30 తిరస్కరణ..

21 Nov, 2018 14:13 IST|Sakshi

ఉమ్మడి జిల్లాలో పూర్తయిన నామినేషన్ల పరిశీలన

బరిలో నిలిచిన 264 మంది అభ్యర్థులు 

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నామినేషన్‌ పత్రాల పరిశీలన పూర్తయింది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వివిధ నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు పలు పార్టీల నుంచి అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ల గడువు సోమవారం ముగిసిన విషయం విదితమే. ఈ క్రమంలో సక్రమంగా లేనివాటిని అధికారులు తిరస్కరించారు. ఉమ్మడి జిల్లాలో 294 నామినేషన్లు దాఖలు కాగా.. పలువురు దాఖలు చేసిన నామినేషన్‌ పత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. కొందరు అభ్యర్థులు తమ పార్టీ నుంచి టికెట్‌ వస్తుందని భావించి.. ముందుగానే పార్టీ పేరును ఉదహరించడంతో నామినేషన్‌ దాఖలు చేసే సమయానికి సదరు పార్టీ బీ ఫారం ఇవ్వని కారణంగా అధికారులు వాటిని తిరస్కరించారు. అయితే ఆయా పార్టీల ఆశావహులు కొందరు మాత్రం రెండు, మూడు విడతలుగా నామినేషన్‌ పత్రాలను దాఖలు చేసి.. స్వతంత్ర అభ్యర్థులుగా వేసిన నామినేషన్లు మాత్రం ఆమోదం పొందాయి.

 ఖమ్మం జిల్లాలో.. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు, సత్తుపల్లిలో 2, మధిరలో 2, వైరాలో 6.. పాలేరులో ఒక నామినేషన్‌ను అధికారుల పరిశీలన అనంతరం సరైన పత్రాలు లేవనే కారణంతో తిరస్కరించారు. వాటిలో వైరా నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పేర్కొంటూ రాములునాయక్‌ దాఖలు చేసిన నామినేషన్‌ తిరస్కరణకు గురికాగా.. స్వతంత్ర అభ్యర్థిగా ఆయన వేసిన నామినేషన్‌ ఆమోదం పొందడంతో ఆయన ఎన్నికల బరిలో నిలిచే అవకాశం లభించింది. ఇల్లెందు నుంచి కాంగ్రెస్‌ తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన మంగీలాల్‌ నామినేషన్‌ను అధికారులు సరైన పత్రాలు లేవనే కారణంతో తిరస్కరించారు. అలాగే పినపాక నియోజకవర్గంలో పాయం ప్రమీల, కుంజా కృష్ణకుమారి నామినేషన్లను తిరస్కరించారు.

 ఇల్లెందు నియోజకవర్గంలో మొత్తం మూడు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మధిర నుంచి నామినేషన్‌ దాఖలు చేసిన నకిరికంటి చిట్టెమ్మ, మోదుగు సైదులు నామినేషన్లను తిరస్కరించగా.. 12 నామినేషన్లను ఆమోదించారు. కొత్తగూడెం జిల్లాలో 151 నామినేషన్లు దాఖలు కాగా.. 17 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 134 నామినేషన్లు ఎన్నికల అధికారుల ఆమోదం పొందాయి. పాలేరు నియోజకవర్గంలో సీపీఎం డమ్మీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన బత్తుల లెనిన్‌ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. కొత్తగూడెం నియోజకవర్గంలో 25 నామినేషన్లు దాఖలు కాగా.. మూడు నామినేషన్లు తిరస్కరించారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో 29 నామినేషన్లు దాఖలు కాగా.. నాలుగు నామినేషన్లను తిరస్కరించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు