొచ్చాయి: కేటీఆర్‌
- 2.46 లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించాం
- 8 లక్షల వరకు పరోక్ష ఉపాధి అవకాశాలు కూడా..
- 50 శాతం పరిశ్రమల్లో ఇప్పటికే ఉత్పత్తి షురూ
- పరిశ్రమలశాఖ వార్షిక నివేదికను ఆవిష్కరించిన మంత్రి  


సాక్షి, హైదరాబాద్‌: ‘‘తెలంగాణ ఏర్పడితే కొత్త పరిశ్రమలు రావడం కాదు, ఉన్న పరిశ్రమలు తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోతాయని దుష్ప్రచారం జరిగింది. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో విద్యుత్‌ కూడా సరిపడా లేదు. ఎన్నో అనుమానాలుండేవి. వాటన్నింటినీ కొత్త రాష్ట్రం పటాపంచలు చేసింది. పురోగమనశీల, ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ సుస్థిర అభివృద్ధి దిశగా దూసుకుపోతోంది..’’అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం ‘టీఎస్‌ ఐపాస్‌’ప్రారంభించి సరిగ్గా రెండేళ్లు పూర్తయ్యాయని.. ఈ రెండేళ్లలో రూ.73 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతించామని, 3,828 కొత్త పరిశ్రమలు వచ్చాయని తెలిపారు.

2.46 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు సృష్టించామని, 8 లక్షల నుంచి 10 లక్షల వరకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు సాధించగలిగామని చెప్పారు. అనుమతి ఇచ్చిన పరిశ్రమల్లో 50 శాతానికిపైగా ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించాయన్నారు. సోమవారం హైదరాబాద్‌లో పరిశ్రమలు, వాణిజ్యశాఖ 2016–17 వార్షిక పురోగతి నివేదికను, తెలంగాణ ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లినిక్‌ లోగోను మంత్రి జగదీశ్‌రెడ్డితో కలసి కేటీఆర్‌ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడారు. భూపందేరాలు, భూ సంతర్పణలకు అవకాశమివ్వకుండా నిజమైన పారిశ్రామికవేత్తలకే రాష్ట్ర పరిశ్రమల శాఖ భూములు కేటాయిస్తోందన్నారు. గతేడాది తీసుకొచ్చిన వ్యాపార సరళీకృత విధానాలతో ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ర్యాంకుల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచామన్నారు. 113 కొత్త ఆన్‌లైన్‌ సేవలు, 26 కొత్త చట్టాలు, చాలా జీవోలు తీసుకురావడంతో ఇది సాధ్యమైందని.. ప్రభుత్వంలోని 22 శాఖలు సంయుక్తంగా చేసిన కృషికి దక్కిన ఫలితమిదని చెప్పారు.

కేసీఆర్‌ గొప్ప ఆలోచనలకు రూపమిది..
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏ కార్యక్రమం తలపెట్టినా అది అవుతుందా అనిపిస్తుంటుందని... టీఎస్‌ఐపాస్‌ అయినా, మిషన్‌ భగీరథ అయినా రూపకల్పన సమయంలో అందరూ ఆశ్చర్యపోయారని కేటీఆర్‌ చెప్పారు. మిషన్‌ భగీరథతో ఇంటింటికీ నల్లా నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగబోమంటే.. అది సాధ్యమవుతుందా అని గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్‌) అధికారులు సహా అందరూ అనుమానించారని పేర్కొన్నారు. కానీ పనుల విషయంలో పక్కా ప్రణాళికలు వేసుకుంటూ సీఎం సారథ్యంలో ముందుకు వెళ్లామన్నారు. ఇప్పుడు అదే ఆర్‌డబ్ల్యూఎస్‌ ఉద్యోగులు 2018లోనే మిషన్‌ భగీరథను పూర్తి చేస్తామని ఘంటాపథంగా చెబుతున్నారని.. ముఖ్యమంత్రి ఏ విధంగా ఆలోచిస్తారో చెప్పడానికి ఇదో ఉదాహరణ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

గనుల శాఖలో అసాధారణ పురోగతి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్ల గనుల శాఖ అసాధారణ పురోగతి సాధించిందని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ శాఖకు 2013–14లో తెలంగాణలోని 10 జిల్లాల నుంచి వచ్చిన ఆదాయం రూ.10.84 కోట్లుకాగా.. ఈ ఏడాది ఇసుక మీద జరిమానాల వల్ల రూ.16 కోట్లు సమకూరిందన్నారు. గనుల శాఖ మొత్తం ఆదాయం రూ.3,159 కోట్లకు పెరిగిందని చెప్పారు. కేవలం హైదరాబాద్‌ కేంద్రంగా కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ పరిశ్రమలు స్థాపించాలని మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రధానంగా వ్యవసాయాధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్, టీఎస్‌ఐఐసీ ఎండీ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ ఏడాది ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు
ఈ ఏడాది చాలా ప్రతిష్టాత్మక, పెద్ద ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. ఆ వివరాలు..
– సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం సుల్తాన్‌పూర్‌లో 250 ఎకరాల్లో నిర్మించిన దేశంలోనే తొలి మెడికల్‌ డివైజ్‌ పార్కును ఈ నెల 17న ప్రారంభించబోతున్నాం. తొలిరోజే 10 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని అక్కడికక్కడే వారికి స్థలాలు కేటాయిస్తాం.
– రాష్ట్రంలోని చిన్న, మధ్యతరహ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ఇండస్ట్రీస్‌ ఫెడరేషన్‌ (టీఐఎఫ్‌), టీఎస్‌ఐఐసీల ఆధ్వర్యంలో యాదాద్రి జిల్లా దండుమల్కాపూరంలో 300 నుంచి 400 ఎకరాల్లో గ్రీన్‌ ఇండస్ట్రీయల్‌ పార్కును ప్రారంభించబోతున్నాం.
– చేనేత, జౌళి రంగానికి ఊతమిచ్చేందుకు త్వరలో సీఎం చేతుల మీదుగా కాకతీయ మెగా టెక్స్‌టైల్స్‌ పార్కును ప్రారంభిస్తాం. దీనికి 1,200 ఎకరాల స్థల సేకరణ కూడా పూర్తయింది.
– దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక పార్కు, 8,200 ఎకరాల్లో నిర్మిస్తున్న ఫార్మాసిటీ తొలిదశను ఈ ఏడాది ప్రారంభించబోతున్నాం. వచ్చే ఏడాది చివరికల్లా ఉత్పత్తులు ప్రారంభించే విధంగా చర్యలు చేపడతాం.
– రాష్ట్రాన్ని దేశానికి విత్తన భాండాగారంగా తీర్చిదిద్దాలన్న సీఎం కేసీఆర్‌ సంకల్పాన్ని సాకారం చేసేందుకు సిద్దిపేట జిల్లాలో సీడ్‌ పార్కును ప్రారంభించబోతున్నాం. ఇప్పటికే భూసేకరణ పూర్తయింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం బుగ్గపాడులో ఇప్పటికే ఓ ఫుడ్‌పార్కును ప్రారంభించాం. మూడు పరిశ్రమలు కొత్తగా ఏర్పాటు కాబోతున్నాయి. జనగామ, సిరిసిల్ల, ఖమ్మం జిల్లాల్లో మరో మూడు పార్కులు ఏర్పాటు చేస్తాం. నిజామాబాద్‌ జిల్లా భీంగల్‌లో స్పైస్‌ పార్కు ప్రారంభించబోతున్నాం.

– కాంపోజిట్‌ మ్యాన్యుఫాక్చరింగ్‌ పార్కును ఏర్పాటు చేస్తాం.
– రంగారెడ్డి జిల్లాలో ప్లాస్టిక్‌ పార్కును, సిద్దిపేటలో గ్రానైట్‌ క్లస్టర్‌ను ప్రారంభిస్తాం.
– వికారాబాద్, నల్లగొండ జిల్లా మిర్యాలగూడల్లో రెండు ఆటోనగర్‌లు ఏర్పాటు చేస్తాం.
– ఇప్పటికే ఉన్న 116 పారిశ్రామిక పార్కుల్లో సదుపాయాలను మెరుగుపరిచి 500 పరిశ్రమలకు ఊతం కల్పిస్తాం. ఇందులో భాగంగా జీనోమ్‌ వ్యాలీలో 20 లక్షల చదరపు అడుగుల విశాల స్థలంలో లేబొరేటరీ మరియు ఇంక్యుబేషన్‌ స్పేస్‌ నిర్మిస్తున్నాం.
– సిరిసిల్లలో అప్పెరల్‌ పార్కు, గద్వాలతో పాటు ఇతర ప్రాంతాల్లో చేనేత సమూహాలు ఏర్పాటు చేస్తాం.
– నల్లగొండ జిల్లాలో డ్రైపోర్టు, సంగారెడ్డి జిల్లాలో ఎల్‌ఈడీ మ్యాన్యుఫాక్చరింగ్‌ పార్కును ఏర్పాటు చేస్తాం.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా