తెలంగాణ: మరో 41 కరోనా పాజిటివ్‌

13 May, 2020 22:10 IST|Sakshi

జీహెచ్‌ఎంసీ పరిధిలో 31.. వలసదారుల్లో 10 మందికి పాజిటివ్‌

రాష్ట్రంలో 1,367కి చేరిన కేసులు

ఇద్దరు మృతి.. 34కి చేరిన మరణాల సంఖ్య

కొత్తగా 117 మంది డిశ్చార్జి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో బుధవారం మరో 41 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కరోనాతో ఇద్దరు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 1,367కి చేరగా.. మృతుల సంఖ్య 34కి చేరింది. కొత్తగా 117 మందిని డిశ్చార్జి చేశారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని ఇంటికి వెళ్లినవారి సంఖ్య 939కి చేరుకుంది. ప్రస్తుతం ఆసుప త్రుల్లో 394 మంది చికిత్స పొందుతున్నారని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాస రావు తెలిపారు. ఈ మేరకు ఆయన బులెటిన్‌ విడుదల చేశారు. బుధవారం నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 31 ఉండగా.. వలసదారులు    మిగతా 10 మంది ఉన్నారు. వలసదారుల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 35కి చేరింది.
(చదవండి: జలుబు, దగ్గు, జ్వరం లేకుంటే ఇంటికే..)

మొత్తమ్మీద ఇప్పటివరకు 69 శాతం మంది కోలుకోగా, 29 శాతం మంది చికిత్స పొందుతున్నారని, రెండు శాతం మంది చనిపోయారని పేర్కొన్నారు. ఇదిలావుంటే బుధవారం చనిపోయిన ఇద్దరిలో ఒకరు మహిళ కాగా, మరొకరు పురుషుడు ఉన్నారు. ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్న హైదరాబాద్‌ జియాగూడకు చెందిన 38 ఏళ్ల మహిళ కరోనాతో చనిపోయారు. హైదరాబాద్‌ సరూర్‌నగర్‌కు చెందిన 74 ఏళ్ల వ్యక్తి కిడ్నీ సహా ఇతర సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన్ను ఒక ప్రైవేట్‌ ఆసుపత్రి నుంచి గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. కరోనాతో ఆయన ప్రాణాలు కోల్పోయారని బులిటెన్‌లో తెలిపారు. మరోవైపు గత 14 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాని జిల్లాలు 26 ఉండగా, ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదుకాని జిల్లాలు మూడు ఉన్నాయి. 

రేపటి నుంచి ‘సెరో సర్వే’...
కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రతను తెలుసుకునేందుకు జిల్లాల్లో జనాభా ఆధారిత ‘సెరో–సర్వే’నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి రాష్ట్రంలోని కామారెడ్డి, నల్లగొండ, జనగాం జిల్లాల్లో సర్వే ప్రారంభంకానుంది. కరోనా వైరస్‌ సామూహిక వ్యాప్తి అయిందా? లేదా? తెలుసుకునేందుకు దేశంలోని 69 జిల్లాల్లో 24 వేల మందికి టెస్టులు చేయాలని ఐసీఎంఆర్‌ నిర్ణయించింది. ఇందులో భాగంగా మన రాష్ట్రంలోని ఈ 3 జిల్లాలను ఎంపిక చేశారు. ర్యాండమ్‌గా ఒక్కో జిల్లాలో 400 మందికి పరీక్షలు చేస్తారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ రూపొందించిన ఎలిసా కిట్లతో ఎక్కడికక్కడే ఈ పరీక్షలు నిర్వహిస్తారు. 
(చదవండి: ‘ప్యాకేజీ’ జోష్‌..!)

మరిన్ని వార్తలు