హజ్‌ యాత్రకు రాష్ట్రం నుంచి 3,685 మంది 

13 Jan, 2019 01:15 IST|Sakshi

రిజర్వ్‌ కేటగిరీలో 484 మంది ఎంపిక 

రాష్ట్ర హజ్‌ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్‌ఎ.షుకూర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: కంప్యూటర్‌ డ్రా పద్ధతిలో 2019 హజ్‌ యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా 3,685 మంది ఎంపికయ్యారని రాష్ట్ర హజ్‌ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్‌ఎ.షుకూర్‌ తెలిపారు. అలాగే 70 ఏళ్ల వయసు పైబడిన వారిలో రిజర్వ్‌ కేటగిరీలో తెలంగాణ నుంచి 484 మంది హజ్‌ యాత్రకు నేరుగా ఎంపికయ్యారని పేర్కొన్నారు. శనివారం హజ్‌ యాత్రకు ఎంపిక ప్రక్రియను నాంపల్లి హజ్‌హౌస్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హజ్‌ కమిటీ ముంబై నుంచి ఆన్‌లైన్‌ ద్వారా ఏర్పాటు చేసిన కంప్యూటర్‌ డ్రాను ప్రత్యేక అధికారి బటన్‌ నొక్కి ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సౌదీఅరేబియా ప్రభుత్వం హజ్‌ యాత్రకు వెళ్లేందుకు దేశవ్యాప్తంగా 1.75 లక్షల మందికి అనుమతులు ఇచ్చిందన్నారు.

ఇందులో కేంద్ర హజ్‌ కమిటీ 50 వేల మందిని తీసుకెళ్లే అవకాశం ప్రైవేట్‌ టూర్‌ ఆపరేటర్లకు.. మిగ తా 1.12 లక్షల మందిని తీసుకెళ్లే అవకాశం వివిధ రాష్ట్రాల హజ్‌ కమిటీలకు ఇచ్చిందన్నారు. తెలంగాణకు 4,169 మందికి యాత్రకు వెళ్లే కోటాను కేటాయించిందని తెలిపారు. 2019 హజ్‌ యాత్రకు హైదరాబాద్‌ నుంచి అత్యధికంగా 8,441 దరఖాస్తులు రాగా అత్యల్పంగా మహబూబాబాద్‌ జిల్లా నుంచి 4 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. వచ్చే నెల మొదటి వారంలో హజ్‌ యాత్ర తొలి నగదు కిస్తు రూ. 81 వేలు జమచేయాల్సి ఉంటుందన్నారు. జూలై 1 నుంచి ఆగస్టు 3 వరకు హజ్‌ యాత్ర కొనసాగుతుందన్నారు. హజ్‌ యాత్రకు రాష్ట్ర హజ్‌ కమిటీ ద్వారా తీసుకెళ్తామని చేప్పే మధ్యవర్తులను సంప్రదించవద్దని హెచ్చరిం చారు. మరిన్ని వివరాల కోసం హజ్‌ కమిటీ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని సూచించారు.  

మరిన్ని వార్తలు