30 శాతం పడకలు అత్యవసర సేవలకే

14 Jun, 2015 01:19 IST|Sakshi

- ప్రతి ఆస్పత్రిలోనూ కేటాయించాలి: లక్ష్మారెడ్డి
- ఆహార పదార్థాల కల్తీని అరికట్టాలని ఆదేశం
 
సాక్షి, హైదరాబాద్:
రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో 30 శాతం పడకలను అత్యవసర సేవా విభాగానికే (ఐసీయూ) కేటాయించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు.

ఆస్పత్రుల్లో అత్యవసర సేవలు, మౌలిక సదుపాయాల కల్పనపై వైద్యవిధాన పరిషత్ కమిషనర్, వైద్య విద్యా సంచాలకులు, ఐపీఎం డెరైక్టర్, నిమ్స్ తదితర అధికారులతో మంత్రి శనివారం సమీక్ష నిర్వహించారు. పూర్తి స్థాయి అత్యవసర సేవలను ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచాలని, ఇందుకోసం కావాల్సిన పరికరాలు, మానవ వనరులకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలన్నారు. నిమ్స్‌లో ‘ఎమర్జెన్సీ మెడిసిన్’ పీజీ కోర్సును ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

కల్తీపై తడాఖా చూపించండి
కల్తీ ఆహార పదార్థాలు, పానీయాలు విక్రయిస్తున్న దుకాణాల్లో తనిఖీలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. మ్యాగీలో ప్రమాదకర పదార్థాలు ఉన్న నేపథ్యంలో మంత్రి ఈ చర్యలకు ఉపక్రమించారు. మామిడికాయలను కృత్రిమంగా మగ్గబెట్టడానికి కార్బైడ్ వాడుతున్నారని పేర్కొన్నారు. పాలల్లో కల్తీ జరుగుతోందని, చిన్న పిల్లలు తాగే పాలల్లో కల్తీ జరిగితే ఉపేక్షించకూడదన్నారు.

మరిన్ని వార్తలు