ఇక అంతా ‘3డీ స్కానింగ్‌’ 

11 Dec, 2019 02:56 IST|Sakshi

హైదరాబాద్‌ పోలీసుల వద్ద అధునాతన స్కానర్లు 

నేర, బందోబస్తు స్థలాల చిత్రీకరణకు వినియోగం 

చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌ స్పాట్‌ను రికార్డు చేసిన టీమ్‌ 

సాక్షి, హైదరాబాద్‌ : నేర, ఘటన స్థలాలను అన్ని కోణాల్లో సమగ్రంగా రికార్డు చేసే ‘3డీ స్కానర్లు’ ప్రస్తుతం ఒక్క హైదరాబాద్‌ క్లూస్‌ టీమ్‌ వద్ద మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఔట్‌ డోర్‌ 3డీ స్కానర్‌ను సోమవారం చటాన్‌పల్లి వద్ద వినియోగించారు. వంతెన పై నుంచి ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతాన్ని దాదాపు రెండు గంటల పాటు చిత్రీకరించారు. భవిష్యత్తులో ఈ రికార్డులు అనేక విధాలుగా ఉపయుక్తంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

దేశంలోని మరే ఇతర పోలీసు విభాగం వద్ద అందుబాటులో లేని ఈ స్కానర్లను సిటీ పోలీసులు కీలక నేరాల సందర్భంలో వినియోగిస్తున్నారు. ఎలాంటి నేరం, ప్రమాదం, ఇతర ఉదంతం జరిగినా ఘటనాస్థలికి చేరుకునే పోలీసు అధికారులు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. నేరగాళ్లు ఏవైనా సాక్ష్యాధారాలను విడిచిపెట్టారా? నేరం ఎలా చేశారు? తదితర అంశాలను పరిశీలించాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో క్రైమ్‌ సీన్స్‌కు వెళ్లే అధికారులు తమ దృష్టిని మృతదేహాలు, బాధితుల తరలింపు పైనే పెట్టడం అనివార్యంగా మారింది.

దీంతో అనేక ఆధారాలను గుర్తించడంలో విఫలమై కేసుల దర్యాప్తు, నిందితుల గుర్తింపు ఎక్కువ కాలం పడుతోంది. ఇది అనేక సందర్భాల్లో నేరగాళ్లకు కలిసి వస్తోంది. క్రైమ్‌ సీన్‌ పరిశీలనకు తోడు ప్రతి నేర స్థలానికి సంబంధించిన మ్యాప్‌ను రూపొందించడం దర్యాప్తులో అనివార్యం. దీన్ని ఎఫ్‌ఐఆర్‌ తదితర పత్రాలతో పాటు న్యాయస్థానంలో దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎన్‌కౌంటర్లు జరిగినా మ్యాప్‌ను రూపొందించి ఇతర పత్రాలతో పాటు కోర్టుకు అందిస్తారు.

పోలీసు విభాగం గతంలో ఈ మ్యాప్‌లను తెల్లకాగితాలపై చేతులతో గీసేది. దీనికి తోడుగా ఘటనాస్థలికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను జత చేసి న్యాయస్థానానికి అందించేది. అనేక సందర్భాల్లో వీటిలో పూర్తి వివరాలు పొందుపరచలేని పరిస్థితులు ఉండేవి. నేర స్థలాలు ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. ఇల్లు, కార్యాలయం తదితర ఇండోర్‌... రోడ్డు, బహిరంగ ప్రదేశం వంటి ఔట్‌ డోర్‌ క్రైమ్‌ సీన్స్‌ను పోలీసులు సందర్శిస్తుంటారు.

ఈ నేపథ్యంలోనే రెండు రకాలైన క్రైమ్‌సీన్స్‌కు వినియోగించేలా ఇండోర్, ఔట్‌డోర్‌ మోడ్స్‌తో కూడిన 3 డీ స్కానర్లు ఖరీదు చేశారు. 3 డీ పరిజ్ఞానంతో పని చేసే ఈ స్కానర్‌ను నేరం/ఉదంతం జరిగిన ప్రాంతంలో ఓ నిర్దిష్ట ప్రదేశంలో ఏర్పాటు చేస్తారు. ఆ పాయింట్‌ కేంద్రంగా ఈ కెమెరాతో కూడిన స్కానర్‌ అన్ని దిక్కుల్నీ, అక్కడ ఉన్న వస్తువులు తదితరాలను చిత్రీకరిస్తుంది. కేవలం వాటి 3 డీ చిత్రాలు మాత్రమే కాకుండా ఆ సీన్‌ ఆఫ్‌ అఫెన్స్‌లోని ప్రాంతాలు, వస్తువులు, మృతదేహాలు పడిన ప్రాంతాల మధ్య ఎంత దూరం ఉందనేదీ ఈ స్కానర్‌ స్పష్టంగా నమోదు చేస్తుంది.

మెమోరీ కార్డులు, సీడీలు, కంప్యూటర్లతో పాటు హార్డ్‌కాపీలుగానూ ఈ రికార్డుల్ని భద్రపరిచి, దర్యాప్తు అధికారులు ఎప్పుడు కావాలంటే అప్పుడు పరిశీలించే అవకాశం ఉంటుంది. అవసరమైన సందర్బాల్లో వీటినే న్యాయస్థానాల్లోనూ దాఖలు చేయవచ్చు. చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌ సైట్‌ను ఈ స్కానర్‌లో రికార్డు చేసిన అధికారులు దీన్ని అవసరమైన సందర్భాల్లో వినియోగిస్తామని చెబుతున్నారు.   

వివిధ రకాలుగా వినియోగం... 

  • రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వాటి తీరుతెన్నుల రికార్డు 
  • బాడీలీ అఫెన్సులకు సంబంధించిన నేర స్థలాల చిత్రీకరణ 
  • పారిశ్రామికవాడల్లో చోటు చేసుకునే దుర్ఘటనల నమోదు 
  • బందోబస్తు ప్లానింగ్‌ కోసం సభలు, సమావేశ ప్రాంతాల చిత్రీకరణ  
  • ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాటి తీవ్రత అంచనా 
  • బాంబు పేలుళ్ల వంటి ఉగ్రవాద చర్యలు జరిగినప్పుడు రికార్డింగ్‌ 
  • బహిరంగ ప్రదేశాల్లో ఎన్‌కౌంటర్లు జరిగితే పక్కాగా రికార్డు చేయడానికి..  
మరిన్ని వార్తలు