487మంది కానిస్టేబుళ్ల బదిలీ

24 Jun, 2018 09:21 IST|Sakshi
తెలంగాణ పోలీస్‌

సాక్షి, ఖమ్మం : ఉమ్మడి జిల్లాలైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, భూపాలపల్లి జయశంకర్‌ జిల్లాల్లోని 487మంది కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలపై వారం రోజులుగా కౌన్సిలింగ్‌ నడుస్తోంది. బదిలీలకు మొదటి ప్రాధాన్యంగా మెడికల్, రెండవ ప్రాధాన్యంగా స్పౌస్‌ (భార్య ఉద్యోగిని అయితే) పరిగణించారు. ఏజెన్సీలో మూడేళ్లు, నగరాల్లో ఐదేళ్లపాటు పనిచేసిసన వారిని బదిలీ చేశారు. 

త్రిశుంకు స్వర్గంలో అటాచ్‌మెంట్‌ సిబ్బంది 
అవినీతి ఆరోపణలతోపాటు ఏళ్లతరబడి ఒకేచోట పనిచేస్తున్న ఐడీ పార్టీ సిబ్బంది, డ్రైవర్లు, గన్‌మన్, ఇతర కానిస్టేబుళ్లను ఖమ్మం కమిషనరేట్‌లో 77 మందిని హెడ్‌ క్వార్టర్స్‌కు సీపీ అటాచ్‌మెంట్‌ చేసిన విషయం పాఠకులకు తెలిసిందే. దీనిపై కమిషనర్‌ను పోలీస్‌ అధికారుల సంఘం నాయకులు కలిశారు. వారిని (అటాచ్‌మెంట్‌లో ఉన్న వారిని) బదిలీ చేయాలని కోరారు. సీపీ మాత్రం, మూడు నెలలపాటు అటాచ్‌మెంట్‌లోనే విధులు నిర్వర్తించాలని ప్రకటించిన విషయం విదితమే. 

శనివారం విడుదలైన కానిస్టేబుళ్ల బదిలీ జాబితాలో.. అటాచ్‌మెంట్‌కు గురైన 77మంది ఉన్నారు. ‘‘బదిలీ అయినవారు వెంటనే విధుల్లో చేరాలి’’ అని, సీపీ స్పష్టంగా ఆదేశించారు. అయితే, అటాచ్‌మెంట్‌లో ఉన్నవారు వెంటనే విధుల్లో చేరాలా..? (సీపీ అన్నట్టుగా) మూడు నెలల తర్వాత చేరాలా...? అనే సందిగ్ధంలో ఉన్నారు. దీనిపై సోమవారం స్పష్టత వచ్చే అవకాశముంది.

మరిన్ని వార్తలు