ప్లాస్మాకు ఓకే

9 May, 2020 10:10 IST|Sakshi

ముందుకు వచ్చిన36 మంది దాతలు

నేటి నుంచి సేకరణ

సోమవారం నుంచి చికిత్సలు షురూ

సాక్షి, సిటీబ్యూరో: ప్లాస్మా థెరపీ చికిత్సలకు గాంధీ ఆస్పత్రి వైద్యులు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే ముందుకు వచ్చిన 36 మంది దాతల నుంచి శనివారం ప్లాస్మాను సేకరించనున్నారు. సోమవారం నుంచి అవసరమైన రోగులకు చికిత్సలు ప్రారంభించనున్నట్లు తెలిసింది. అయితే దీన్ని క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగానే పరిగణించాలని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌(ఐసీఎంఆర్‌)స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న కరోనా బాధితులకు ప్లాస్మాథెరపీ ఓ ఔషధంలా ఉపయోగపడుతుందని వైద్యులు భావిస్తున్నారు. ఆ మేరకు ఇటీవల గాంధీ ఆస్పత్రి వైద్యులు ఐసీఎంఆర్‌కు లేఖ రాయగా ఇప్పటికే ఇందుకు కావాల్సిన అనుమతులు కూడా మంజూరు చేసింది. గాంధీతో పాటు ఈఎస్‌ఐ మెడికల్‌ కాలేజీ, అపోలో గచ్చిబౌలి, ఏఐజీ గచ్చిబౌలి కేంద్రాలకు కూడా ఈ ప్లాస్మా థెరపీ చికిత్సలకు అనుమతులు ఇచ్చింది. అయితే ప్లాస్మాథెరపీ చికిత్సలను వైద్యులు ఇష్టానుసారం కాకుండా ఐసీఎంఆర్‌ ఎంపిక చేసిన రోగులకే చేయాలని నిబంధనలు విధించింది. ప్రస్తుతం వీటిని క్లీనికల్‌ ట్రయల్స్‌ భాగంగా భావించాలని కూడా స్పష్టం చేసింది. 

అత్యవసర రోగులకు ఇదో వరం
తెలంగాణలో గురువారం నాటికి 1122 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వీరిలో ఇప్పటికే 29 మంది మృతి చెందారు. 693 మందిచికిత్సల తర్వాత కోలుకుని డిశ్చార్జి కూడా అయ్యారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 400 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం 15 మంది ఆక్సిజన్‌పై ఉండగా, మరో ఐదుగురు బాధితులు డయాలసిస్‌పై కొనసాగుతున్నారు. వీరిలో కొంత మందికి వెంటిలేటర్‌ చికిత్సలు కూడా అవసరమవుతున్నాయి. హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిత్రోమైసిన్, లోపినవీర్‌ వంటి మందులు వాడినా వైరస్‌ తగ్గకపోగా..వారి ఆరోగ్య పరిస్థితి మరింత విషమిస్తోంది. మృత్యువాతకు కారణమవుతోంది. ఇలాంటి రోగులను కాపాడాలంటే ప్లాస్మాథెరపీ ఒక్కటే పరిష్కారమని వైద్యనిపుణులు భావించారు. ఇప్పటికే అమెరికా సహా పలు దేశాల్లో ఈ తరహా చికిత్సలను అందజేస్తున్నాయి. మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. దీంతో మన దగ్గర చికిత్స పొందుతున్న అత్యవసర రోగులకు కూడా ఈ తరహా చికిత్సలను ప్రారంభించాలని నెల రోజుల క్రితమే వైద్య ఆరోగ్యశాఖ భావించింది. ఆ మేరకు గాంధీ ఆస్పత్రిలో కోవిడ్‌ రోగులకు చికిత్స అందిస్తున్న ఐదుగురు వైద్యులతో ఓ ఎథిక్స్‌ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ మేరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు..అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను ఐసీఎంఆర్‌ దృష్టికి తీసుకెళ్లి, ఈ చికిత్సలకు అనుమతి ఇవ్వాలని కోరింది. చికిత్సల్లో వైద్యులకు ఉన్న అనుభవం..మౌలిక సదుపాయాలను పరిశీలించిన తర్వాత ఐసీఎంఆర్‌ అనుమతులు జారీ చేసింది. అయితే ఏ రోగికి ఈ తరహా చికిత్స చేస్తున్నారో ముందే తమకు తెలియజేయాలని, తాము అనుమతి ఇచ్చిన తర్వాతే చికిత్సలు ప్రారంభించాలని కండిషన్‌ పెట్టింది.

ముందుకు వచ్చిన 36 మంది దాతలు
ఇప్పటికే కరోనా వైరస్‌ భారిన పడి..గాంధీలో చికిత్సల తర్వాత పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయిన 36 మంది దాతలు తమ ప్లాస్మాను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. వీరి నుంచి ప్లాస్మాను శనివారం సేకరించనున్నారు. గాంధీ రక్తనిధి కేంద్రంలోని ఓ ప్రత్యేక మిషన్‌ సహాయంతో రక్తం నుంచి ప్లాస్మాను వేరు చేసి నిల్వ చేయనున్నారు. ఒక్కో దాత నుంచి 400 ఎంఎల్‌ ప్లాస్మాను సేకరించనున్నారు. ఇలా సేకరించిన ప్లాస్మాను ఒక్కో రోగికి 200 ఎంఎల్‌చొప్పున ఇద్దరు రోగులకు ఎక్కించనున్నారు. ఈ సమయంలో దాత శరీరంలోని రక్తం చుక్క కూడా వృథా కాదు. రక్తం నుంచి ప్లాస్మా వేరు చేసిన తర్వాత ఆ రక్తం తిరిగి దాత శరీరంలోకి వెళ్లిపోతుంది. త ద్వారా దాతకు కేవలం ప్లాస్మా మాత్రమే సేకరించడం వల్ల దాతకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇలా సేకరించిన ప్లాస్మాను గ్రూపులుగా విభజించి..రోగి బ్లడ్‌ గ్రూప్‌ ఆధారంగా ప్లాస్మాను వారికి ఎక్కించనున్నారు. తద్వారా రోగనిరోధక శక్తి పెరిగి బాధితులు త్వరగా కోలుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం గాంధీలో ఆక్సిజన్, డయాలసిస్‌పై ఉన్న రోగులకు ఈ తరహా చికిత్సలను అందజేయాలని వైద్యులు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు ఆయా బాధితుల వివరాలను ఐసీఎంఆర్‌కు కూడా పంపినట్లు తెలిసింది. ఐసీఎంఆర్‌ సూచనల మేరకు వారికి చికిత్సలు అందజేయనున్నట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.

మరిన్ని వార్తలు