ఓపెన్ కాస్ట్‌లో ప్రమాదం.. నలుగురు మృతి

2 Jun, 2020 12:02 IST|Sakshi

సాక్షి, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా రామగుండంలోని సింగరేణి ఆర్జీ-3 ఓసీపీ-1లో మట్టి తొలగిస్తుండగా భారీ ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు భారీ పేలుడు సంభవించి నలుగురు కార్మికులు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులు కమాన్ పూర్‌కు చెందిన రాజేష్, అర్జయ్య, గోదావరిఖని చెందిన రాకేష్, ప్రవీణ్‌లుగా గుర్తించారు. కమాన్‌పూర్‌కు చెందిన వెంకటేశ్, రత్నాపూర్‌కు చెందిన బీమయ్య, జూలపల్లికి చెందిన శంకర్‌కు గాయాలు అయ్యాయి. గాయపడ్డ ముగ్గురికి గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతులు, క్షతగాత్రులు అంతా కాంట్రాక్ట్ కార్మికులుగా పని చేస్తున్నారు. రామగుండం సీపీ సత్యనారాయణ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. మట్టిలో బండరాళ్లను తొలగించేందుకు బ్లాస్టింగ్ చేయడానికి ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. 

ఆసుపత్రిలో క్షతగాత్రులను ఎంపీ వెంకటేష్ నేత, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఐఎన్‌టీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్, బీజేపీ జిల్లా అధ్యక్షులు సోమారపు సత్యనారాయణలు పరామర్శించారు. ఆందోళనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆసుపత్రి వద్ద, ఓసీపీ-1 వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

ఈ ఘటనలో మృతిచెందిన నలుగురికి కోటి రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఐఎన్‌టీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి జనక్‌ ప్రసాద్ డిమాండ్‌ చేశారు. గాయపడ్డ ముగ్గురికి రూ. 50 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని, పేలుడుపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలన్నారు.

(‘కింగ్‌కోఠి’లో 19 మందికి పాజిటివ్‌)

మరిన్ని వార్తలు