జలాశయాల్లోకి 4 కోట్ల రొయ్యలు

24 Oct, 2018 01:21 IST|Sakshi

గతేడాది మంచి లాభాలు రావడంతో ప్రత్యేక దృష్టి 

సాక్షి, హైదరాబాద్‌: నీలకంఠ రొయ్యల ఉత్పత్తి మత్స్యకారులకు మంచి లాభాలు తెచ్చిపెడుతుండటంతో ఈ సారి దాదాపు 4.07 కోట్ల రొయ్యలను వదిలేందుకు మత్యశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. 23 రిజర్వాయర్లలో వీటిని వదలాల్సి ఉండగా ఇప్పటికే పలు జలాశయాల్లో వదిలారు. గతేడాది రూ.కోటి పెట్టుబడితో రొయ్యలను వదలగా ఏకంగా ఏడింతలు రూ.8 కోట్ల పైన లాభాలు రావడం విశేషం. గతేడాది పైలట్‌ ప్రాజెక్టు కింద ప్రారంభించిన ఈ పథకం మత్స్యశాఖకు మంచి ఫలితాలను తెచ్చిపెట్టింది.

గత నవంబర్‌లో పైలట్‌ ప్రాజెక్టు కింద 11 రిజర్వాయర్లలో రూ.1.39 కోట్లతో 1.08 కోట్ల నీలకంఠ రొయ్యలను వదిలారు. ఒక్కో రొయ్య పిల్లకు రూ.1.28 చొప్పున 1.08 కోట్ల రొయ్య పిల్లలకు మొత్తం రూ.1.39 కోట్లు ఖర్చయ్యాయి. వీటికి రూ. 8.06 కోట్లు పైన లాభాలు వచ్చాయి. 10 వేల మంది మత్స్యకారులకు మంచి ఆదాయం సమకూరింది. కాగా ఈ సారి నిజాంసాగర్‌ ప్రాజెక్టు, సింగూర్‌ ప్రాజెక్టు, కడెం, ఎస్సార్‌ఎస్పీ, ఎల్‌ఎండీ, ఎగువ మానేరు, పోచారం ప్రాజెక్టు, సతనాల, మత్తడివాగు, శ్రీపాద ఎల్లంపల్లి, శ్రీ కొమురం భీం ప్రాజెక్టు, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, మూíసీ ప్రాజెక్టు, దిండి, కోయిల్‌ సాగర్, పాలేరు, వైరా, లంకసాగర్, పెద్దవాగు ప్రాజెక్టు, తాలిపేరు, ఘన్‌పూర్‌ ములుగు ప్రాజెక్టు, శనిగరం ప్రాజెక్టుల్లో రొయ్యలు వదులుతున్నారు. 

యూరోపియన్‌ దేశాలకు ఎగుమతి.. 
నీలకంఠ రొయ్య (స్కాంపి) నీలంరంగులో రెండు పొడువైన కాళ్లు కలిగి ఉంటుంది. 1.5 అంగుళాల సైజులో ఉండే ఈ రొయ్య పిల్లలు 4 నుంచి 6 నెలల్లో దాదాపు 100గ్రా. వరకు బరువు పెరుగుతాయి. వీటికి మార్కెట్‌ ధర కిలోకు రూ.240 వరకు ఉంటుంది. ఈ రొయ్యలు ఎక్కువగా యూరోపియన్‌ దేశాలకు ఎగుమతవుతాయి.   

మరిన్ని వార్తలు