వికలాంగులకు 4 శాతం రిజర్వేషన్‌

31 Aug, 2018 02:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి నియామకాల్లో వికలాంగులకు 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 3 శాతం రిజర్వేషన్లు ఉండగా.. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రిజర్వేషన్లు ఒక శాతం పెరిగాయి. ఈ మేరకు వికలాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.జగదీశ్వర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగు శాతం రిజర్వేషన్లకు సంబంధించి రోస్టర్‌ పాయింట్లను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది.

ప్రతి వంద పోస్టుల్లో 6, 31, 56, 82వ సంఖ్యలోని ఉద్యోగాలను వికలాంగులకు కేటాయించాలని పేర్కొంది. ఉద్యోగాల భర్తీలో వికలాంగుల రిజర్వేషన్లలో సమస్యలు తలెత్తితే వాటిని వికలాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి అధ్యక్షతన వికలాంగుల సంక్షేమ శాఖ కమిషనర్, జీఏడీ కార్యదర్శి, వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ సభ్యులుగా ఉన్న కమిటీ ఆదేశాలు తీసుకోవాల్సి ఉంటుంది.

అంధ, దృష్టిలోపం ఉన్న వారికి 1 శాతం, మూగ, చెవిటిలోపాలున్న వారికి 1 శాతం, కదల్లేకపోవడం, నరాల బలహీనతతో నడవలేకపోవడం, మరుగుజ్జులు, కండరాల పెరుగుదల లోపించిన వారికి 1 శాతం, బుద్ధి మాంద్యం, మానసిక వైకల్యం, స్పెసిఫిక్‌ లెర్నింగ్‌ డిజేబులిటీ, మానసిక రుగ్మత, బహుళ వైకల్యం ఉన్న వారికి 1 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. 

మరిన్ని వార్తలు