'గాంధీ'లో నాలుగు స్వైన్‌ఫ్లూ కేసులు

8 Sep, 2015 19:18 IST|Sakshi

గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్) : మారిన వాతావరణ పరిస్థితుల్లో స్వైన్‌ప్లూ మహమ్మారి మరో మారు విజృంభించేందుకు సిద్ధమవుతోంది. వారం రోజుల్లో గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ప్లూ లక్షణాలతో నాలుగు కేసులు నమోదయ్యాయి. వీటిలో రెండు పాజిటివ్ కాగా, మరో రెండు కేసులకు సంబంధించిన నివేదికలు అందాల్సి ఉంది. ఆస్పత్రి నోడల్ అధికారి నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా శంకరంపేట మండలం గువ్వలపల్లికి చెందిన గర్భిణి మరియమ్మ(26) ఈనెల 2న తీవ్ర జ్వరంతో గాంధీ ఆస్పత్రిలో చేరింది.

రక్త నమూనాలు సేకరించి నిర్థారణకు పంపగా మంగళవారం అందిన నివేదికలో స్వైన్‌ఫ్లూ పాజిటివ్ వచ్చింది. అలాగే స్వైన్‌ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్న మరో ఇద్దరికి వైద్యం అందిస్తున్నారు. వారి రక్త నమూనాలు సేకరించి నిర్ధారణ పరీక్షలకు పంపారు. దీంతోపాటు ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుబ్బకుర్తికి చెందిన బానోతు సునీల్ (32)కు స్వైన్‌ఫ్లూ పూర్తిస్థాయిలో నయం కావడంతో డిశ్చార్జి చేసినట్లు నోడల్ అధికారి నర్సింహులు తెలిపారు.

మరిన్ని వార్తలు