తెలంగాణలో మరో 40 పాజిటివ్‌

8 Apr, 2020 01:07 IST|Sakshi

రాష్ట్రంలో 404 కరోనా కేసులు

23 రోజుల పసికందుకూ సోకిన వైరస్‌

ఇప్పటివరకు 45 మంది డిశ్చార్జి.. మొత్తం 11 మంది మృతి

వివిధ ఆస్పత్రుల్లో 348 మందికి చికిత్స

హైదరాబాద్, నిజామాబాద్, 

వరంగల్‌ అర్బన్‌ జిల్లాల్లో అధిక కేసులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మంగళవారం మరో 40 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 404కి చేరింది. ఇందులో 23 రోజుల పసికందు కూడా ఉండటం గమనార్హం. ప్రస్తుతం 348 మంది కరోనాతో చికిత్స పొందుతుండగా.. ఇప్పటివరకు 45 మంది వ్యాధి నయమై ఆస్పత్రి డిశ్చార్జి అయ్యారు. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా పాజిటివ్‌ వచ్చివారిలో ఎక్కువ మంది ఢిల్లీ మర్కజ్‌తో సంబంధం ఉన్నవారే.

తాజాగా నమోదైన 40 కేసులు కూడా మర్కజ్‌తో సంబంధం కలిగినవేనని ఆరోగ్యశాఖ తన బులెటిన్‌లో తెలిపింది. వైరస్‌ జన సమూహంలోకి ఇంకా వెళ్లలేదని పేర్కొంది. మర్కజ్‌ నుంచి వచ్చినవారు, వారితో కలిసిమెలిసి తిరిగినవారిని గుర్తించి పరీక్షలు చేస్తున్నామని, పాజిటివ్‌ వచ్చినవారికి చికిత్స చేస్తున్నామని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు ఆ బులిటెన్‌లో వివరించారు. పాజిటివ్‌ కేసులు నమోదైన జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో కంటైన్మెంట్‌ ప్రణాళికను అమలుచేస్తున్నట్టు చెప్పారు. ఆరు ల్యాబ్‌లు 24 గంటలూ కరోనా పరీక్షలు చేస్తున్నాయని తెలిపారు. కాగా, మర్కజ్‌ లింకు ఉన్నవారికి సంబంధించి మరో 900 మంది ఫలితాలు రావాల్సి ఉందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. మరో 15 రోజుల్లో కేసులు పూర్తిగా తగ్గిపోతాయని వైద్యాధికారులు భావిస్తున్నారు.

హైదరాబాద్‌లోనే ఎక్కువ కేసులు... 
ఇప్పటివరకు అత్యధికంగా హైదరాబాద్‌లోనే 178మందికి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో 21 మంది డిశ్చార్జి కాగా, ఏడుగురు మరణించారు. 150 మంది చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఒక్క రోజే నగరంలో ఏకంగా 17 కేసులు నమోదయ్యాయి. అలాగే నిజామాబాద్‌ జిల్లాలోనూ ఒక్క రోజే 10 కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ కేసుల సంఖ్య 37కు చేరింది. అందులో ఒకరు చనిపోయిన సంగతి తెలిసిందే. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 24 కేసులు నమోదయ్యాయి. సోమవారం గద్వాలలో ఏకంగా 13 కేసులు నమోదు కాగా, మంగళవారం ఆ సంఖ్య 22కి చేరింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలోనూ ఒక్కరోజే మూడు కేసులు నమోదయ్యాయి.

గచ్చిబౌలిలో 1500 పడకల కరోనా ఆసుపత్రి...
గచ్చిబౌలి స్పోర్ట్‌ కాంప్లెక్స్‌లో రికార్డ్‌ సమయంలో 1500 పడకల కరోనా ఆసుపత్రి సిద్ధం చేసినట్లు మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఐసీయూ, వెంటిలేటర్‌ సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో 22 ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లోనూ కరోనా చికిత్స కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందంతోనూ చర్చించామని, ఇక్కడి ఏర్పాట్లపై వారు సంతృప్తి వ్యక్తంచేశారని పేర్కొన్నారు. ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలలో 12 వేల పడకలు సిద్ధం చేసినట్టు చెప్పారు. కరోనా పాజిటివ్‌ వ్యక్తులకు చికిత్స అందించడానికి డాక్టర్లకు అవసరమైన పీపీఈ కిట్లు, ఎన్‌–95 మాస్క్‌లను లక్షల సంఖ్యలో సమకూర్చుకుంటున్నామని మంత్రి తెలిపారు. సీఎం కార్యాలయం ప్రతిరోజూ కరోనాపై పర్యవేక్షణ చేస్తోందన్నారు. మనదేశంలో వైరస్‌ అరికట్టాలంటే భౌతికదూరం పాటించడం ఒక్కటే మార్గమని స్పష్టంచేశారు. ప్రజలందరూ లాక్‌ డౌన్‌ను గౌరవించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

23 రోజుల పసికందుకు కరోనా..
మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని బీకే రెడ్డి కాలనీకి చెందిన 23 రోజుల పసికందుకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ వెంకట్రావ్‌ తెలి పారు. శిశువు తండ్రి మార్చి 23న మర్కజ్‌ నుంచి ఇంటికి వచ్చారు. అప్పట్నుంచి కరోనా లక్షణాలతో బాధ పడుతుండటంతో వైద్యులు ఆయన్ను అదే నెల 28న గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఏప్రిల్‌ 2న అతడికి వైరస్‌ సోకినట్లు తేలింది. దీంతో అధికారులు వెంటనే ఆయన భార్యతోపాటు 23 రోజుల శిశువును క్వారంటైన్‌లో ఉంచారు. మూడు రోజుల తర్వాత శిశువుకు దగ్గు రావడంతో వెంటనే వైద్యులు నమూనాలు సేకరించి హైదరాబాద్‌లోని నిర్ధారణ కేంద్రానికి పంపారు. ఆ పరీక్షల్లో పసికందుకు పాజిటివ్‌ రాగా, తల్లికి నెగిటివ్‌ వచ్చింది.

 

మరిన్ని వార్తలు