పుల్‌ పైసల్‌

17 Oct, 2019 02:53 IST|Sakshi

మద్యం దుకాణాలకు వెల్లువలా దరఖాస్తులు

ఒక్క చివరి రోజే 20,000 పైగా..

కిటకిటలాడిన ఎక్సైజ్‌ ఆఫీసులు

బందోబస్తు మధ్య దరఖాస్తులు

పొరుగు రాష్ట్రాల వ్యాపారుల తాకిడి

44,000 పైగా దరఖాస్తులు.. 880 కోట్ల ఆదాయం

సాక్షి, హైదరాబాద్‌: రూ.2 లక్షల టెండర్‌ ఫీజు.. లాటరీలో అదృష్టం వరించకపోతే ఆ రూ.2 లక్షలు పోయినట్టే. అంటే  అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రూ.2 లక్షలు సమర్పించుకోవాలన్నమాట.. అయినా మద్యం వ్యాపారులు, లిక్కర్‌ వ్యాపారంలో అడుగుపెట్టాలనుకునే ఆశావహులు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. రూ.2 లక్షలను కూడా ఖాతరు చేయలేదు. పోతే రూ.2లక్షలు.. వస్తే మద్యం దుకాణం అనే ధోరణిలో దరఖాస్తులు భారీగా సమర్పించారు. రాష్ట్రంలో మద్యం దుకాణాలకు గాను టెండర్ల స్వీకరణ గడువు ముగిసిన బుధవారం నాటి రాత్రికి ఎక్సైజ్‌ అధికారుల లెక్కల ప్రకారం 44 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. బుధవారం ఒక్కరోజే 20 వేలకు పైగా దరఖాస్తులు సమర్పించారు. ఎక్సైజ్‌ డీసీ కార్యాలయాలు కిక్కిరిసిపోవడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి మరీ దరఖాస్తులు స్వీక రించాల్సి వచ్చింది. దీంతో అర్ధరాత్రి వరకు ఎక్సైజ్‌ అధికారులు ఈ టెండర్ల స్వీకరణ, పరిశీలనలో బిజీ అయిపోయారు. కేవలం దరఖాస్తుల ద్వారానే సర్కారుకు ఏకంగా రూ.880 కోట్లకు పైగా  ఆదాయం కేవలం టెండర్‌ ఫీజు రూపంలోనే వచ్చింది. 2017లో 2,216 దుకాణాలకు టెండర్లు పిలవగా 41 వేలకు పైగా దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి రూ.410 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు కూడా షాపుల సంఖ్య పెరగక పోయినా దరఖాస్తులు ఎక్కువగా రావడంతో గతేడాది కన్నా రూ.470 కోట్లకు పైగా అదనపు ఆదాయం సమకూరనుంది.
 
వరంగల్‌లో అత్యధికం.. 
బుధవారం అర్ధరాత్రి 12 గంటల వరకు అందిన సమచారం మేరకు. హైదరాబాద్‌ జిల్లాలో 173 మద్యం దుకాణాలకు గాను 1,319 దరఖాస్తులు వచ్చాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అధిక దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 261 దుకాణాలకు గాను, 7,534 దరఖాస్తులు వచ్చాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 278 దుకాణాలకు 6,963 దరఖాస్తులు వచ్చాయి. సూర్యాపేట జిల్లాలో సరాసరి ఒక్కో దుకాణానికి 30కి పైగా దరఖాస్తులు వచ్చాయి. సిద్దిపేట జిల్లాలో 70 దుకాణాలకు వెయ్యికి పైగా దరఖాస్తులు వచ్చాయి. వరంగల్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్‌ జిల్లాల్లోనూ ఆశావహుల పోటాపోటీగా దరఖాస్తులు సమర్పించారు. అయితే అధికారికంగా ఈ దరఖాస్తుల సంఖ్యపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు.

సరిహద్దులు దాటి.. 
మందు కిక్కు సరిహద్దులు దాటివచ్చేలా చేసింది. లిక్కర్‌ దందాపై ఏపీ ప్రభుత్వం నియంత్రణ విధించడంతో అక్కడి వ్యాపారులు తెలంగాణ బాట పట్టారు. దరఖాస్తుల సమర్పణకు బుధవారం ఆఖరి రోజు కావడంతో ఏపీ వ్యాపారులు భారీగా తరలివచ్చారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, గద్వాల, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లోని షాపులపై కన్నేసిన పొరుగు రాష్ట్ర వ్యాపారులు భారీ సంఖ్యలో దరఖాస్తులు సమర్పించారు. ఊహించనిరీతిలో ఏపీ వ్యాపారులు తరలిరావడం.. పోటాపోటీగా దరఖాస్తులు సమర్పించడంతో ఏపీ, తెలంగాణ వ్యాపారుల మధ్య కొన్నిచోట్ల వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. నాగోల్‌లో తోపులాట జరగడంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితి చక్కదిద్దారు. రాజేంద్రనగర్, శంషాబాద్, శేరిలింగంపల్లి, ఎల్‌బీనగర్, మల్కాజిగిరి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మణికొండ తదితర ప్రాంతాల్లోని వైన్స్‌ షాపులకు భారీగా దరఖాస్తులు చేశారు. ఒకటే దరఖాస్తు సమర్పించాలనే నిబంధన ఉన్నా.. సిండికేట్‌గా మారి షాపులను కైవసం చేసుకునే ఎత్తుగడ వేశారు. మైలవరం, ఆనంతపూర్‌ (పట్టణ), గుంటూరు, సత్తెనపల్లి, మాచర్ల, కర్నూలు, విజయవాడ, నంద్యాల తదితర ప్రాంతాల వ్యాపారులు గ్రేటర్‌ శివార్లలోనే ఏకంగా 200 పైచిలుకు దరఖాస్తులు సమర్పించారంటే పరిస్థితి అంచనా వేసుకోవచ్చు.
 
44 దరఖాస్తులు వేసిన లిక్కర్‌ డాన్‌

మెదక్‌ జిల్లా హవేళిఘణపూర్‌ మండల పరిధిలోని సర్ధన గ్రామానికి చెందిన జీకేఆర్‌ సంస్థల అధినేత సూరజ్‌ (లిక్కర్‌డాన్‌) ఏకంగా 3 షాపులకు గాను 44 దరఖాస్తులు వేశాడు. గతేడాది 22 దరఖాస్తులు చేసిన సూరజ్‌ లాటరీ పద్ధతిలో 3 దుకాణాలను దక్కించుకున్నాడు. ఈసారి విపరీతమైన పోటీ పెరగడంతో ఏకంగా 44 దరఖాస్తులు చేసుకున్నాడు. ఇందులో మెదక్‌ పట్టణంలో 2 దుకాణాలు, పాపన్నపేట మండలం ఏడు పాయల దుకాణానికి ఏకంగా 44 దరఖాస్తులు వేశాడు. 

15 ఏళ్లుగా ఇదే వ్యాపారం: తాటికొండ సాయికృష్ణ, మైలవరం 
‘కృష్ణా జిల్లా మైలవరంలో గత 15 సంవత్సరాలుగా లిక్కర్‌షాపు నిర్వహిస్తున్నాను. మా రాష్ట్రంలో వైన్స్‌షాపులను ప్రభుత్వమే నిర్వహిస్తుండటంతో అనివార్యంగా ఇక్కడకు వచ్చాం. స్నేహితులు, బంధువులు కలిసి శంషాబాద్‌ యూనిట్‌ పరిధిలోని మణికొండ, రాజేంద్రనగర్, శంషాబాద్‌లోని దుకాణాలకు దరఖాస్తులు చేశాం. ఇక్కడ వ్యాపారం అనువుగా ఉండడమేగాకుండా.. గతంలో ఇక్కడ వ్యాపారం చేసిన అనుభవం ఉండడంతో మళ్లీ రావడానికి దారితీసింది.’ 

వంద దరఖాస్తులు వేశాం: వెంకట్‌రావు ,అనంతపురం అర్బన్‌ 
‘1989 నుంచి మాది ఇదే వ్యాపారం. ఇతర పనులు చేయలేక ఇదే వ్యాపారాన్ని నమ్ముకున్నాం. ఎక్కడైనా వ్యాపారమే కదా అని ఇక్కడకు వచ్చాం. మిత్రులు, కుటుంబసభ్యులు, బంధువుల పేరిట దరఖాస్తులు చేశాం’.

ఉమ్మడి జిల్లాల వారీగా దాఖలైన మద్యం దరఖాస్తుల వివరాలు 
జిల్లా    షాపుల సంఖ్య    దరఖాస్తులు 
ఆదిలాబాద్‌    163    2,803 
హైదరాబాద్‌    173    1,319 
కరీంనగర్‌       266    3,381 
ఖమ్మం         165    7,024 
మహబూబ్‌నగర్‌    164    3,351 
మెదక్‌           193      2963 
నల్లగొండ        278     6963 
నిజామాబాద్‌  131      1450 
రంగారెడ్డి        422      6117 
వరంగల్‌         261      7534 
మొత్తం          2,216    42,905 

దరఖాస్తు గణాంకాలివీ.. 
– నోటిఫికేషన్‌ విడుదల చేసిన షాపుల సంఖ్య– 2,216 
– వచ్చిన మొత్తం దరఖాస్తుల సంఖ్య– 44 వేలకు పైగా 
– చివరి రోజు వచ్చిన దరఖాస్తుల సంఖ్య– 21,966 
– టెండర్‌ ఫీజుల ద్వారా సర్కారుకు వచ్చిన ఆదాయం– రూ.880 కోట్లకు పైగా 
– రెండేళ్ల క్రితం వచ్చిన ఆదాయం– రూ.410 కోట్లు 
– అత్యధిక దరఖాస్తులు వచ్చిన జిల్లా– వరంగల్‌ 

 

మరిన్ని వార్తలు