మృతుల కుటుంబాలకు రూ.40 లక్షలు పరిహారం

4 Jun, 2020 12:30 IST|Sakshi
న్యాయంచేయాలని ఎమ్మెల్యే కాళ్లు పట్టుకుంటున్న బంధువులు

అంగీకరించిన కార్మిక సంఘాలు

గతంలో కన్నా రెట్టింపు పరిహారం

సంస్థ డైరెక్టర్‌(పా) చంద్రశేఖర్‌ చొరవతో చర్చలు సఫలం

36గంటల అనంతరం  మృతదేహాలకు పోస్టుమార్టం

గోదావరిఖని(రామగుండం): ఓసీపీ బ్లాస్టింగ్‌లో మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు రూ.40 లక్షలు నష్టపరిహారం చెల్లించేందుకు సింగరేణి యాజమాన్యం అంగీకరించింది. మంగళవారం ఉదయం షిఫ్టులో ఓసీపీ–1 ప్రాజెక్టులో జరిగిన బ్లాస్టింగ్‌లో నలుగురు కార్మికులు మృతిచెందగా, ఒకరు తీవ్రంగా, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలు గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రికి చేరుకుని యాజమాన్యం తీరుపై ఆందోళన నిర్వహించాయి. బాధిత కుటుంబాల కు కోరిన నష్టపరిహారం చెల్లించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం నుంచి బుధవారం సాయంత్రం వరకు జరిగిన చర్చలు కొలిక్కివచ్చాయి. ప్రమాదంలో మృతిచెందిన ఒక్కోకార్మికుడి కుటుంబానికి రూ.40 లక్షల చొప్పున రూ.1.20కోట్లు చెల్లించేందుకు అంగీకారం కుదిరింది. మృతుల కుటుంబాల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇచ్చేందుకు అంగీకరించారు. చర్చలు సఫలం కావడంతో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబాలకు అప్పగించారు. చర్చల్లో యాజమాన్యం తరఫున సింగరేణి డైరెక్టర్‌(పా) చంద్రశేఖర్, ఆర్జీ–3 జీఎం సూర్యనారాయణ పాల్గొనగా జెడ్పీ చైర్మన్‌ పుట్టమధు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, సీపీఐ జాతీ య నాయకులు, గుర్తింపు యూనియన్‌ నుంచి బి.వెంకట్రావ్, మిర్యాల రాజిరెడ్డి, జాతీయ కార్మిక సంఘాల నాయకులు జనక్‌ప్రసాద్, రియాజ్‌అహ్మద్, రాజారెడ్డి, కెంగర్ల మల్లయ్య, సీతారామయ్య, గట్టయ్య పాల్గొన్నారు.

ఆసుపత్రి వద్ద ధర్నా..
సింగరేణి యాజమాన్యం, ఓబీ కాంట్రాక్టు యా జమాన్యం వైఖరి నిరసిస్తూ కార్మిక సంఘాల నాయకులు బుధవారం ఏరియా ఆసుపత్రి ముందు ఆందోళన నిర్వహించారు. నష్టపరిహా రం చెల్లించాలని లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీపీ వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, అడ్మిన్‌ డీసీపీ అశోక్‌కుమార్, ఏఆర్‌ కమాండెంట్‌ సంజీవ్, గోదావరిఖని, జైపూర్‌ ఏసీపీలు ఉమేందర్, నరేందర్, సీఐలు పర్శరమేశ్, వెంకటేశ్వర్లు బందోబస్తు పర్యవేక్షించారు.

మరిన్ని వార్తలు