ఎన్‌కౌంటర్‌ ప్రదేశం త్రీడీ స్కానర్‌తో చిత్రీకరణ 

10 Dec, 2019 02:46 IST|Sakshi

సాక్షి, షాద్‌నగర్‌ : దిశ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన ప్రదేశాన్ని క్లూస్‌ టీం సోమవారం మధ్యాహ్నం త్రీడీ స్కానర్‌తో చిత్రీకరించింది. 8 మంది సభ్యులతో కూడిన బృందం ప్రతినిధులు చటాన్‌పల్లి బ్రిడ్డి వద్దకు చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దిశను దహనం చేసిన స్థలంతో పాటు హంతకులను ఎన్‌కౌంటర్‌ చేసిన ప్రాంతాన్ని పూర్తి త్రీడీ స్కానర్‌తో చిత్రీకరించారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశ స్వభావం మారిపోయినా గుర్తించేందుకు వీలుగా క్లూస్‌టీం సభ్యులు ఆ ప్రాంతాన్ని మొత్తం స్కాన్‌ చేసి వీడియో చిత్రీకరణ చేయడంతో పాటుగా ఫొటోలు తీసుకున్నారు.

ఎన్‌కౌంటర్‌ ఘటనాస్థలం వద్ద మరిన్ని ఆధారాలు సేకరించారు. సుమారు రెండున్నర గంటల పాటు టీం సభ్యులు ఇక్కడే ఉన్నారు. కాగా ఎన్‌కౌంటర్‌ జరిగిన చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. సుమారు 50 మంది పోలీసులు ఇక్కడ విధుల్లో ఉన్నారు. ఎన్‌కౌంటర్‌ ఘటనా స్థలానికి ఎవరూ వెళ్లకుండా జాతీయ రహదారి వద్దే జనాన్ని కట్టడి చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు