ఇక.. జల‘సమాధే’ 

13 Apr, 2019 03:25 IST|Sakshi
ఇది ఓ సమాధి.. దీని వయసు దాదాపు నాలుగువేల ఏళ్లు. భూఉపరితలంలో వెడల్పాటి మందపు బండరాయి (క్యాప్‌స్టోన్‌). దాని దిగువన భూగర్భంలో చుట్టూ సల్పరాళ్లతో నిర్మాణం, మధ్యలో సమాధి. దానికి వృత్తాకారంలో ఓ ద్వారం.

పులిచింతల బ్యాక్‌వాటర్‌ పరిధిలో 4 వేల ఏళ్లనాటి నిర్మాణాలు

రాతియుగం నాటి సమాధులెన్నో

త్వరలో అన్నీ ముంపునకు గురయ్యే ప్రమాదం

కొన్నింటినైనా పరిరక్షిస్తే భవిష్యత్తు అధ్యయనానికి వీలు

కొన్నింటిని కాపాడితే...చరిత్ర మిగులుతుంది
‘ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్రాజెక్టుల వల్ల ముంపు ఏర్పడే చోట చారిత్రక అవశేషాలుంటే వాటిల్లో కొన్నింటిని పదిలపరిచి భావితరాలకు అందించిన దాఖలాలున్నాయి. భవిష్యత్తులో అధ్యయనానికి కూడా అది వీలు కల్పిస్తుంది. పులిచింతల బ్యాక్‌వాటర్‌ ముంపు ప్రాంతంలో కూడా అలా కొన్నింటిని పరిరక్షించాలి. కుదిరితే ఓ మినీ మ్యూజియం ఏర్పాటు చేయాలి. అరుదైన చరిత్ర అంతరించకుండా కాపాడుకోవాల్సి ఉంది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇటీవల వేముగంటి మురళి, చంటి, రాము, గోపి, పాలూరి మోష తదితరులతో కలసి ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఎన్నో అరుదైన నిర్మాణాల అవశేషాలు కనిపించాయి’.
– శ్రీరామోజు హరగోపాల్, తెలంగాణ జాగృతి

సాక్షి, హైదరాబాద్‌: రాతియుగం నాటి నిర్మాణమిది. ఇలాంటివి పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతంలో ఎన్నో ఉన్నాయి. పూర్తిగా భూఉపరితలంలో నిర్మాణమైన సమాధులూ ఉన్నాయి. క్యాప్‌స్టోన్‌ లేని నిర్మాణాలైతే కోకొల్లలు. ఇప్పుడు ఇవన్నీ జలసమాధి కాబోతున్నాయి.  

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మిస్తున్న పులిచింతల ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌లో సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పరిధిలోకి వచ్చే కొన్ని గ్రామాలు మునిగిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని గ్రామాల పునరావాసం దాదాపు పూర్తయింది. మరికొన్ని ముంపు గ్రామాల తరలింపు జరగాల్సి ఉంది. పాత ఊళ్లు నిర్మానుష్యంగా మారి కొత్త ప్రాంతాల్లో ఇళ్లు వెలుస్తున్నాయి. భవిష్యత్తులో ఆ ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం క్రమంగా పెరగనున్నందున, ముంపు ప్రాంతాలుగా నిర్ధారించిన పరిధి నీటితో నిండిపోనుంది. గ్రామాల పునరావాసం కొనసాగుతున్నా ‘చరిత్ర’పునరావాసం జాడే లేదు. ఈ విషయమై చరిత్రకారులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ప్రాంతానికి పూర్వపు చరిత్ర ఉంటుంది. దానికి ఎన్నో ప్రత్యేకతలుంటాయి. ఆయా ప్రాంతాల్లో వెలుగు చూసే పురాతన ఆనవాళ్లు ఆ విశేషాలను వెల్లడిస్తాయి, నాటి చరిత్రకు సజీవసాక్ష్యాలుగా నిలుస్తాయి.

అందుకే ప్రపంచవ్యాప్తంగా చారిత్రక ఆనవాళ్లను పదిలం చేస్తుంటారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి రాతియుగం నాటి సమాధులు, వాటి చుట్టుపక్కల ఆదిమానవుల ఆవాసజాడలు వెలుగు చూశాయి. కానీ, ఒక్కో ప్రాంతంలోని నిర్మాణాలు ఒక్కో రకంగా ఉండటం ఆసక్తి కలిగించే విషయమే. ఆయా ప్రాంతాల్లో నేలస్వభావం, దొరికే రాళ్లు, భౌగోళిక స్వారూపం... ఇలాంటివాటి ఆధారంగా నిర్మాణాల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. తెలంగాణలో భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల సరిహద్దులో వెలుగుచూసిన డోల్మెన్‌ సమాధులకు, ఇతర ప్రాంతాల్లోని సిస్ట్‌ సమాధులకు, ఇప్పుడు పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో లభించిన సమాధులకు తేడాలున్నాయి.
 
సాధారణంగా ఆదిమానవులు క్రూరమృగాల నుంచి రక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకునేవారు. వీలైనంతవరకు గుట్టలపై గుంపుగా జీవనం సాగించేవారు. కానీ పులిచింతల ముంపు ప్రాంతాల్లో ఎత్తయిన గుట్టలు లేవు. అన్నీ రాతి మైదానాలే కావడంతో ఆ రాళ్లనే ఆవాసంగా చేసుకున్నారు. ఇక్కడి షాబాద్‌ రాతి పొరలున్నందున, సమాధుల నిర్మాణానికి కూడా ఆ రాతినే వినియోగించారు.
 
మూడు దశాబ్దాల క్రితం... 
కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో 30 ఏళ్ల క్రితం భట్టాచారి అనే అధికారి నేతృత్వంలో ఈ ప్రాంతంలో కొంత అధ్యయనం జరిగింది. మచ్చుకు నాలుగు ప్రాంతాలను ఎంపిక చేసుకుని పరిశోధించారు. ఇక్కడ వందల సంఖ్యలో ఇలాంటి నిర్మాణాలున్నాయని గుర్తించారు. చాలావరకు ఇప్పుడు భూగర్భంలో ఉన్నాయి. వాటిల్లో ఇప్పటికీ ఎముకలు, వారు వినియోగించిన వస్తు అవశేషాలున్నాయి. పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తే నాటిచరిత్రకు సంబంధించిన ఎన్నో కొత్త విషయాలు తెలిసేవి. కానీ అధ్యయనం అసంపూర్తిగానే ముగిసింది. ఈలోపు కృష్ణానదిపై పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం జరగటంతో నీళ్లు నిలిచి చాలాప్రాంతాలు ముంపుబారిన పడటం మొదలైంది.

ఈ క్రమంలో చారిత్రక ఆనవాళ్లు కూడా జలసమాధి అవుతున్నాయి. భవిష్యత్తులో అధ్యయనం చేసేందుకు కూడా ఆనవాళ్లు దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో ఇక ఈ చరిత్రే సమాధి అవబోతోంది. అందుకోసం కొన్ని సమాధులు, నాటి ఇతర ఆనవాళ్లను గుర్తించి వాటిని యథాతథంగా మరో ప్రాంతానికి తరలించి ఏర్పాటు చేయాలని, తద్వారా కొంతమేర అధ్యయనానికి అవకాశం ఉంటుందని చరిత్రకారులు అంటున్నారు.

మరిన్ని వార్తలు