కొత్తగా 41 ఇన్‌స్పెక్షన్‌ హౌస్‌లు

23 Aug, 2018 01:32 IST|Sakshi

ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహాలు లేని చోట నిర్మాణం 

ఆర్థిక శాఖ ఆమోదించగానే పనులు మొదలు.. 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 41 చోట్ల ఇన్‌స్పెక్షన్‌ హౌస్‌లు నిర్మించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. నిర్మాణ బాధ్యతను ఆర్‌ అండ్‌ బీ అధికారులు చేపట్టారు. వీటికి ఇప్పటికే ప్రతిపాదనలను సిద్ధం చేశారు. వీటిని త్వరలోనే ఆర్థిక శాఖకు పంపి.. ఆమోదం లభించగానే నిర్మాణ పనులు మొదలుకానున్నాయి. రాష్ట్రంలోని పాత జిల్లాల్లోనే ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌస్‌లున్నాయి. పలుచోట్ల ఇవి శిథిలావస్థకు చేరగా.. మరికొన్ని కొత్తగా నిర్మించాల్సి ఉంది. కొత్త జిల్లాల నేపథ్యంలో నియోజకవర్గానికి ఒక ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌస్‌ నిర్మించాలంటూ ఎమ్మెల్యేల నుంచి విజ్ఞప్తులు పెరిగిపోయాయి. దీంతో ప్రభుత్వం ఇన్‌స్పెక్షన్‌ హౌస్‌ల పేరిట కొత్త గెస్ట్‌ హౌస్‌లను నిర్మించేందుకు నిర్ణయించింది. ఒక్కో భవనానికి రూ.1.50 కోట్ల అంచనాతో రూ.72 కోట్ల వ్యయంతో ఈ భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 

ఎక్కడెక్కడ నిర్మాణం? 
ఆర్‌ అండ్‌ బీ అతిథిగృహాలు లేని చోట ఈ హౌస్‌లను నిర్మించనున్నారు. ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూ రు, మంథని, పెద్దపల్లి, ముస్తాబాద్, భూపాలపల్లి, కూసుమంచి, రామాయంపేట, బిచ్కుంద, భీంగల్, బచ్చన్నపేట, పాలకుర్తి, వర్ధన్నపేట, ములుగు, మన్నూరు, జహీరాబాద్, బోథ్, ఇచ్చోడ, నేరెడి గొండ, బాసర, నిర్మల్, మన్యంకొండ, నెక్కొండ, ఉట్నూరు, తుర్కపల్లి, మేడ్చల్, ఘట్‌కేసర్, డిచ్‌పల్లి, కొడంగల్, కోహెడ, శంకర్‌పల్లి, నవాబ్‌పేట, చేవెళ్ల, పరకాల, హుజూరాబాద్, జమ్మికుంట, రామగుండం, భద్రాచలం, నెల్లికుదురు, యాదాద్రిలో నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

అత్యాధునిక సదుపాయాలతో
అత్యాధునిక సదుపాయాలతో కొత్త ఇన్‌స్పెక్షన్‌ హౌస్‌లు నిర్మించనున్నట్లు సమాచారం. దీని కోసం అధునాతన మోడళ్లను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. మారుమూల నియోజకవర్గాల్లో సభ లు, సమావేశాలు, విశ్రాంతికి తగినన్ని భవనాలు లేవు. వీటి నిర్మాణంతో ఆ లోటు తీరిపోనుందని అధికారులు అంటున్నారు. ఆర్థికశాఖ ఆమోదించగానే కొత్త భవనాలకు సంబంధించిన ప్లాన్లు ఖరారు చేసి, టెండర్లు ఆహ్వానించేందుకు ఆర్‌ అండ్‌ బీ అధికారులు సమాయత్తమవుతున్నారు. 

మరిన్ని వార్తలు