హైకోర్టుకు ముగ్గురు జడ్జీలు

24 Aug, 2019 02:07 IST|Sakshi
అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డి, కూనూరు లక్ష్మణ్‌, తడకమళ్ల వినోద్‌కుమార్‌

వినోద్‌కుమార్, అభిషేక్‌రెడ్డి, లక్ష్మణ్‌ నియామకం

రాష్ట్రపతి ఉత్తర్వులు.. కేంద్రం నోటిఫికేషన్‌ 

సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా న్యాయవాదులు తడకమళ్ల వినోద్‌కుమార్, అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డి, కూనూరు లక్ష్మణ్‌ నియమితులయ్యారు. వీరి నియామకాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శుక్రవారం ఆమోదముద్ర వేశారు. అనంతరం ఈ ముగ్గురి నియామకాలను నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. నియామకపు ఉత్తర్వులు వెలువడిన తర్వాత ఈ ముగ్గురూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన వీరిని అభినందించారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు హైకోర్టులో వీరు న్యాయమూర్తులుగా ప్రమాణం చేయనున్నారు. ఈ ముగ్గురి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 14కు చేరుకుంది. మరో 10 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఈ ఖాళీల భర్తీకి హైకోర్టు సీజే జస్టిస్‌ చౌహాన్‌ నేతృత్వంలోని కొలీజియం ఇప్పటికే చర్యలు మొదలుపెట్టింది. అర్హులైన న్యాయవాదుల ఎంపికకు కసరత్తు చేస్తోంది. కొత్త జడ్జీల నేపథ్యమిదీ..

తడకమళ్ల వినోద్‌కుమార్‌
1964 నవంబర్‌ 17న జన్మించారు. నల్లగొండ జిల్లా దాచారం గ్రామానికి చెందినవారు. తల్లిదండ్రులు లక్ష్మీ నర్సింహారావు, శకుంతల. హైదరాబాద్‌ ఎంబీ హైస్కూల్‌లో ఎస్సెస్సీ, గన్‌ఫౌండ్రీలోని ఆలియా ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఇంటర్, జాంబాగ్‌లోని వీవీ కాలేజీ లో బీఏ, ఓయూలో ఎల్‌ఎల్‌బీ చదివారు. 1988లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. 1993లో ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. 2016 నుంచి హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి వాణిజ్య పన్నుల శాఖ సీనియర్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా వ్యవహరిస్తున్నారు. 

కూనూరు లక్ష్మణ్‌
1966 జూన్‌ 8న జన్మించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భోగారం గ్రామానికి చెందినవారు. తల్లిదండ్రులు గోపాల్, సత్తెమ్మ. వీరిది చిన్న వ్యవసాయ కుటుంబం. రామన్నపేట జూనియర్‌ కాలేజీలో ఇంటర్, అమీర్‌పేట న్యూ సైన్స్‌ కాలేజీలో డిగ్రీ, నెల్లూరు వీఆర్‌ లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ చదివారు. 1993లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. సీనియర్‌ న్యాయవాది ఎం.రాధాకృష్ణమూర్తి వద్ద జూనియర్‌గా చేరి వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. 1999 నుంచి  ప్రాక్టీస్‌ ప్రారంభించారు. యూరేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు న్యాయవాదిగా వ్యవహరించారు. సివిల్, రాజ్యాంగ, లేబర్‌ కేసుల్లో ప్రావీణ్యత సంపాదించారు. 2017 నుంచి అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ)గా కొనసాగుతున్నారు. 

అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డి
1967 నవంబర్‌ 7న జన్మించారు. రంగారెడ్డి జిల్లాకు చెందినవారు. తల్లిదండ్రులు పుల్లారెడ్డి, శశిరేఖారెడ్డి. హైదర్‌గూడ సెయింట్‌ పాల్స్‌ పాఠశాలలో పదో తరగతి, ఉప్పల్‌ లిటిల్‌ ఫ్లవర్‌లో ఇంటర్, నిజాం కాలేజీలో బీఏ, ఉస్మానియా వర్సిటీలో ఎల్‌ఎల్‌బీ చదివారు. వాషింగ్టన్‌లోని వాషింగ్టన్‌ కాలేజ్‌ ఆఫ్‌ లాలో ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. 1990లో న్యాయవాదిగా ఎన్‌రోలయ్యా రు. ప్రముఖ న్యాయవాది అయిన తండ్రి ఎ.పుల్లారెడ్డి వద్ద న్యాయవాద జీవితాన్ని ఆరం భించి, వృత్తిలో మెళకువలు నేర్చుకున్నారు. హైకోర్టుతో పాటు సివిల్‌ కోర్టు, భూ ఆక్రమణల నిరోధక కోర్టులో ఎక్కువ కేసులు వాదించారు. సివిల్, రాజ్యాంగ కేసుల్లో మంచి పట్టు సాధించారు. 2004–07 మధ్య కాలంలో భూ ఆక్రమణ ల నిరోధక కోర్టులో ప్రభుత్వ న్యాయవాది కమ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించారు. 2007–09 కాలంలో హైకోర్టులో ఉన్నత, సాంకేతిక విద్యాశాఖల తరఫున ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. హైదరాబాద్‌ జేఎన్‌టీయూ, తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీకి న్యాయవాదిగా ఉన్నారు. 

మరిన్ని వార్తలు