4 హత్యలు.. ఒక ఆత్మహత్య!

18 Oct, 2017 01:39 IST|Sakshi

ఔటర్‌రింగ్‌ రోడ్డుపై కొల్లూరు సమీపంలో ఐదు మృతదేహాలు

ఓ చోట మూడు.. 2 కి.మీ. దూరంలోనే మరో రెండు మృతదేహాలు

భార్య, కొడుకు, పిన్ని, ఆమె కూతురుతో కలసి డిండి ప్రాజెక్టుకు వెళ్లిన ప్రభాకర్‌రెడ్డి 

తిరిగి వస్తూ మార్గం మధ్యలో అందరికీ విషం కలిపిన కేక్, నీళ్లు ఇచ్చిన వైనం 

తర్వాత తానూ తీసుకొని ఆత్మహత్య షేర్‌ మార్కెట్‌లో ఇటీవల భారీ నష్టాలు 

రూ.30 కోట్లకుపైగా అప్పులు 

పెద్దమొత్తంలో డబ్బు ఇచ్చిన ఆయన పిన్ని 

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

సాక్షి, హైదరాబాద్‌/మణికొండ/సంగారెడ్డి/పటాన్‌చెరు: అంతా దగ్గరివారే.. పిన్ని, ఆమె కూతురు.. భార్యాభర్త.. వారి మూడేళ్ల కొడుకు.. అందరూ డిండి ప్రాజెక్టు చూసొద్దామని సరదాగా కారులో బయల్దేరారు.. సోమవారం మధ్యాహ్నం బయల్దేరిన వీరు రాత్రి వరకు కూడా ఇంటికి చేరలేదు.. కుటుంబీకులు ఆందోళన చెందారు.. పోలీసులకు చెప్పారు.. ఆచూకీ తెలియలేదు.. తెల్లారింది.. మంగళవారం ఉదయంకల్లా వారంతా శవాలై కనిపించారు! అదీ ఓచోట మూడు.. అక్కడికి 2 కి.మీ. దూరంలోనే మరో రెండు మృతదేహాలు! మొత్తం ఐదుగురు విగతజీవులయ్యారు. ఏమైంది..? వారంతా ఎందుకు చనిపోయారు..? ఆత్మహత్య చేసుకున్నారా? లేదా వారిలోనే ఒకరు మిగతా అందరికీ విషమిచ్చి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడా? ప్రస్తుతానికి ఇదంతా మిస్టరీ. హైదరాబాద్‌ శివారులోని ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఉన్న కొల్లూరు సమీపంలో వెలుగుచూసిన ఈ ఉదంతం తీవ్ర సంచలనం సృష్టించింది.

మృతులను రామచంద్రాపురం మండలం అశోక్‌నగర్‌కు చెందిన పటోళ్ల ప్రభాకర్‌రెడ్డి(32), అతడి భార్య మాధవి(28), కుమారుడు వశిష్ట్‌ రెడ్డి(రెండున్నరేళ్లు), అమీన్‌పూర్‌ మండల కేంద్రం సిగ్నోడ్‌ కాలనీకి చెందిన ప్రభాకర్‌రెడ్డి చిన్నమ్మ కొండాపురం లక్ష్మీ(45), ఆమె కుమార్తె సింధుజగా (16)గా గుర్తించారు. ‘నాలుగు హత్యలు, ఒక ఆత్మహత్య’గా భావిస్తున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే అంతా ఒకేచోట చనిపోయేవారని, అలాకాకుండా ముగ్గురు ఒక చోట, మరో ఇద్దరు మరోచోట పడి ఉండటంతో ఈ అనుమానం వ్యక్తంచేస్తున్నారు. కారులో ఆరు వాటర్‌ బాటిల్స్, థమ్సప్‌ బాటిళ్లు, ఓ పురుగుల మందు డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. సమీపంలోనే ఓ కేక్‌ కూడా పడి ఉంది. వీటన్నింటిలో విషం ఆనవాళ్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. 

షేర్‌ మార్కెట్‌లో భారీగా నష్టాలు? 
శంకర్‌పల్లి మండలం కొత్తపల్లికి చెందిన పట్లోళ్ల ప్రభాకర్‌రెడ్డి ఎంబీఏ వరకు చదివాడు. మేడ్చల్‌ జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన మాధవిని ఐదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. ఉద్యోగం కోసం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని అశోక్‌నగర్‌ వచ్చి స్థిరపడ్డాడు. అక్కడే ఉంటూ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడి దృష్టి షేర్‌మార్కెట్‌ వైపు మళ్లింది. ఇండియా ఇన్ఫోలైఫ్‌ కంపెనీకి ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. దగ్గరి బంధువులతో పాటు తెలిసిన మిత్రులతో షేర్‌మార్కెట్‌లో డబ్బును పెట్టించి మంచి లాభాలు చూపుతున్నాడు. ఈయన పిన్ని లక్ష్మి, ఆమె భర్త రవీందర్‌రెడ్డి సిగ్నోడ్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. రవీందర్‌రెడ్డి రుద్రారంలోని ఐటీడబ్ల్యూ సిగ్నోడ్‌లో ఆపరేటర్‌గా పని చేస్తూనే బిల్డర్‌గా ఎదిగి ఆర్థికంగా మంచి స్థితిలోనే ఉన్నాడు. షేర్‌ మార్కెట్‌ బిజినెస్‌ చేసే ప్రభాకర్‌రెడ్డి ఇటీవల కోట్లలో నష్టపోయినట్టు తెలుస్తోంది. 

డిండి ప్రాజెక్టుకు చూసొద్దామని.. 
ప్రభాకర్‌రెడ్డి తన భార్య మాధవి, కుమారుడి వశిష్ట్‌తో కలిసి సోమవారం పిన్ని లక్ష్మి ఇంటికి వచ్చాడు. లక్ష్మి కూతురు సింధుజతో కలిసి అందరూ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో రవీందర్‌రెడ్డికి చెందిన కారులో డిండి ప్రాజెక్టు చూసొద్దామని వెళ్లారు. రవీందర్‌రెడ్డికి కూడా ఫోన్‌ చేసి విషయం చెప్పారు. సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటికి వస్తున్నామని లక్ష్మి తన భర్త రవీందర్‌రెడ్డికి ఫోన్‌ చేసి చెప్పింది. కానీ రాత్రయినా రాకపోవడం, అందరి ఫోన్లు స్విచ్ఛాఫ్‌ రావడంతో రవీందర్‌రెడ్డి ‘100’కు సమాచారం ఇచ్చారు. మంగళవారం ఉదయం కొందరు సహోద్యోగులతో కలిసి డిండికి బయల్దేరారు. వీరు మహేశ్వరం వద్ద ఉండగా... మృతదేహాలు పడి ఉన్నట్టు పోలీసుల ద్వారా సమాచారం అందగా అటు వెళ్లారు. ఈలోపు రవీందర్‌రెడ్డి కుమారుడు బీటెక్‌ విద్యార్థి దినేశ్‌రెడ్డి అమీన్‌పూర్‌ పోలీసులను ఆశ్రయించాడు. వివరాలు సేకరిస్తున్న సమయంలోనే నార్సింగ్‌ పోలీసుల నుంచి అమీన్‌పూర్‌ పోలీసులకు ఘటనకు సంబంధించిన సమాచారం అందింది. దీంతో దినేశ్‌రెడ్డితో కలిసి పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు. 

అతడే చంపి ఉంటాడా..? 
ప్రభాకర్‌రెడ్డి షేర్‌ మార్కెట్‌ వ్యాపారంలో వారం రోజుల వ్యవధిలో కోట్లలో నష్టపోయాడని, రూ.30 కోట్ల దాకా అప్పులు చేశాడని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. పిన్ని లక్ష్మి నుంచి కూడా రూ.2 కోట్ల దాకా తీసుకున్నట్లు తెలుస్తోంది. తన భార్య లక్ష్మి.. శేరిలింగంపల్లి మండలం శంకర్‌నగర్‌లో ఓ ఇంటిని అమ్మగా వచ్చిన రూ.70 లక్షలతోపాటు ఇటీవల మరో ప్లాటు అమ్మగా వచ్చిన మరో రూ.30 లక్షలను ప్రభాకర్‌రెడ్డికి ఇచ్చినట్లు రవీందర్‌రెడ్డి పోలీసులకు తెలిపారు. షేర్‌ మార్కెట్‌లో నష్టాలు వచ్చిన విషయం బయటపడుతుందనే భయంతోనే ప్రభాకర్‌రెడ్డి ‘ఆత్మహత్య’అంకానికి తెరలేపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిండికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో తన భార్య, కొడుకుతోపాటు పిన్ని లక్ష్మి, సింధుజకు విషం కలిపిన కేక్‌ తినిపించి.. నీళ్లు తాగించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆ తర్వాత తాను కూడా వాటిని తిన్నట్లు భావిస్తున్నారు. చివరికి అపస్మారక స్థితికి చేరుకున్న పిన్ని, సోదరి, భార్యను సర్వీసు రోడ్డు పక్కన ఉన్న పొదల్లో పడేసి.. తనను, కుమారుడిని రక్షించుకునే ప్రయత్నం ప్రభాకర్‌రెడ్డి చేసి ఉంటాడా అన్న దిశగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. రోడ్డుపైకి చేరుకునే క్రమంలోనే ఔటర్‌ రింగు రోడ్డు బ్రిడ్జి కిందకు చేరుకుని ఉంటాడని, అపస్మారక స్థితికి చేరుకుంటుండడంతో కారు నిలిపి డోరు తెరిచి ఉంటాడని భావిస్తున్నారు. ఘటన స్థలంలో ప్రభాకర్‌రెడ్డి, ఇతరుల ఫోన్లు లభించలేదు. తన భర్తకు తెలియకుండా ప్రభాకర్‌రెడ్డికి లక్ష్మి డబ్బులు ఇచ్చింది. ఈ భయమేమైనా ఆమెను ఆత్మహత్యకు పురిగొల్పిందా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. కోట్లలో షేర్‌ వ్యాపారం చేసే ప్రభాకర్‌ రెడ్డి సింగిల్‌ బెడ్‌రూం ఇంట్లో అద్దెకు ఉండడం.. ఇంట్లో కూడా పెద్దగా ఆడంబరాలు లేకపోవడం చర్చనీయాంశమైంది. పోస్టుమార్టం అనంతరం పోలీసులు మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించారు. బంధువులు, కుటుంబీకులు, స్నేహితుల నుంచి మరిన్ని వివరాలు సేకరించిన తర్వాతే ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై అంచనాకు వస్తామని చెబుతున్నారు. 

విచారణ జరుపుతున్నాం: సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సందీప్‌ శాండిల్యా 
ఐదుగురి మృతిపై అన్ని కోణాలలో విచారణ జరుపుతున్నాం. ఇప్పటివరకు లభించిన సాక్ష్యాధారాల ప్రకారం వారంతా విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా భావిస్తున్నాం. పోస్టుమార్టం నివేదికతోపాటు త్వరలోనే బంధువులు, అతని వద్ద పెట్టుబడులు పెట్టిన వారిని విచారిస్తే ఆత్మహత్యలకు కారణం తెలుస్తుందని భావిస్తున్నాం. 

మరిన్ని వార్తలు