ఐదు రోజులు.. 483 పాజిటివ్‌ కేసులు

6 Jun, 2020 10:35 IST|Sakshi

మొత్తం కేసులు 3290

గ్రేటర్‌లో నమోదైనవి 2138

113 మంది మృతుల్లో వంద మందికిపైగా నగరవాసులే...

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. కేవలం ఈ నాలుగు రోజుల్లోనే 367 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా... తాజాగా శుక్రవారం మరో 116 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో కేవలం ఐదు రోజుల్లోనే 483 పాజిటివ్‌ కేసులు నమోదు కావడం విశేషం. నగరంలో ఒక వైపు రోజురోజుకు కొత్త కేసులు పెరుగుతుండటం... మరో వైపు అదే స్థాయిలో మరణాల సంఖ్య కూడా నమోదవుతుండటం నగరవాసుల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కేవలం సాధారణ సిటీజనులే కాకుండా వైరస్‌తో పోరాడుతున్న ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్యులు సైతం వైరస్‌ బారిన పడుతుండటం మరింత ఆందోళన కలిగిస్తున్నది. ఉస్మానియా, పేట్లబురుజు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్న సుమారు 50 మంది వైద్యులతోపాటు పలువురు పారిశుద్ధ్య కార్మికులు, సెక్యురిటీ సిబ్బంది కరోనా వైరస్‌ బారిన పడుతుండటంతో అత్యవసర పరిస్థితుల్లో వైద్యులతోపాటు రోగులు సైతం ఆస్పత్రికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు.

వివిధ∙ఆస్పత్రుల్లో...
కింగ్‌కోఠి ఆస్పత్రిలో 22 మందికి కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ కాగా, నెగిటివ్‌ వచ్చిన తొమ్మిది మందిని డిశ్చార్జి చేశారు. మరో 57 మంది నుంచి నమూనాలు సేకరించి, పరీక్షలు నిర్వహిస్తున్నారు. రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రికి 44 మంది అనుమానితులు రాగా.. వీరిలో తొమ్మిది మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఆయుర్వేద ఆస్పత్రికి 65 మంది పాజిటివ్‌ రోగులు వచ్చారు.

రెండు వేలు దాటిన గ్రేటర్‌ కేసులు
ఎప్పుడు..? ఎక్కడ..? ఏ రూపంలో వైరస్‌ విజృంభిస్తుందో తెలియక అయోమయంతో ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ వ్యాప్తంగా 3290 పాజిటివ్‌ కేసులు నమోదైతే.. వీటిలో 2138 పాజిటివ్‌ కేసులు కేవలం హైదరాబాద్‌ నగరంలోనే వెలుగు చూశాయి. ఇక ఇప్పటి వరకు 113 మంది మృతి చెందగా, వీరిలో వంద మందికిపైగా గ్రేటర్‌లోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 

ఎల్‌బీనగర్‌ సర్కిళ్ల పరిధిలో 10 కేసులు
ఎల్‌బీనగర్‌: ఎల్‌బీనగర్‌ మూడు సర్కిళ్ల పరిధిలో శుక్రవారం 10 కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.ఇందులో నలుగురు డాక్టర్లు కావడం గమనార్హం. నాగోలు డివిజన్‌లో ఫతుల్లాగూడకు చెందిన ఒకే కుటుంబంలోని ఐదుగురికి వైరస్‌ సోకింది. పద్మావతీకాలనీలో నివసించే మహిళా డాక్టర్‌ కాగా బీఎన్‌రెడ్డినగర్‌ డివిజన్‌కు చెందిన మరో మహిళా డాక్టరు, పెట్లబురుజులోని ప్రభుత్వ హాస్పిటల్‌లో పనిచేస్తూ చైతన్యపురిలో నివసించే ఒక డాక్టర్‌కు, లింగోజిగూడలోని విజయపురికాలనీలో నివసించే డాక్టర్‌తోపాటు అతని భార్యకూ కరోనా పాజిటివ్‌ వచ్చింది. కరోనా పాజిటివ్‌ వచ్చిన నలుగురు డాక్టర్లు నగరంలోని పెట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో పనిచేస్తున్నారు.

వెంగళరావునగర్‌ డివిజన్‌లో ఒకరికి...
వెంగళరావునగర్‌: వెంగళరావునగర్‌ డివిజన్‌ జవహర్‌నగర్‌లో ఓ వ్యక్తి (47)కి కరోనా పాజిటివ్‌ వచ్చిందని జీహెచ్‌ఎంసీ సర్కిల్‌–19 ఉప కమిషనర్‌ ఎ.రమేష్‌ తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న జవహర్‌నగర్‌ దర్గాలైన్‌లోని గాయత్రీ పాఠశాల సమీపంలో ఉండే ఓ వ్యక్తికి పరీక్షలు చేయగా కోవిడ్‌ వచ్చిందన్నారు.

బోయిన్‌పల్లిలో...
కంటోన్మెంట్‌: కంటోన్మెంట్‌ ప్రాంతంలో గడచిన వారం రోజుల్లో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. బోయిన్‌పల్లిలోనూ ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేసే తోకట్టావాసికి వ్యాధి నిర్ధారణ కావడంతో బోర్డు అధికారులు, అతని నివాస పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. 

బోడుప్పల్‌లో...
బోడుప్పల్‌: బోడుప్పల్‌ టెలిఫోన్‌ కాలనీలో నివాసం ఉండే ఓ వ్యక్తి నిమ్స్‌ ఆస్పత్రిలో కార్డియాలజిస్ట్‌ విభాగంలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు.ఆయనకు కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రస్తుతం నిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. గతంలో పెంటారెడ్డి కాలనీలో ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా రాగా వారికి చికిత్స పొంది డిశ్చార్జి చేశారు.

బాగ్‌లింగంపల్లిలో...
చిక్కడపల్లి: బాగ్‌లింగంపల్లిలో ఓ గృహిణి(32)కి కరోనా నిర్ధారణ అయింది. ఆమె భర్త లేబర్‌గా పనిచేస్తాడు. వారికి ఇద్దరు పిల్లలు. గా«ంధీనగర్‌ కెనరా బ్యాంక్‌ మోర్‌ సూపర్‌ మార్కెట్‌ వద్ద నివాసం ఉండే గృహిణికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో వారింటిని కంటైన్మెంట్‌ చేసినట్లు అధికారులు తెలిపారు.

రోషన్‌ బాగ్‌లో యువకుడికి...
బంజారాహిల్స్‌ రోషన్‌ బాగ్‌లో నివసించే ఓ యువకుడికి కరోనా సోకింది. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న అతనికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు