జీవరాశుల ఉనికి ప్రశ్నార్థకం

12 Apr, 2017 02:24 IST|Sakshi
జీవరాశుల ఉనికి ప్రశ్నార్థకం

మీడియా వర్క్‌షాప్‌లో నిపుణుల హెచ్చరిక
30 ఏళ్లల్లో 30 శాతం జీవరాశులు నశించిపోయే ప్రమాదం
వాతావరణ మార్పులతో వ్యవసాయానికి గడ్డు పరిస్థితి
3 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగితే కొన్ని దేశాలు మునిగిపోతాయి


సాక్షి, హైదరాబాద్‌: రానున్న ఇరవై ముప్పై ఏళ్లల్లో 30 శాతం జీవరాశులు నశించిపోయే ప్రమాదముందని పర్యావరణ పరిరక్షణ, శిక్షణ సంస్థ(ఈఎఫ్‌టీఆర్‌ఐ) డైరెక్టర్‌ జనరల్, పర్యావరణ అటవీ శాఖ ప్రత్యేక కార్యదర్శి బి.కల్యాణచక్రవర్తి ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ సహకారంతో సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌(సీఎంఎస్‌) ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభమైన మీడియా వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. వాతావరణంలో వస్తున్న మార్పులపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మీడియా కీలకపాత్ర పోషించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.

 వాతావరణం చాలావరకు పాడైపోయిన విషయాన్ని మీడియా గుర్తించాలని, అనేక విధానపరమైన అంశాలను ప్రభావితం చేసే శక్తి మీడియాకు ఉందన్నారు. వాతావరణ మార్పులకు సంబంధించి పారిస్‌ ప్రొటోకాల్‌పై మనదేశం సంతకం చేసిందన్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. మూడు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగితే కోట్ల ప్రాణులు చనిపోతాయన్నారు. కార్బన్‌ డై ఆక్సైడ్‌ తగ్గకుంటే భవిష్యత్‌ తరాలు తీవ్రంగా ఇబ్బంది పడతాయన్నారు.

 ఉష్ణోగ్రతలు పెరిగితే మంచు కరిగి సముద్రమట్టం పెరిగి కొన్ని దేశాలు కనుమరుగు అవుతాయని కల్యాణచక్రవర్తి విశ్లేషించారు. వాతావరణ మార్పుల కారణంగా వ్యవసాయానికి గడ్డు పరిస్థితి ఏర్పడనుందన్నారు. ఈ నేపథ్యంలో రైతులు తక్కువ నీటితో వ్యవసాయ పంటలు పండించాలని సూచించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో తాము ఈ మేరకు ప్రయోగాలు చేస్తున్నామన్నారు.

అమరావతికి ముంపు భయం
కృష్ణా నది వరదతో ఏపీ కొత్త రాజ ధాని అమరావతికి ముంపు భయం ఉందని సీనియర్‌ జర్నలిస్టు ఎస్‌.నగేశ్‌కుమార్‌ చెప్పారు. దీనిపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) కూడా హెచ్చరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కృష్ణానదికి తీవ్రమైన వరద వస్తే అమరావతి మునిగిపోతుందని, అయితే అక్కడి ప్రభుత్వం దీనిపై ఎన్‌జీటీకి ఏదో ఒకటి చెప్పి ఒప్పించిందని అన్నారు. డ్రైనేజీలు నిర్మిస్తామని.. తద్వారా వరద ముంపు నుంచి అమరావతిని కాపాడుతా మని చెప్పిందన్నారు. వాస్తవానికి కృష్ణాతీ రానికి 500 మీటర్లలోపు కట్టడాలు నిర్మించ కూడదని, కానీ ఇప్పుడు నిర్మిస్తున్నారని చెప్పారు. జర్మన్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌(జీఐజడ్‌) డైరెక్టర్‌ డాక్టర్‌ అశిశ్‌ చతుర్వేది, సీఎంఎస్‌ డైరెక్టర్‌ జనరల్‌ పి.ఎన్‌.వాసంతి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు