నాలుగేళ్లలో 3,155 కి.మీ. రోడ్లు

5 May, 2018 01:20 IST|Sakshi

రాష్ట్రానికి వచ్చిన జాతీయ రహదారులు ఇవీ: తుమ్మల 

పలు రోడ్ల పనులకు నేడు కేంద్ర మంత్రి గడ్కరీ శంకుస్థాపన 

సెంట్రల్‌ రోడ్‌ ఫండ్‌ కింద రూ.వెయ్యి కోట్లు అడిగినట్లు వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: ‘‘తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించే నాటికి రాష్ట్ర జాతీయ రహదారుల సగటు 2.2 కిలోమీటర్లు. అది జాతీయ రహదారుల సగటు (2.84 కిలోమీటర్లు) కంటే తక్కువ. ఈ స్థితిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ రహదారుల నిర్మాణానికి నడుం బిగించారు. పలుమార్లు కేంద్రానికి లేఖలు రాశారు. అలా ఎన్నో రహదారులను సాధించుకున్నాం. కేంద్రం నుంచి వచ్చిన అనుమతులతో రాష్ట్రంలో జాతీయ రహదారుల సగటు 4.1 కిలోమీటర్లకు చేరింది. నాలుగేళ్లలో 3,155 కిలోమీటర్ల నిడివి ఉన్న జాతీయ రహదారులు రాష్ట్రానికి వచ్చాయి’’అని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పలు రహదారులకు శంకుస్థాపన చేసేందుకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ శనివారం హైదరాబాద్‌ రానున్నారని చెప్పారు.

శుక్రవారం తుమ్మల విలేకరులతో మాట్లాడుతూ, ‘‘ఔటర్‌ రింగ్‌రోడ్డు నుంచి మెదక్‌ 765డీ జాతీయ రహదారిపై 62.92 కిలోమీటర్ల నిడివి గల రహదారికి గడ్కరీ శంకుస్థాపన చేస్తారు. ఆ రహదారి నిర్మాణం అంచనా రూ.426.52 కోట్లు. భూ సేకరణకు అవసరమైన నిధులను కేంద్రం విడుదల చేస్తుంది. దీనివల్ల హైదరాబాద్‌–నర్సాపూర్‌–కౌడిపల్లి–అప్పాజిపల్లి–రాంపూర్‌–మెదక్‌ పట్టణాల అనుసంధానం జరుగుతుంది. ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది. మెదక్‌ జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాల ఆర్థిక ఆవలంబనకు దోహదపడుతుంది’’అని వివరించారు. 

ప్రాంతీయ ఔటర్‌రింగ్‌ రోడ్డు నిర్మాణానికి ఏర్పాట్లు  
హైదరాబాద్‌–బెంగళూరు 44వ జాతీయ రహదారిపై ఆరాంగఢ్‌–శంషాబాద్‌ మధ్య 10 కిలోమీటర్ల నిడివి గల రహదారిని ఆరు వరుసలుగా నిర్మిస్తామని తుమ్మల తెలిపారు. ఇది రాష్ట్ర రాజధానికి విమానాశ్రయాన్ని కలిపే అతి ముఖ్య రహదారని పేర్కొన్నారు. అంబర్‌పేట్‌ కూడలి వద్ద నాలుగు వరుసల ఫ్లై ఓవర్‌ను నిర్మిస్తామని వెల్లడించారు. హైదరాబాద్‌–భూపాలపట్నం 202వ జాతీయ రహదారిపై హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ వైపు ట్రాఫిక్‌ రద్దీని నివారించేందుకు, హైదరాబాద్‌లో కోఠి–ఉప్పల్‌ మధ్య సిటీ ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఉప్పల్‌లో హైదరాబాద్‌–భూపాలపట్నం 202వ జాతీయ రహదారిపై 6.25 కిలోమీటర్ల నిడివిగల ఆరు వరుసల ఎలివేటెడ్‌ కారిడార్‌ను నిర్మిస్తామని తెలిపారు.

ప్రాంతీయ ఔటర్‌రింగ్‌ రోడ్డు నిర్మాణానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని, సంగారెడ్డి, నర్సాపూర్, గజ్వేల్, జగదేవ్‌పూర్, చేవెళ్ల, శంకర్‌పల్లి తదితర 330 కిలోమీటర్ల పరిధిలో ఇది ఉంటుందని వెల్లడించారు. రూ.7,500 కోట్లు ఇందుకు ఖర్చు కానుందని చెప్పారు. సెంట్రల్‌ రోడ్‌ ఫండ్‌ కింద రూ.వెయ్యి కోట్లు అడిగినట్లు తెలిపారు. గోదావరి తీరం వెంబడి పలు ప్రాజెక్టులను కలిపేలా రహదారి నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు. రోడ్లు భవనాల శాఖలో రిటైరైన వారిని తీసుకోవడంపై విలేకరులు ప్రశ్నించగా, కొత్త రాష్ట్రం కాబట్టి అనుభవజ్ఙులను తీసుకుంటున్నామని తెలిపారు. కోదండరాం ఏర్పాటు చేసిన కొత్త పార్టీపై వ్యాఖ్యానించడానికి తుమ్మల నిరాకరించారు. సమావేశంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్, ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ ఐ.గణపతిరెడ్డి పాల్గొన్నారు.

నేడు నగరంలో కేంద్ర మంత్రి గడ్కరీ పర్యటన 
రూ.1,523 కోట్ల పనులకు శంకుస్థాపన 
సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ శనివారం రాష్ట్రంలో పర్యటించనున్నారు. దీనిలో భాగం గా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. రూ.1,523 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ కార్యక్రమాల్లో హైదరాబాద్‌–బెంగళూరు మధ్య గల ఎన్‌హెచ్‌ 44లో ఆరాంఘర్‌–శంషాబాద్‌ సెక్షన్‌ను ఆరులేన్ల రహదారిగా మార్చడం, ఎన్‌హెచ్‌ 765డి లో హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి మెదక్‌ వరకు రోడ్డు స్థాయిని పెంచ డం, అంబర్‌పేట్‌ ఎక్స్‌ రోడ్డు వద్ద 4 లేన్ల ఫ్లై ఓవర్‌ నిర్మాణం, హైదరాబాద్‌–భూపాలపట్నం సెక్షన్‌లో ఉప్పల్‌ నుంచి నారపల్లి వరకు ఆరులేన్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం వంటి పనులున్నాయి. వీటికి గడ్కరీ శంకు స్థాపన చేస్తారు. రామంతపూర్‌లోని హైదరాబాద్‌ పబ్లిక్‌ గ్రౌండ్స్‌లో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ కూడా పాల్గొంటారు.

మరిన్ని వార్తలు