ఈసారి పక్కా!

11 Feb, 2019 08:17 IST|Sakshi

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): జిల్లా వ్యాప్తంగా జనవరి 30తో సర్పంచ్‌ ఎన్నికలు ముగిశాయి. కానీ 30 పంచాయతీల్లో కోరం లేక పోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. గతనెల 30వ తేదీ వరకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఆ మరుసటిరోజు సాయంత్రం వరకు ఉప సర్పంచులను ఎన్నుకోవడానికి గడువు ఉంటుంది. ఆ సమయం వరకు ఎన్నికలు పూర్తి కాకపోతే తదుపరి  ఉత్తర్వులు వచ్చే వరకు ఆగాల్సిందే.

నోటిఫికేషన్‌ జారీ 
జిల్లాలో మిగిలిపోయిన ఉప సర్పంచ్‌ ఎన్నికకు సమయం వచ్చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈనెల 18వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చెక్‌ పవర్‌ ఉండడంతో ఉప సర్పంచ్‌ పదవికి పోటీ తీవ్రంగా పెరిగిపోయింది. జిల్లాలో పంచాయతీ ఎన్నికలు మూడు విడుతల్లో జరిగాయి. మొదటి విడుతలో కృష్ణ, మాగనూర్, మక్తల్, నర్వ, ఊట్కూర్, నారాయణపేట్, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, కోయిలకొండలో కలిపి 249 పంచాయతీలు, 2,274 వార్డులో జనవరి 21వ తేదీన పోలింగ్‌ నిర్వహించారు.

రెండో విడతలో మిడ్జిల్, బాలానగర్, రాజాపూర్, జడ్చర్ల, నవాబుపేట్, మహబూబ్‌నగర్, హన్వాడ మండలాల్లోని 243 పంచాయతీలు, 2,068 వార్డులో జనవరి 25వ తేదీన పోలింగ్‌ జరిగింది. ఇక మూడో విడతలో అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్, సీసీకుంట, దేవరకద్ర, గండీడ్, మద్దుర్, కోస్గీ మండలాల్లో 227 పంచాయతీలు, 2,024 వార్డులో జనవరి 30వ తేదీన ఎన్నికలు జరిగాయి. మొత్తం 719 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహించారు. వాటిలో 30 స్థానాలు మినహా 689 గ్రామ పంచాయతీలకు ఉప సర్పంచ్‌  ఎన్నికలను జిల్లా ఎన్నిల అధికారులు పూర్తి చేశారు. ఈనెల 18న ఉదయం 11 గంటలకు ఉప సర్పంచ్‌  ఎన్నికలను నిర్వహించడానికి అధికారులు సిద్ధమయ్యారు.

పెరిగిన పోటీ.. 
మొదటి విడతలో 13, రెండో విడతలో 7, మూడో విడదలో 10 స్థానాల్లోని ఉపసర్పంచ్‌కు ఎన్నిక నిర్వహించనున్నారు. అత్యధికంగా మక్తల్, అడ్డాకుల, నారాయణపేట, కోయిల్‌కొండ మూడేసి ఉప సర్పంచులు, దన్వాడ, హన్వాడ, కోస్గి, నర్వ, ఊట్కూర్‌ మండలాల్లో ఒక్కొక్క ఉప సర్పంచ్‌ ఎన్నిక జరుతుంది. అడ్డాకుల, బలీద్‌పల్లి, కన్మానూర్, బాల్‌నగర్‌ మండలంలో మన్నేగూడెంతండా, నేరళ్లపల్లి, సీసీకుంట మండలంలో నెల్లకొండి, ఉంద్యాల, దామరగిద్ద మండలంలో కంసాన్‌పల్లి, ధన్వాడలో కిష్టాపూర్,  గండీడ్‌ మండలంలో చౌదర్‌పల్లి, ధర్మాపూర్, హన్వాడ మండలంలో బుద్దారం, జడ్చర్ల మండలంలో ఈర్లపల్లి, కోడ్గల్, కోయిల్‌కొండ మండలంలో అనంతపూర్, లింగాల్‌చేడ్, శేరివెంకటాపూర్, కోస్డి మండలంలో హన్మాన్‌పల్లి, మద్దూరు మండలంలో నందిగామ, ఎక్కామేడ్, మక్తల్‌ మండలంలో కర్ని, రుద్రసముద్రం, సంగంబండ, మిడ్జిల్‌ మండలంలో బోయినపల్లి, మసిగుండ్లపల్లి, నారాయణపేట్‌ మండలంలో అమ్మిరెడ్డిపెల్లి, అప్పిరెడ్డిపల్లి, షెమాపల్లి, నర్వ మండలంలో ఎల్లంపల్లి, ఊట్కూర్‌ మండలంలో పులిమామిడి గ్రామ పంచాయతీలకు ఉప సర్పంచి ఎన్నిక జరగనుంది

కోరం లేకున్నా.. 
ఉప సర్పంచ్‌ ఎన్నికకు ఎలాంటి కోరం లేకపోయినా ఎన్నిక నిర్వహించనున్నారు. కోరం అవసరం లేకున్నా కచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. దానికి అనుగుణంగానే 18వ తేదీ ఉదయం 11 గంటలకు ఉప సర్పంచ్‌ ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు వచ్చా యి. దానికి అనుగునంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సమావేశానికి వచ్చిన వారిలో ఒక్కరిని కచ్చితంగా ఉప సర్పంచ్‌గా ఎన్నిక జరుపనున్నారు.  

ఏర్పాట్లు చేస్తున్నాం.. 
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో మిగిలి పోయిన 30 స్థానాలకు ఈనెల 18వ తేదీన ఉప సర్పంచ్‌ ఎన్నిక నిర్వహిస్తాం. కోరం ఉంటేనా సరి.. లేకున్నా ఎన్నిక మాత్రం ఆగదు. ఈ మేరకు స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. – వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీ అధికారి 

మరిన్ని వార్తలు