నూనె ఎక్కువేద్దాం!

22 Nov, 2018 02:09 IST|Sakshi

రాష్ట్ర అవసరాలతో పోలిస్తే ఏటా ఎంత తక్కువ ఉత్పత్తి అవుతోంది  3,00,000 టన్నులు

దేశంలోనూ ఇదే పరిస్థితి.. ఏటా 1.4 కోట్ల టన్నుల కొరత 

నూనె గింజల సాగు తక్కువే కారణం...సాగు పెంచడానికి ప్రణాళిక 

రాష్ట్రంలో మరో 6.95 లక్షల ఎకరాల్లో పామాయిల్‌ సాగు... కేంద్రానికి ప్రతిపాదన 

విదేశాల నుంచి దిగుమతి కోసం వెచ్చిస్తున్న మొత్తం 75,000 కోట్ల రూపాయలు

సాక్షి, హైదరాబాద్‌: మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా వంట నూనెల కొరత ఏర్పడింది. నూనె గింజల సాగు తక్కువగా ఉండటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఉద్యానశాఖ అంచనా వేసింది. మన అవసరాలకన్నా 3 లక్షల టన్నులు తక్కువ ఉత్పత్తి ఉంది. మన దేశ అవసరాలకు 2.1 కోట్ల టన్నుల వంట నూనెలు అవసరం కాగా.. 70 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. మిగిలిన 1.4 కోట్ల టన్నుల నూనెను రూ.75 వేల కోట్లు వెచ్చించి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మొత్తం దిగుమతుల్లో 60 శాతం పామాయిల్‌ ఉండటం గమనార్హం.

దేశంలో నూనె గింజల ఉత్పత్తి 2.52 కోట్ల టన్నులు కాగా, అందులో వంట నూనెల ఉత్పత్తి 70 లక్షల టన్నులుగా ఉంది. పైగా ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో ఉత్పాదకత కేవలం మూడో వంతు మాత్రమే. అందుకే ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటోంది. తెలంగాణలో 42 వేల ఎకరాల్లో పామాయిల్‌ సాగవుతోంది. ఖమ్మం, కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేటల్లో సాగు చేస్తున్నారు. కానీ ఉత్పాదకత తక్కువగా ఉండటంతో ఉత్పత్తి పెద్దగా లేదు. దీంతో దేశంలోనూ రాష్ట్రంలోనూ వంట నూనెల కొరత వేధిస్తోంది.   

కార్యాచరణ ప్రణాళిక..
పామాయిల్‌ సాగును పెంచడం ద్వారానే రాష్ట్రంలో వంట నూనెల కొరతను అధిగమించవచ్చని ఉద్యానశాఖ భావిస్తుంది. మరో 75 వేల ఎకరాలకు పామాయిల్‌ సాగు విస్తరిస్తే రాష్ట్రంలో నెలకొన్న 3 లక్షల టన్నుల వంట నూనెల కొరతను అధిగమించవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతమున్న 4 జిల్లాలు కాకుండా ఇతర జిల్లాలకు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. అందుకోసం వివిధ ప్రాంతాల్లో పామాయిల్‌ సాగుకు గల అనుకూలతలను అధ్యయనం చేస్తున్నట్లు ఉద్యానశాఖ డైరెక్టర్‌ వెంకట్రామిరెడ్డి చెబుతున్నారు.

ఇప్పటికే పామాయిల్‌ సాగుకు అనువైన జిల్లాలను సర్వే చేయించామన్నారు. ఆ సర్వే ద్వారా కొత్తగా 18 జిల్లాల్లోని 206 మండలాల్లో 6.95 లక్షల ఎకరాల్లో పామాయిల్‌ సాగుకు అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ఆ స్థాయిలో సాగు పెరిగితే అవసరాలు తీరడమే కాకుండా, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే అవకాశం ఏర్పడుతుంది. దీనికోసం ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టిందన్నారు. కొత్తగా ప్రతిపాదించిన జిల్లాల్లో పామాయిల్‌ సాగుకు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపామన్నారు. క్రూడ్‌ పామాయిల్‌ రికవరీ శాతాన్ని రైతుల కోరిక మేరకు 18.94 శాతంగా నిర్ణయించామని అధికారులు చెబుతున్నారు. గతేడాది ఇది 18.43 శాతంగా ఉంది. దీనివల్ల రైతులకు ఈ ఏడాది పామాయిల్‌ గెలలకు అధిక ధర లభించనుంది. 

మరిన్ని వార్తలు