ఎంపీకి బ్లాక్ మెయిల్: రూ.25 కోట్లు డిమాండ్

1 Feb, 2015 08:37 IST|Sakshi
ఎంపీకి బ్లాక్ మెయిల్: రూ.25 కోట్లు డిమాండ్

హైదరాబాద్ :  ‘నామినేషన్‌లో ఎలక్షన్ కమిషన్‌కు మీరు తప్పుడు ఆస్తులు చూపించారు. మా వద్ద  సాక్ష్యాలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయకుండా ఉండాలంటే రూ.25 కోట్లు ఇవ్వండి’ అని చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి కొద్ది రోజుల క్రితం ఈమెయిల్ బెదిరింపు వచ్చింది. ఈ మేరకు సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు డెకాయి ఆపరేషన్ నిర్వహించి ముగ్గురిని రిమాండ్ చేశారు.

నిందితుల్లో ఓ మాజీ ఎంపీ బంధువు ఉండడం గమనార్హం. సైబరాబాద్ క్రైమ్ ఏసీపీ జయరాం కథనం ప్రకారం..జూబ్లీహిల్స్‌కు చెందిన  వెకంటరమణారెడ్డి, బెంగుళూరుకు చెందిన రాజేష్, కుమార్ కలిసి ఎంపీ కుమారుడు కొండా అనిధిత్‌రెడ్డికి డిసెంబర్ 8వ తేదీన మెయిల్ చేశారు. మీ ఆస్తుల వివరాలపై ఫిర్యాదు చేయకుండా ఉండాలంటే రూ. 25 కోట్లు ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.
 
ఈ మెయిల్‌ను అతడు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి చూపించాడు. రెండు రోజులకు మరో మెయిల్ పెట్టారు.  వరుసగా సెల్‌ఫోన్‌లో కూడా వేధించడం ప్రారంభించారు. దీంతో ఎంపీ జనవరి 8వ తేదీన సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. సైబర్‌క్రైమ్ ఇన్‌స్పెక్టర్ రియాజుద్దీన్ కేసు నమోదు చేసుకుని ఎస్‌ఐలు కె.శ్రీనివాస్, కె.విజయవర్ధన్‌లతో కలిసి నిందితులతో డెకాయి ఆపరేషన్ నిర్వహించారు. రూ.25 కోట్లు ఇస్తామని ముగ్గురు నిందితులను గచ్చిబౌలికి పిలిపించి  అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
 

మరిన్ని వార్తలు