ప్చ్‌... ఖరీఫ్‌

20 Sep, 2017 02:07 IST|Sakshi
ప్చ్‌... ఖరీఫ్‌

- ఆహారధాన్యాల ఉత్పత్తి
- 36 లక్షల టన్నులే
- నిర్ధారించుకున్న లక్ష్యంలో
- 17 లక్షల టన్నులు తగ్గుదల
- అందులో వరి ఉత్పత్తే 10 లక్షల టన్నులు తగ్గుతున్న వైనం
- 2017–18 ఖరీఫ్‌ పంట ఉత్పత్తుల అంచనా నివేదిక విడుదల


సాక్షి, హైదరాబాద్ ‌: ఈసారి ఖరీఫ్‌ ఆహారధాన్యాల ఉత్పత్తి 36.87 లక్షల టన్నులకే పరిమితం కానుంది. వ్యవసాయ శాఖ నిర్ధారించుకున్న లక్ష్యానికి ఏ మాత్రం చేరువలోకి ఉత్పత్తి వచ్చే పరిస్థితి లేదని ప్రభుత్వం అంచనా వేసింది. 2017–18 ఖరీఫ్‌ పంట ఉత్పత్తుల మొదటి ముందస్తు అంచనా నివేదికను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. ఆ వివరాలను వ్యవసాయ శాఖ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి.

ఈ ఖరీఫ్‌లో 54.60 లక్షల టన్నుల ఆహారధాన్యాలను పండించాలని నిర్దేశించుకోగా, 36.87 లక్షలే ఉత్పత్తి ఉంటుందని తెలిపాయి. అంటే 17.73 లక్షల టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి తగ్గనుంది. గతేడాది ఖరీఫ్‌తో పోల్చినా దాదాపు అదే స్థాయిలో ఆహారధాన్యాల ఉత్పత్తి పడిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. 2016 ఖరీఫ్‌లో ఆహారధాన్యాల ఉత్పత్తి 54.54 లక్షల టన్నులు కాగా, ఈసారి మాత్రం ఖరీఫ్‌ నిరాశపరిచిందని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

10 లక్షల టన్నులు తగ్గిన వరి..
ఆహారధాన్యాల్లో అత్యంత కీలకమైన వరి పూర్తిగా నిరాశపరచనుంది. ఈసారి వరి ఉత్పత్తి లక్ష్యం 32.47 లక్షల టన్నులు కాగా, 22.66 లక్షల టన్నులే ఉత్పత్తి కావొచ్చని అంచనా. అంటే లక్ష్యంలో 9.81 లక్షల టన్నుల వరి ఉత్పత్తి తగ్గనుంది. గతేడాది ఖరీఫ్‌లో వరి ఉత్పత్తి 29.18 లక్షల టన్నులు. అంటే గతేడాదితో పోలిస్తే ఆరున్నర లక్షల టన్నులు తగ్గింది. మొక్కజొన్న ఉత్పత్తి లక్ష్యం 18.64 లక్షల టన్నులు కాగా, 11.86 లక్షల టన్నులే ఉత్పత్తి కావొచ్చని అంచనా వేశారు. జొన్న ఉత్పత్తి లక్ష్యం 50 వేల టన్నులు కాగా, 29 వేల టన్నులే ఉత్పత్తి కానుంది. పప్పుధాన్యాల ఉత్పత్తి కూడా గణనీయంగా పడిపోనుందని వ్యవసాయ శాఖ తెలిపింది.

2.94 లక్షల టన్నుల పప్పుధాన్యాలు ఉత్పత్తి అవుతాయని అంచనా వేయగా, 2.03 లక్షల టన్నులే ఉత్పత్తి కానున్నాయి. పప్పు ధాన్యాల ఉత్పత్తి ఏకంగా 91 వేల టన్నులు తగ్గనుంది. గతేడాది 3.58 లక్షల టన్నుల పప్పుధాన్యాలు ఉత్పత్తి అయ్యాయి. పప్పుధాన్యాల్లో కీలకమైన కంది పప్పు ఉత్పత్తి అంచనా 2.03 లక్షల టన్నులు కాగా, 1.34 లక్షల టన్నులే పండనున్నట్లు నివేదిక తెలిపింది. పెసర 64 వేల టన్నులు పండుతుందని అనుకోగా, 49 వేల టన్నులకే పరిమితం కానుంది. సోయాబీన్‌ ఉత్పత్తి లక్ష్యం 2.97 లక్షల టన్నులు కాగా, 1.71 లక్షల టన్నులకే పరిమితమైంది.

వర్షాభావంతో ఖరీఫ్‌కు కష్టాలు
ఈసారి ఖరీఫ్‌ సీజన్‌ పత్తి మినహా ఏ పంటలకూ పెద్దగా సహ కరించలేదు. ఆహారధాన్యాల పంటల సాగు అనుకున్నంత స్థాయిలో జరగలేదు. అందులో ముఖ్యంగా వరి నాట్లు 76 శాతానికే పరిమితమ య్యాయి. ఖరీఫ్‌ ఆహారధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 48.70 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 39.25 లక్షల (81%) ఎకరాల్లోనే సాగయ్యాయి. గతేడాది ఖరీఫ్‌లో ఆహారధాన్యాలు 48.07 లక్షల ఎకరాల్లో సాగైతే, ఈసారి ఏకంగా 39.25 లక్షల ఎకరాలకు అంటే 8.82 లక్షల ఎకరాలు తగ్గింది.

అందులో వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.35 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 17.65 లక్షల (76%) ఎకరాలకే పరిమితమైంది. ఆహారధాన్యాల్లో కీలకమైన పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం ఖరీఫ్‌లో 10.55 లక్షల ఎకరాలు కాగా, 9.22 లక్షల (88%) ఎకరాలకే పరిమితమైంది. అందులో కంది సాధారణ సాగు విస్తీర్ణం 6.95 లక్షల ఎకరాలకు గాను 6.25 లక్షల ఎకరాలకే పరిమితమైంది. గతేడాది ఖరీఫ్‌లో కంది ఏకంగా 10.77 లక్షల ఎకరాల్లో సాగు కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు