‘మా బిడ్డను ఆదుకోండి సారూ..’

15 Oct, 2019 10:04 IST|Sakshi

సాక్షి, గొల్లపల్లి : ముద్దుగా ఉన్న పాపాయికి పెద్ద కష్టమొచ్చింది.ఆడుతూ పాడుతూ.. హాయిగా ఉండాల్సిన ఆ చిన్నారి కాలేయ సంబంధిత వ్యాధితో కొట్టుమిట్టాడుతోంది. ఆపరేషన్‌ చేయాల్సిందేనని హైదరాబాద్‌లోని వైద్యులు తేల్చగా ఆరోగ్యశ్రీకి వ్యాధి అర్హత లేక, డబ్బులు కట్టేందుకు ఆర్థికస్థోమత లేక కన్నోళ్లు కన్నీరు మున్నీరవుతున్నారు. గుండె దిటవు చేసుకుని తమ బిడ్డను ఆదుకోవాలని దయార్థ హృదయులను వేడుకుంటున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన నిరుపేదలు షిండే శారద–నరేశ్‌ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం.

బతుకుదెరువు కోసం 15 ఏళ్ల క్రితం ఆదిలాబాద్‌ జిల్లా నుంచి గొల్లపల్లి వలస వచ్చారు. ఇక్కడే నివాసం ఏర్పర్చుకుని ఓటుహక్కు, రేషన్‌కార్డు, ఆధార్‌ కార్డు కల్గి ఉన్నారు. పూరి గుడిసెలో నివాసం ఉంటున్నారు. తల్లి శారద ఏడాది క్రితం మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ పలు ఆసుపత్రులు చుట్టూ తిరిగిన ఫలితం లేకపోవడంతో పాటు ఖరీదైన వైద్యం అందకపోవడం మృతి చెందింది. నాన్నే అన్నీ తానై వారిని సాకుతున్నాడు. నలుగురు పిల్లలను తల్లి లేని లోటు తీర్చేందుకు నమ్ముకున్న సీస కమ్మరి వృత్తితో వచ్చిన పదో పరకతో జీవనాన్ని సాగిస్తున్నారు.

వీరిలో చిన్నదైన నాలుగేళ్ల కూతురు ఐశ్వర్య కాలేయ సంబంధిత వ్యాధితో బాధ పడుతోంది. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకట తరగతి చదువుతున్న ఈ బాలిక పుట్టిన రెండేళ్ల నుంచే ఈ జబ్బు తీవ్రతతో అస్వస్థతకు గురవుతుంది. వయస్సు పెరిగిన కొద్దీ జబ్బు పెరిగిపోతోంది. భార్య చనిపోయినప్పటి నుంచి భర్తకు వీరి ఆలనా పాలన కష్టంగా మారింది. కూతురుకు ఎలాగైనా వ్యాధి నయం చేయాలనే ఆ తండ్రి మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, వరంగల్‌ ఆసుపత్రుల చుట్టూ తిరిగి రూ.లక్ష వరకు ఖర్చు చేసుకున్నాడు.

ఇటీవల హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆస్పత్రిలో చూపించగా, వెంటనే ఆపరేషన్‌ చేయాలని అందుకు రూ.3 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. ఆరోగ్యశ్రీ కార్డు చూపిస్తే వ్యాధిలో లేదని కార్డు వర్తించదని తేల్చి చెప్పారు. కొద్ది రోజుల నుంచి ఐశ్వర్యకు మలమూత్ర  విసర్జనలకు కూడా వెళ్లడం లేదని కడుపు ఉబ్బుతోందని వాపోయాడు. తన కూతురును ఎలా బతికించుకునేది అని నరేష్‌ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. దాతలు, ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ స్పందించాలని వేడుకుంటున్నాడు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థికంగా చేయూతనిచ్చి ఆదుకోవాలని కోరుతున్నాడు. చిన్నారిని ఆదుకునేందుకు ఆర్థికసాయం చేయాలనుకునే వారు ఫోన్‌ నంబర్‌ 9000404115కు కాల్‌ చేయాలని కోరారు.    

మరిన్ని వార్తలు