కేటీఆర్‌ చొరవతో సౌదీ నుంచి రాష్ట్రానికి..

18 Jun, 2019 02:33 IST|Sakshi
స్వదేశానికి చేరుకున్న కార్మికులు

39 మంది కార్మికులకు బాసట 

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన 39 మంది తెలంగాణ వాసులు.. టీఆర్‌ఎస్‌ కార్వనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ చొరవతో సోమవారం రాష్ట్రానికి చేరుకున్నారు. కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందిన సుమారు 60 మంది కార్మికులు సౌదీ అరేబియాలోని ఓ నిర్మాణరంగ సంస్థలో పని కోసం వెళ్లారు. 2018 ఏప్రిల్‌ తర్వాత సదరు కంపెనీ పూర్తి స్థాయిలో మూతపడింది. దీంతో అక్కడే చిక్కుకున్న కార్మికులు ఆహారం, వసతి వంటి కనీస మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

కార్మికులు తమ కష్టాలను ట్విట్టర్‌ ద్వారా కేటీఆర్‌ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన కేటీఆర్‌.. వారికి సహాయం అందించేందుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని ఆదేశించారు. అలాగే ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో సౌదీలోని భారత రాయబార కార్యాలయం స్పందిం చి.. కార్మికుల సమాచారం ఆధారంగా వారిని గుర్తించి తెలంగాణకు పంపేందుకు ఏర్పాట్లు చేసింది. కార్మికుల వద్ద ఉన్న వర్క్‌ పర్మిట్‌ వీసా గడువు పూర్తవడంతో భారత రాయబార కార్యాలయం వారికి తాత్కాలిక ఎగ్జిట్‌ వీసాలను మంజూరు చేసింది. దీంతోపాటు తిరుగు ప్రయాణానికి వీలుగా విమాన టికెట్లు సమకూర్చింది.  

కేటీఆర్‌ హర్షం.. 
కార్మికులు సౌదీ నుంచి స్వరాష్ట్రానికి చేరుకోవడం పట్ల కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. సౌదీలోని భారత రాయబార కార్యాలయంతోపాటు, తెలంగాణ ఎన్నారై శాఖాధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్నారై శాఖ అధికారి చిట్టిబాబు కార్మికులను సోమవారం శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి వారి స్వస్థలాలకు పంపేలా ఏర్పాట్లు చేశారు.  

చాలా ఇబ్బందులు పడ్డాం.. 
కంపెనీ మూతపడటంతో చాలా ఇబ్బందులు పడ్డాం. ఏడాదిగా జీతాలు కూడా లేవు. మా పత్రాలు రెన్యువల్‌ కాకపోవడంతో బయట కూడా తిరగలేని పరిస్థితి ఎదురైంది. విదేశాంగ అధికారులు చొరవ తీసుకున్నారు. మాజీ మంత్రి కేటీఆర్, ఎన్నారై సెల్‌ వారందరూ సహకరించడంతో స్వదేశానికి వచ్చాం.  
    – రవి, నిర్మల్‌ జిల్లా 

మరిన్ని వార్తలు