ఇంకా ఎండల మంటలే

29 Apr, 2016 01:39 IST|Sakshi
ఇంకా ఎండల మంటలే

44.1 డిగ్రీలతో మండిపోయిన హన్మకొండ
* నల్లగొండ, రామగుండం, భద్రాచలాల్లోనూ అంతే
* రాష్ట్రాన్ని వణికిస్తున్న వడగాడ్పులు
* మూణ్నాలుగు రోజుల్లో చిరు జల్లులు
* అయినా ఎండలు తగ్గవ్: వాతావరణ శాఖ

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతూనే ఉంది. అడపాదడపా ఆకాశం మేఘావృతమవుతున్నా ఉష్ణోగ్రతలు తగ్గే పరిస్థితి కన్పించడం లేదు. మూడు నాలుగు రోజుల్లో చెదురుమదురుగా జల్లులు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం గురువారం ప్రకటించింది.

కానీ దీనివల్ల అక్కడక్కడా వాతావరణం కాస్తో కూస్తో చల్లబడవచ్చు తప్ప మొత్తమ్మీద ఎండల తీవ్రతలో మాత్రం మార్పేమీ ఉండబోదని పేర్కొనడం విశేషం. గురువారం హన్మకొండలో 44 డిగ్రీలతో ఎండ హడలెత్తించింది. 2  రోజులుగా ఈ ప్రాంతంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. ఎండల తీవ్రత శుక్ర, శనివారాల్లోనూ కొనసాగే అవకాశముంది. భద్రాచలం, నల్లగొండ, రామగుండం, కొత్తగూడెం, మణుగూరుల్లో కూడా గురువారం సాధారణం కంటే దాదాపు ఐదు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ప్రచండ భానుడి ప్రతాపానికి రాజధానివాసులు కూడా విలవిల్లాడారు. గురువారం నగరంలో 41.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దీనికి వడగాడ్పులూ తోడై జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. వీటి తీవ్రత మరో రెండు రోజులు కొనసాగుతుందని బేగంపేట వాతావరణ కేంద్రం ప్రకటించింది.
 
వడదెబ్బతో  65 మంది మృతి
సాక్షి, నెట్‌వర్క్: రాష్ట్రవ్యాప్తంగా గురువారం వడదెబ్బకు  65 మంది బలయ్యారు. నల్లగొండ జిల్లాలో 9 మంది, వరంగల్ జిల్లాలో 13 మంది, ఖమ్మం జిల్లాలో 10 మంది, మెదక్ జిల్లాలో ఆరుగురు, కరీంనగర్ జిల్లాలో 11 మంది, మహబూబ్‌నగర్ జిల్లాలో 10 మంది, నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు, రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు, ఆదిలాబాద్ జిల్లాలో ఒక్కరు వడదెబ్బతో మృతి చెందారు.  
 
రెండు టన్నుల చేపలు మృతి

కేసముద్రం:  ఎండతీవ్రతకు వరంగల్ జిల్లా కేసముద్రం మండలం కోరుకొండపల్లిలో  రెండు టన్నుల చేపలు మృతిచెందాయి. కోరుకొండపల్లికి చెందిన మంగి ఉప్పలయ్య ఊర చెరువును లీజు తీసుకుని 4.50 లక్షల విలువైన చేప పిల్లలను తెచ్చి చెరువులో పోశాడు. ఇటీవల ఎండల తీవ్రతకు చెరువులో నీళ్లు అడుగంటాయి. ఎండతీవ్రత  ఎక్కువకావడంతో, చేపలన్నీ నీళ్ల వేడిమికి తట్టుకోలేక మృత్యువాతపడ్డాయి. ఒక్కరోజులోనే రెండు టన్నుల చేపలు మృతిచెందాయి.
 
పాల్వంచలో 50 డిగ్రీలు
పాల్వంచ:  పారిశ్రామిక ప్రాంతమైన ఖమ్మం జిల్లా పాల్వంచలో భానుడు భగభగమంటున్నాడు. మూడు రోజులుగా 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు చేసుకుంటోంది. దీంతో జనం అల్లాడిపోతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.

మరిన్ని వార్తలు