30 లక్షల చెక్కులు అందజేత 

14 May, 2018 01:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అప్పుడే సగం మంది రైతులకు చెక్కులు చేతికందాయి. ఈ నెల 10 నుంచి ఆదివారం వరకు అంటే నాలుగు రోజుల్లో 5,596 గ్రామసభలు నిర్వహించి.. సుమారు 30 లక్షల చెక్కులు అందజేసినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. వారికి సుమారు రూ.2,800 కోట్ల విలువైన చెక్కులు అందాయని అధికారులు అంచనా వేశారు. రాష్ట్రంలో 10,628 గ్రామాలకు చెందిన 1.43 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమికి చెందిన 58.33 లక్షల మంది రైతులకు రూ.5,730 కోట్ల విలువైన 58.98 లక్షల చెక్కులను ఇవ్వాలని సర్కారు నిర్థారించిన సంగతి తెలిసిందే.

ఇప్పటివరకు రూ.250 కోట్ల మేరకు రైతులు నగదు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు గ్రామసభల్లో ఎవరైనా చెక్కులు తీసుకోనట్లయితే మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో నెల రోజుల వరకు తీసుకోవచ్చని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. మండల స్థాయిలోనూ చెక్కులు తీసుకోనివారుంటే, అటువంటి వారు తమ చెక్కులను మూడు నెలల వరకు హైదరాబాద్‌లోని వ్యవసాయ శాఖ కమిషనరేట్‌లో పొందవచ్చన్నారు. కాగా, రాష్ట్రంలో రైతులకు పాస్‌ పుస్తకాల పంపిణీ ఊపందుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల్లోనే 13 లక్షల పుస్తకాలు పంపిణీ చేసినట్టు రెవెన్యూ వర్గాలు తెలిపాయి.  

మరిన్ని వార్తలు