కువైట్‌ నుంచి సొంత రాష్ట్రానికి..

4 Jul, 2020 06:07 IST|Sakshi
శంషాబాద్‌ విమానా్రశ్రయానికి చేరుకున్న వలస కార్మికులు

హైదరాబాద్‌ చేరుకున్న 320 మంది కార్మికులు  

మాజీ ఎంపీ కవిత చొరవతో ప్రత్యేక విమానం ఏర్పాటు  

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లి కరోనా మూలంగా ఇబ్బందులు పడుతున్న 320 మంది వలస కార్మికులు శుక్రవారం సాయంత్రం రాష్ట్రానికి చేరుకున్నారు. కరోనా మహమ్మారి, లాక్‌డౌన్‌ కారణంగా కువైట్‌లో అనేక మంది వలస కార్మికులు ఉపాధి కోల్పోయారు. దీంతో అనారోగ్యం బారిన పడి ఇబ్బందులు పడుతున్న వీరిని స్వరాష్ట్రానికి రప్పించేందుకు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చొరవతో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు.

వీరంతా శుక్రవారం సాయంత్రం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌కు తరలించారు. కాగా, కువైట్‌లో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను తెలంగాణకు రప్పించేందుకు విమాన అనుమతుల కోసం మాజీ ఎంపీ కవిత సహకారం అందించారని కువైట్‌ తెలంగాణ జాగృతి అధ్యక్షుడు ముత్యాల వినయ్‌కుమార్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా కవితతో పాటు రాష్ట్ర ప్రణాళిక ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.  

షార్జా నుంచి 200 మంది.. 
మోర్తాడ్‌: కరోనా నేపథ్యంలో షార్జాలో ఉద్యోగాలు కోల్పోయి వీధిన పడిన 200 మంది తెలంగాణ వలస కార్మికులు గురువారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. వీరందరిని ఒక ప్రముఖ కంపెనీ తమ క్యాంపు నుంచి తొలగించింది. లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి కోల్పోవడమే కాకుండా ఉండటానికి నివాసం లేక కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. విషయం తెలుసుకున్న ఇండియన్‌ అసోసియేషన్‌ షార్జా (ఐఏఎస్‌), పీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ అండగా నిలిచాయి. షార్జా పోలీసుల సహకారంతో తాత్కాలిక వసతిని, భోజన సదుపాయాలను కల్పించాయి. వలస కార్మికులు ప్రత్యేక విమానంలో గురువారం రాత్రి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. కాగా, వలస కార్మికులకు నాలుగు నెలల పాటు వసతి కల్పించిన షార్జా పోలీసుల సహకారం మరువలేనిదని పీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ కన్వీనర్‌ ఎస్‌వీ రెడ్డి పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు