లేని భూమి ఉన్నట్టు.. లోన్‌ కోసం కనికట్టు

3 Jul, 2018 02:11 IST|Sakshi

యజమాని పేరు మార్చేసి లోన్లు కొట్టేశారు

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు రూ.4 కోట్ల కుచ్చుటోపీ

సాక్షి, హైదరాబాద్‌: నిర్మాణ రంగంలోని ఓ కంపెనీ దా‘రుణం’ఒకటి వెలుగు చూసింది. లేని భూమిని ఉన్నట్టు చూపించి, భూయజమాని పేరు మార్చి నకిలీ డాక్యుమెంట్లతో నమ్మించారు. బ్యాంకు అధికారులతో కలసి రూ.4 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10లో ఉన్న ఎస్‌ఎంవీ కంపెనీ ఐరన్‌ ఓర్‌ కొనడం అమ్మడంతోపాటు నిర్మాణ రంగంలో పెట్టుబడి కోసం నగరంలోని ముషీరాబాద్‌ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును ఆశ్రయించింది. ఈ కంపెనీ ఎండీ కందుల శ్రీనివాస్, డైరెక్టర్‌ వంద్రాసి సన్యాసి వైజాగ్‌లోని మధురవాడలో 1.32 ఎకరాల ఖాళీ స్థలాన్ని కొలెటరల్‌గా పెట్టి రూ.4 కోట్ల రుణం కోసం దరఖాస్తు చేశారు. బ్యాంకు అధికారులు డాక్యుమెంట్లను పూర్తిస్థాయిలో వెరిఫికేషన్‌ చేయలేదు.

క్షేత్రపరిశీలనకు వెళ్లిన బ్యాంకు న్యాయవాది తప్పుడు రిపోర్టు సమర్పించారు. దీంతో బ్యాంకు చీఫ్‌ మేనేజర్‌ డీపీ దాస్‌ రూ.4 కోట్ల రుణం మంజూరు చేశారు. ఇదంతా 2013లో జరిగింది. ఐరన్‌ ఓర్, నిర్మాణ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తామని చెప్పిన ఎండీ, డైరెక్టర్‌ బ్యాంకు రుణాన్ని తమ వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించుకొని వాడుకున్నట్లు 2016లో బ్యాంకు విచారణలో బయటపడింది. 2014–15 ఏడాదికి సంబంధించి కంపెనీ లావాదేవీలు తదితర బ్యాలెన్స్‌ షీట్‌ సమర్పించలేదు.

కంపెనీ 2015 మే 22న కంపెనీ ఎన్‌పీఏ లిస్ట్‌లోకి చేరిపోయింది. దీంతో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు హైదరాబాద్‌ రీజియన్‌ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ డి నోబెల్‌ అంబేడ్కర్‌ అంతర్గత విచారణకు ఆదేశించారు. విచారణలో భాగంగా మార్ట్‌గేజ్‌ చేసిన వైజాగ్‌ భూమి వివరాలు తెలుసుకున్న విచారణ కమిటీ షాక్‌కు గురైంది. తనఖా పెట్టిన భూమి తాలూకు పత్రాలు నకిలీ వని తేలింది. అదే సర్వే నంబర్‌తో ఉన్న భూమి మరోవ్యక్తికి చెందిందని రిజిస్ట్రేషన్, రెవెన్యూ అధికారుల ద్వారా గుర్తించారు.

తహసీల్దార్‌ పేరుతో ముద్రించిన స్టాంప్‌ సైతం నకిలీదని తేల్చారు. డీపీ దాస్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, కంపెనీ దాఖలు చేసిన ఐడీ వివరాలు గుర్తించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు కమిటీ నివేదించింది. ప్యానల్‌ అడ్వొకేట్, డీపీ దాస్‌ డైరెక్టర్లతో కలసి బ్యాంకు నష్టపోయేలా వ్యవహరించారని తేలడంతో నోబెల్‌ అంబేడ్కర్‌ సీబీఐకి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ చేసిన సీబీఐ ప్రధాన నిందితుడిగా డీపీ దాస్‌(ఏ1), కందుల శ్రీనివాస్‌ ఏ2గా, వంద్రాసి సన్యాసి ఏ3గా, గ్యారంటీర్‌గా ఉన్న చంద్రకాంత్‌ ఏ4గా, ప్యానల్‌ అడ్వొకేట్‌ కేవీ శ్రీధర్‌(ఏ5గా)పై కేసు నమోదు చేసింది.

>
మరిన్ని వార్తలు