న్యూయార్క్, న్యూజెర్సీలలో భయం.. భయం!

28 Mar, 2020 03:09 IST|Sakshi

వేల కరోనా కేసులతో తెలుగు ప్రజల బెంబేలు

ఒక్క న్యూయార్క్‌ నగరంలోనే 38,987 కేసులు

న్యూజెర్సీలో 6,876 మంది కరోనా బాధితులు

బిక్కుబిక్కుమంటూ ఇళ్లకే పరిమితమైన తెలుగువారు

విమానాలు నడిస్తే స్వదేశం వెళ్లిపోతామంటూ సందేశాలు

తెలుగు రాష్ట్రాల్లోని వారి కుటుంబాల్లో ఆందోళన  

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలుగు ప్రజలు అత్యధిక సంఖ్యలో నివసించే న్యూజెర్సీ, దాని పక్కనే ఉన్న న్యూయార్క్‌ నగరం కుప్పలు తెప్పలుగా నమోదవుతున్న కరోనా కేసులతో తల్లడిల్లుతోంది. న్యూజెర్సీతోపాటు కాలిఫోర్నియాలోనూ రికార్డు సంఖ్యలో కేసులు నమోదు కావడం భారతీయ కుటుంబాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రానికి ఒక్క న్యూయార్క్‌ నగరంలో 38,987 కేసులు నమోదుకాగా దాన్ని ఆనుకొని ఉన్న న్యూజెర్సీలో 6,876 మంది కరోనా బారినపడ్డారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కరోనా లక్షణాలు కనిపించిన మొదట్లో అత్యధిక కేసులతో మొదటి రెండు స్థానాల్లో ఉన్న వాషింగ్టన్, కాలిఫోర్నియా రాష్ట్రాలు ఇప్పుడు మూడు, నాలుగు స్థానాలకు పడిపోగా మార్చి మొదటి వారంలో మొదటి 10 స్థానాల్లోనూ లేని న్యూయార్క్, న్యూజెర్సీ ఇప్పుడు మొదటి రెండు స్థానాలకు ఎగబాకడం ఆందోళన కలిగిస్తోంది. న్యూయార్క్‌లో ఈ వ్యాధి బారినపడ్డ వారిలో 432 మంది మృత్యువాతపడ్డారు. న్యూజెర్సీలో 6,876 మందికి పాజిటివ్‌ రాగా చికిత్స పొందుతూ వారిలో 81 మంది మరణించారు.

స్తంభించిన కాలిఫోర్నియా... 
న్యూయార్క్‌లో ఉద్యోగాలు చేసే భారతీయులంతా తక్కువ వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని న్యూజెర్సీ, కనెక్టికట్‌ వంటి పొరుగు రాష్ట్రాల్లో ఉంటారు. రెండేళ్ల క్రితం నాటి లెక్కల ప్రకారం న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్‌ రాష్ట్రాల్లో 7.68 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. ఆ మూడు రాష్ట్రాల్లో ఉన్న అమెరికన్లతో పోలిస్తే మన వాళ్లు 3.8 శాతం ఉండగా శాన్‌ఫ్రాన్సిస్‌కో, అలమేద (కాలిఫోర్నియా) కౌంటీల్లో భారతీయులు 3.4 శాతం మంది ఉన్నారు. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లోనూ కరోనా వ్యాధి బారిన పడ్డ వారు ఎక్కువ సంఖ్యలో ఉండటం సహజంగానే ఇక్కడి వారి కుటుంబాలు ఆందోళనగా ఉన్నాయి. కాలిఫోర్నియాలో ఈ నెల మొదటి వారంలో కేసులు నమోదు కావడంతోనే ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. ఇప్పుడు కాలిఫోర్నియా రాష్ట్రంలోని దాదాపు 4 కోట్ల ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.

మనవారిలో గుబులు... 
న్యూయార్క్, న్యూజెర్సీలలో పరిస్థితి తీవ్రంగా ఉన్న దృష్ట్యా ఎవ్వరూ గడప దాటి బయటకు రావడం లేదు. ఒక్క న్యూయార్క్‌ నగరంలోనే భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రానికి 38,987 కేసులు నమోదయ్యాయి. న్యూజెర్సీ రాష్ట్రంలోని జెర్సీలో వందల సంఖ్యలో కరోనా కేసులు పాజిటివ్‌ రావడంతో అక్కడ నివసించే తెలుగు ప్రజలు బిక్కుబిక్కుమం టూ కాలం గడుపుతున్నారు. ‘మేము నివా సం ఉండే కమ్యూనిటీలో 123 కేసులు నమోదయ్యాయి. బయటకు వెళ్లాలంటే భయమేస్తోంది. నెల రోజులకు సరిపడా ఉన్న సరుకులు 2 మాసాల దాకా వచ్చేలా పరిమితంగా వాడుకుంటున్నాం. భారత్‌లో కరోనా కేసులు ఉన్నా ఇప్పుడు విమానాలు నడిస్తే ఇక్కడి నుంచి రావాలని ఉంది’అని పుంజాల సుస్మిత వాపోయింది. న్యూజెర్సీ తెలుగు కమ్యూనిటీ వాట్సాప్‌ గ్రూపులో ఆమె పెట్టిన సందేశం చూసి గ్రూపు సభ్యులంతా తాము అండగా ఉన్నామని, భయం వద్దని ధైర్యం చెప్పారు. కూతురు దగ్గరకు వెళ్లిన 64 ఏళ్ల కుంచాల అప్పిరెడ్డి తనను భారత్‌ పంపించాలని వేడుకుంటున్నాడు. అంతర్జాతీయ విమాన సర్వీసులకు భారత్‌ అవకాశమిస్తే తామంతా స్వదేశం వెళ్లడానికి సాయం చేస్తామని గ్రూపు సభ్యులు హామీ ఇచ్చారు.

గర్భిణులకు ఇబ్బంది... 
కొందరు గర్భిణులైన తెలుగు మహిళలు ప్రసవ సమయంలో అండగా ఉండేందుకు భారత్‌ నుంచి తల్లిదండ్రులను రప్పించడానికి విమాన టిక్కెట్లు బుక్‌ చేసినా వారు వచ్చే అవకాశం లేకపోవడంతో తల్లడిల్లుతున్నారు. ప్రసవ సమయంలో భారతీయ మహిళలు తప్పనిసరిగా భర్తతోపాటు తల్లి కూడా తోడుగా ఉండాలని కోరుకుంటారు. న్యూజెర్సీలో ఉండే మల్లు శ్రీదేవి (29) 8 నెలల గర్భిణి. ‘నేను, నా భర్త మాత్రమే ఇక్కడ ఉన్నాం. నా తల్లిదండ్రులు ఏప్రిల్‌ 11న రావడానికి టికెట్లు కూడా బుక్‌ చేసుకున్నారు. కానీ వారు రాకపోవచ్చు. డాక్టర్‌ చెప్పిన దాని ప్రకారం ఏప్రిల్‌ 20–22 నా ప్రసవ తేదీ. ఇప్పుడు నా పరిస్థితిని తలచుకుంటే కన్నీరు ఉబికి వస్తోంది’అంటూ పెట్టిన వాట్సాప్‌ సందేశం మిగిలిన వారిని కదిలించింది. ప్రసవ సమయంలో తాము అండగా ఉంటామని, కరోనాను లెక్కచేయబోమని గ్రూపులో ఉన్న అనేక మంది తెలుగు మహిళలు మద్దతు ప్రకటించారు.

మరిన్ని వార్తలు