రిజిస్ట్రేషన్లకు ‘సాంకేతిక’ గండం

5 Dec, 2017 02:21 IST|Sakshi

     వరుసగా 4వ రోజు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల సేవలకు అంతరాయం

     సర్వర్‌ మార్పిడితో రాష్ట్రవ్యాప్తంగా పనిచేయని కార్యాలయాలు

     నేటి నుంచి ఊపందుకుంటాయంటున్న ఉన్నతాధికారులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలు ఇంకా పూర్తిస్థాయిలో గాడిన పడలేదు. సర్వర్, స్టోరేజి మార్పిడితో అత్యంత వేగవంతమైన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను అధికారులు చేపట్టారు. సోమవారం హైదరాబాద్, రంగారెడ్డితోపాటు పలు జిల్లాల్లో కొంతమేర కార్యాలయాలు పనిచేసినా మెజార్టీ జిల్లాల్లో మాత్రం పనిచేయలేదు. దీంతో కొత్త సర్వర్‌తో మొదటిరోజు రాష్ట్రవ్యాప్తంగా 1,500 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్‌ సేవలు యథావిధిగా అందుబాటులోకి వస్తాయని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ఒకేసారి లాగిన్‌తో..
వాస్తవానికి, గతంలో రిజిస్ట్రేషన్ల శాఖ సర్వర్‌లు తరచూ మొరాయిస్తుండేవి. దీంతో రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలు రోజుల తరబడి నిలిచిపోయేవి. ఈ సమస్యను అధిగమించేందుకుగాను ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నాటి వ్యవస్థ నుంచి మన రాష్ట్ర సర్వర్‌ను విడగొట్టి ఈ ప్రక్రియను సాఫీగా చేసేందుకు మూడురోజుల విరామం ప్రకటించారు. దీంతో శుక్ర, శని, ఆదివారాల్లో రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలు అధికారికంగానే నిలిచిపోయాయి. వాస్తవానికి శని, ఆదివారాలు సెలవులు కావడంతో శుక్రవారం మాత్రం సేవలు ఆగిపోయాయి. అయితే, మూడు రోజుల వ్యవధిలో గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన కొత్త సెంట్రల్‌ సర్వర్, స్టోరేజిని రాష్ట్రంలోని 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలతో అనుసంధానం చేశారు.

సోమవారం నుంచి మళ్లీ రిజిస్ట్రేషన్‌ సేవలు కొత్త సర్వర్‌ ఆధారంగా గాడిలో పడతాయని అధికారులు అంచనా వేశారు. కానీ, సోమవారం ఒకేసారి అందరూ లాగిన్‌ కావడంతో లాగిన్‌ ఎర్రర్స్‌ వచ్చాయని ఆ శాఖ అధికారులు చెపుతు న్నారు. ఆ తర్వాత ఉదయం కొంతసేపు డాక్యుమెంట్ల అప్‌లోడ్, ఫొటోక్యాప్చరింగ్‌ ప్రక్రియలు సాఫీగా పనిచేసిన తర్వాత మళ్లీ నిలిచిపోయాయి. ఆ తర్వాత మళ్లీ కొంతసేపు ప్రారంభమైనా మళ్లీ ఆగిపోయాయి. కేవలం సాంకేతిక సమస్యల కారణంగానే ఈ అవాంతరాలు ఏర్పడ్డాయని నిర్ధారించిన రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు సాయంత్రం 4 గంటల సమయానికి అన్ని అవాంతరాలను సరిచేశారు. దీంతో సాయంత్రం నుంచి మరో గంటపాటు సేవలు కొనసాగాయి. ఏదిఏమైనా తొలిరోజు కలిగిన అవాంతరాలతో రాష్ట్రంలో దాదాపు 50 శాతమే రిజిస్ట్రేషన్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయని ఆ శాఖ అధికారులు లెక్కలు గడుతున్నారు. మంగళవారం నుంచి ఎలాంటి సమస్యలు ఉండవని, తొలిరోజు వచ్చిన సాంకేతిక సమస్యలను సరిచేశామని ఆ శాఖ అడిషనల్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ వేముల శ్రీనివాసులు ‘సాక్షి’కి వెల్లడించారు.    

మరిన్ని వార్తలు