వారంలో 40,000 పాస్‌పోర్ట్‌లు

29 Aug, 2014 01:58 IST|Sakshi
వారంలో 40,000 పాస్‌పోర్ట్‌లు

* దేశంలో ఇదే తొలిసారి
* పాస్‌పోర్టు కార్యాలయం ఘనత
* ఉద్యోగులకు పాస్‌పోర్ట్ అధికారి అశ్వని సత్తారు అభినందన

 
సాక్షి, హైదరాబాద్:
గత వారం రోజుల వ్యవధిలో హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయం నుంచి 40,000 పాస్‌పోర్ట్‌లను జారీ చేసినట్టు పాస్‌పోర్ట్ కార్యాలయం మీడియా సమన్వయకర్త డా.ఎ.ఎం.శిరీష్ తెలిపారు. ఒక పాస్‌పోర్ట్ కార్యాలయం ఏడు రోజుల్లో ఇన్ని పాస్‌పోర్ట్‌లు జారీ చేయడం దేశంలోనే ఇదే ప్రథమమన్నారు. ఆగస్టు నెల చివరకు అత్యధికంగా 70,000 పాస్‌పోర్ట్‌లు జారీ చేయనున్నట్టు తెలిపారు. వీలైనంత వరకు పెండింగ్ పాస్‌పోర్ట్‌లు లేకుండా చూడాలని హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయ అధికారి అశ్విని సత్తారు సూచించారని చెప్పారు. అత్యధిక పాస్‌పోర్ట్‌లు జారీ చేసిన సందర్భంగా ఉద్యోగులను ఆమె అభినందించినట్టు తెలిపారు.
 
 నేటి నుంచి మూడు రోజులు సెలవు
 పాస్‌పోర్ట్ కార్యాలయానికి వరుసగా మూడు రోజులు సెలవు కావడంతో గురువారం నగరంలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు (పీఎస్‌కే) కిటకిటలాడాయి. నగరంలో టోలిచౌకి, అమీర్‌పేట్, బేగంపేటల్లో ఉన్న పీఎస్‌కేలకు దరఖాస్తుదారులు వందల్లో సంఖ్యలో తరలి వచ్చారు. శుక్రవారం వినాయక చవితి పండుగ, శని, ఆదివారాలు పాస్‌పోర్ట్ కార్యాలయానికి సెలవు. ఈ మూడు రోజులకు వెబ్‌సైట్‌లో స్లాట్ బుకింగ్ కూడా ఉండదు. సోమవారం నుంచి యథావిధిగా పని చేస్తుంది.

>
మరిన్ని వార్తలు