చిరు చప్పుడు మొదలైంది

5 May, 2020 07:36 IST|Sakshi
నగర శివారు బాలానగర్‌లోని ఓ పరిశ్రమ

తెరుచుకుంటున్న పరిశ్రమలు

40 శాతం ఇండస్ట్రీస్‌లో ఉత్పత్తి ప్రారంభం

40 రోజుల బంద్‌తో తీవ్ర సంక్షోభం

సాక్షి, సిటీబ్యూరో: లాక్‌డౌన్‌ మినహాయింపులతో భారీ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తిరిగి ప్రారంభమవుతున్నాయి.  కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా 50 శాతం కార్మికులకు మాత్రమే పరిశ్రమల్లోకి అనుమతిస్తున్నారు. సోమవారం 40 శాతంపైగా పరిశ్రమలు ఉత్పత్తుల ప్రక్రియను ప్రారంభించాయి. దీంతో గత 40 రోజులుగా బోసి పోయిన నగర శివార్లలోని పారిశ్రామిక వాడల్లో మళ్లీ కార్మికుల సందడి నెలకొంది. పారిశ్రామిక రంగం మళ్లీ పట్టాలెక్కినట్లు కనిపిస్తోంది. వాస్తవంగా లాక్‌డౌన్‌తో చిన్న, మధ్యతరహా పరిశ్రమల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అసలే అరకొర పనితో నష్టాల బాటలో నడుస్తున్న  చిరు పరిశ్రమలు లాక్‌డౌన్‌తో కుదేలయ్యాయి. దీంతో లాక్‌డౌన్‌ నష్టాలను పూడ్చాలంటూ పారిశ్రామిక వేత్తలు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. లాక్‌డౌన్‌తో భారీ పరిశ్రమల్లో ఉత్పత్తులు నిలచిపోవడంతో వాటిపై ఆధారపడిన చిన్న పరిశ్రమలు ఆగమయ్యాయి. కన్‌సైన్‌మెంట్‌లు నిలిచిపోవడంతో చెల్లింపులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కట్టాల్సిన బ్యాంకు లోన్లు, విద్యుత్‌ బిల్లులు, కార్మికుల వేతనాలు చెల్లించే పరిస్థితి లేకుండా పోయింది.  

40 వేల పరిశ్రమలపైనే  
మహా నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో సుమారు 40 వేలకు పైగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉంటాయన్న అంచనా. ప్రధానంగా నగర పరిధిలో సనత్‌నగర్, అజామాబాద్, చందూలాల్‌ బారాదరి పారిశ్రామిక వాడలు ఉండగా, శివార్లలో ఉప్పల్, మౌలాలి, జీడిమెట్ల, కాటేదాన్, నాచారం, గాంధీనగర్, బాలనగర్,  పటాన్‌ చెరు, వనస్థలిపురం తదితర  పారిశ్రామికవాడల్లో పెద్ద సంఖ్యలో స్మాల్‌స్కేల్‌ ఇండస్ట్రీలు విస్తరించి ఉన్నాయి. ఒక్కో పరిశ్రమలో 10 నుంచి 40 మందికి పైగా పని చేస్తుంటారు.  

నడిపేదేట్లా...
లాక్‌ డౌన్‌లో పరిశ్రమలకు సడలింపు లభించినా..నడిపేదేట్ల అన్న సందేహాలు  వ్యక్తమవుతున్నాయి. కార్మికులను రప్పించి, ఉత్పత్తిని ప్రారంభిస్తే అన్నీ సర్దుకుంటాయన్నట్లు పైకి కనిపిస్తున్నా...లాక్‌డౌన్‌ వ్యవధి పెరిగే కొద్దీ అంతర్గతంగా అనేక సమస్యలు పరిశ్రమలను చుట్టే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం అతిపెద్ద  సమస్య ఉద్యోగులకు జీతాలు చెల్లించడమే.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కార్మికులకు జీతాలు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చాయి. గత 40 రోజుల నుంచి పరిశ్రమలు నడవడం లేదు. కనీస రాబడీ లేదు. ఇట్లాంటి పరిస్థితులలో జీతాలు చెల్లింపు కష్ట సాధ్యంగా తయారైంది. సాధారణంగా మార్చి నెలలో లభించే ప్రభుత్వ టెండర్ల కోసం చాలా సంస్థలు పెద్ద ఎత్తున ముడి సరకు సిద్ధం చేసుకుంటాయి. ప్రభుత్వానికి కావల్సిన వస్తువులను టెండర్ల ద్వారా సేకరిస్తారు. చివరి మూడు నెలల (త్రైమాసికం) టెండర్లు ఇంకా పిలవలేదు. దీంతో ముడిసరుకుతోపాటు ఉత్పత్తులు కూడా కుప్పలుగా పేరుకున్నాయి. ఫలితంగా  ఆర్థిక లావాదేవీలకు ఈ పరిస్థితి అడ్డంకిగా మారినట్లు కనిపిస్తోంది.

మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో...
సాక్షి, మేడ్చల్‌ జిల్లా: మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో 7,341 పరిశ్రమలు ఉండగా 1,07,773 మంది కార్మికులు, ఉద్యోగులు పని చేస్తున్నారు. పరిశ్రమల పునః ప్రారంభంలో భాగంగా  ఇప్పటి వరకు 2,650 పరిశ్రమలు ఉత్పత్తులను మొదలు పెట్టగా, సోషల్‌ డిస్టెన్స్‌ వల్ల 50 శాతం కార్మికులు మాత్రమే పని చేస్తున్నారు. కోవిడ్‌–16 నియంత్రణలో భాగంగా  ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగణంగా సోషల్‌ డిస్టెన్స్‌ పాటించటం,  శానిటైజేషన్, పరిశుభ్రత వంటి చర్యలపై దృష్టి సారించినట్లు మేడ్చల్‌ జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ పడాల రవీందర్‌ తెలిపారు. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో  ప్రభుత్వ రంగ పరిశ్రమలతోపాటు ఇంజనీరింగ్, ఫార్మా, ఫుడ్‌ ఇండస్ట్రీలు ఉన్నాయి. మౌలాలి ప్రాంతంలో ఫ్యాబ్రికేషన్, స్టీల్, ప్లాస్టిక్‌ ఫర్నిచర్, కెమికల్, ఎలక్ట్రానిక్స్‌ , బయెటెక్, కెమికల్, విత్తన పరిశ్రమలు తమ ఉత్పత్తుల్ని ప్రారంభించాయి. గ్రామీణ ప్రాంతాల్లోని పరిశ్రమలు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో ఈ పరిశ్రమల యాజమాన్యాలకు ఒకింత ఊరట దక్కింది. కాగా నిబంధనల మేరకు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పరిశ్రమలు పనిచేసేందుకు అనుమతిచ్చారు.

తెరుచుకున్న పరిశ్రమలు ఇవే..
స్టోన్‌ క్రషింగ్, ఇటుకల తయారీ, చేనేత మగ్గాల నిర్వహణ, మరమ్మతుల వర్క్‌షాప్‌లు, బీడీ తయారీ, ఇసుక మైనింగ్, సిరామిక్‌ టైల్స్, రూఫ్‌ టైల్స్, సిమెంట్‌ ఫ్యాక్టరీలు, జిన్నింగ్‌ మిల్లులు, ఐరన్‌–స్టీల్‌ ఇండస్ట్రీలు, ప్లాస్టిక్‌ శానిటరీ పైపుల తయారీ, పేపర్‌ ఇండస్ట్రీ, కాటన్‌ పరుపుల తయారీ, ప్లాస్టిక్‌ రబ్బర్‌ ఇండస్ట్రీ, నిర్మాణ పనులు, దుకాణాల ద్వారా విక్రయాలు ప్రారంభమయ్యాయి.

మరిన్ని వార్తలు