మారు వేషంలో దొంగ స్వాములు

14 Aug, 2019 13:15 IST|Sakshi

సాక్షి, ఖమ్మం(రఘునాథపాలెం) : మండలంలోని చింతగుర్తి గ్రామంలో మంగళవారం పూజల పేరుతో ఓ ఇంట్లో ఉన్న హోం థియేటర్‌ సెట్‌ను తీసుకొని పారిపోతున్న ముగ్గురు యువకులను గ్రామ పొలిమేర వద్ద అటకాయించి పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఖమ్మంరూరల్‌ మండలం సత్యనారాయణపురానికి చెందిన ముగ్గురు యువకులు సాధు వేషాలు వేసుకోని చింతగుర్తి గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ పూజలు చేస్తామంటూ వెళ్లారు. ఈక్రమంలో గ్రామంలో అప్పారావు అనే వ్యక్తి ఇంట్లోకి వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో అప్పారావు కొడుకు, భార్య ఉన్నారు. కొడుకు పాపయ్యతో మాటలు కలిపిన యువకులు ‘నీకు ఉద్యోగం వస్తుంది కానీ..ఓ అడ్డంకి ఉంది. పూజలు చేస్తే తొలుగుతుంది’ అని నమ్మించారు. అదే సమయంలో తల్లి పక్కింటికి వెళ్లింది. ఒంటరిగి ఉన్న అతడిని నమ్మబలికించి చేతిలో తీర్థం పోసి, చేతికి తాయత్తు కట్టి దీనికి రూ.6 వేలు ఇవ్వాలని కోరారు.

పాపయ్య తన వద్ద అంత డబ్బులేదని చెప్పాడు. ఇంట్లో ఉన్న ఏదో ఒక వస్తువు ఇవ్వాలని సాధు వేషంలో ఉన్న యువకులు కోరి, హోం థియేటర్‌ను తీసుకోని అక్కడి నుంచి ఉడాయించారు. అదే సమయంలో పాపయ్యతల్లి వచ్చి జరిగిన విషయం తెలుసుకొని చుట్టుపక్కల వారికి తెలపగా గ్రామానికి చెందిన పెంట్యాల శ్రీను అనే వ్యక్తి పాపయ్యను తీసుకొని ద్విచక్రవాహనంపై వేపకుంట్ల వైపు వెళ్లి అడ్డుకున్నారు. ఇద్దరు యువకులు పారిపోగా ఓకడిని పట్టుకున్నారు. అతడిని, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని గ్రామంలోకి తీసుకొచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఏఏస్‌ఐ దానియేలు గ్రామానికి చేరుకొని ఆ యువకుడుని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. తర్వాత ముగ్గురు యువకులను స్టేషన్‌కు తీసుకొచ్చి మైనర్లు కావడంతో తల్లితండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించినట్లు తెలిసింది.  

మరిన్ని వార్తలు