బోరు బావిలో పడిపోయిన మూడేళ్ల చిన్నారి!

27 May, 2020 19:15 IST|Sakshi

సాక్షి, మెదక్‌: జిల్లాలోని పాపన్నపేట మండలం పోడ్చన పల్లి గ్రామంలో మూడేళ్ల బాలుడు బోరు బావిలో పడిపోయాడు. 120 అడుగులు లోతు తవ్వి నీళ్లు రావడం లేదని బోరు బావిని వదిలేసినట్టు స్థానికులు చెప్తున్నారు. బోరు సమీపంలో ఆడుకుంటూ వెళ్లిన సాయి వర్ధన్‌ ప్రమాదవశాత్తూ అందులో పడిపోయాడు. మెదక్‌ రూరల్‌ ఎస్సై రాజశేఖర్‌, మరో ఎస్సై ఆంజనేయులు, స్థానిక అధికారులు ఘటనా స్థలానికి చేరకున్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక బలగాలను తెప్పిస్తున్నామని అధికారులు తెలిపారు. బాలుడు పడిన బోరుబావిని ఈరోజు ఉదయమే తవ్వడం గమనార్హం.

పొలం వద్దకు వెళ్లి..
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన మంగలి గోవర్ధన్ నవీనల మూడో కుమారుడు సాయి వర్ధన్‌. నాలుగు నెలల క్రితం పోడ్చన పల్లి గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి గోవర్ధన్‌ కుటుంబ సమేతంగా వచ్చారు. మామ మంగలి బిక్షపతి చెందిన రెండు ఎకరాల వ్యవసాయ భూమిని కుటుంబ సమేతంగా చూడటానికి వెళ్లిన సమయంలో నీరులేని బోరు బావిలో సాయి వర్ధన్‌ పడిపోయాడు. కళ్లముందే ఆడుకుంటూ వెళ్లిన బాలుడు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడంతో తల్లి దండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ కుమారుడు క్షేమంగా బయటపడాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు.


ప్రారంభంమైన సహాయక చర్యలు..
బోరుబావిలో పడిన సాయి వర్ధన్‌ను రక్షించేందుకు సహాయ చర్యలు మొదలయ్యాయి. కలెక్టర్ ధర్మారెడ్డి, ఎస్పీ చందన దీప్తి, ఆడియో సాయిరాం, పాపన్నపేట తహసీల్దార్‌ బలరాం సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం, రెవెన్యూ అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. రెండు జేసీబీలు, రెండు క్రేన్లు, మూడు అంబులెన్సులు, రెండు ఫైరింజన్లు ఘటనాస్థలం వద్ద సిద్ధంగా ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక బృందాలు రావాల్సి ఉంది.

25 ఫీట్ల లోతులోనే చిన్నారి..
బోరుబావి లోతు 150 ఫీట్ల వరకు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. సాయి వర్ధన్‌కు ఆక్సిజన్‌ అందించేందుకు పైపును బోరుబావిలోకి పంపిచగా.. 25 ఫీట్ల లోతులోనే ఆగిపోయినట్టు వెల్లడించారు. సాయివర్ధన్‌  25 ఫీట్ల లోతులోనే ఉన్నట్టు ప్రాథమిక అంచనాకొచ్చినట్టు పేర్కొన్నారు. బోరుబావి చుట్టూ లైట్లు ఏర్పాటు చేశారు. ఘటనా స్థలంలో ఈ ఒక్కరోజే మూడు బోర్లు వేసి నీళ్లు పడకపోవడంతో అలాగే వదిలేసినట్టు తెలుస్తోంది. మే మాసంలో పోడ్చన్‌పల్లిలో ఇప్పటికే 19 బోర్లు వేశారని, వేటికీ అనుమతులు తీసుకోలేదని అధికారులు చెప్తున్నారు. గతంలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో చిన్నారులు బోరుబావిలో పడిన ఘటనలు వరసగా.. 2008, 2011, 2015 సంవత్సరాల్లో మూడు చోటు చేసుకున్నాయి. అధికారులు ఎంత శ్రమించినా వారిని కాపాడలేకపోయారు.
 

మరిన్ని వార్తలు