ఆస్తిపన్నుపై 5% రాయితీ

2 Apr, 2018 01:37 IST|Sakshi

30లోగా చెల్లిస్తేనే : పురపాలక శాఖ

రాష్ట్రవ్యాప్తంగా అమలుకు ఆదేశాలు

వెబ్‌సైట్‌లో ‘టాప్‌–100’ ఎగవేతదారుల జాబితా

సాక్షి, హైదరాబాద్ ‌: ఆస్తి పన్ను ముందస్తుగా చెల్లించే వారికి 5 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు పురపాలక శాఖ ప్రకటించింది. ఈ నెల 30 లోపు పన్ను చెల్లించే వారికి ఈ రిబేట్‌ వర్తింపజేస్తామని వెల్లడించింది. జీహెచ్‌ఎంసీలో ఇప్పటికే రిబేట్‌ను అమలు చేస్తుం డగా.. ఇకపై రాష్ట్రంలోని 73 మున్సిపల్‌ కార్పొ రేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోనూ వర్తింపజేయాలని అధికారులను ఆదేశించింది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ఆస్తి పన్నుల వసూళ్లతో ఆదాయం పెరిగితే అభివృద్ధి పనులకు నిధుల కొరత ఉండదని పురపాలక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రిబేట్‌పై విస్తృత ప్రచారం కల్పించి వసూళ్లు ప్రోత్సహించాలని మున్సిపల్‌ కమిషనర్లను కోరింది. గడువులోగా చెల్లించని ఆస్తి పన్నుల బకాయిలపై పెనాల్టీలు విధించడం.. తర్వాత మిగిలిన బకాయిలను రాబట్టుకోడానికి మళ్లీ కొత్త గడువు విధించి ఆలోపు చెల్లిస్తే పెనాల్టీలు మాఫీ చేయడం కొన్నేళ్లుగా అనవాయితీగా వస్తోంది. దీంతో సకాలంలో పన్ను చెల్లింపులు ప్రోత్సహించేందుకు 2016–17 నుంచి పెనాల్టీల మాఫీకి పురపాలిక శాఖ స్వస్తి పలికింది. 

‘నేమ్‌ అండ్‌ షేమ్‌’పద్ధతిలో..
జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని మిగిలిన 73 పురపాలికల్లో ఆస్తి పన్ను ఎగవేసిన టాప్‌–100 మంది జాబితాను పురపాలక శాఖ తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. కమర్షియల్‌ ఆస్తులకు సంబంధించి ఏళ్లుగా చెల్లించని మొండి బకాయిలు రూ.కోట్లకు ఎగబాకడంతో ఈ నిర్ణయం తీసుకుంది. వసూళ్ల కోసం పలు మార్లు నోటిసులిచ్చినా లాభం లేకపోవడంతో ‘నేమ్‌ అండ్‌ షేమ్‌’పద్ధతిలో ఎగవేతదారుల పేర్లు బహిర్గతం చేసేందుకు ఆ జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. దీంతో ఎగవేతదారులు పన్నులు చెల్లించేందుకు ముందుకొస్తారని ఈ నిర్ణయం తీసుకున్నామని పురపాలక శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, ఆస్తి పన్నులు ఎగవేస్తే సంబంధిత వ్యక్తుల ఆస్తులు జప్తు చేసే అధికారం పురపాలికలకు ఉందని ఓ అధికారి తెలిపారు. 

రూ.294 కోట్లు వసూలు..
2017–18లో 73 పురపాలికల ద్వారా రూ.294 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. 2016–17లో వసూలైన రూ.232.77 కోట్లతో పోల్చితే గతేడాది 26 శాతానికి పైగా అధిక రాబడి వచ్చింది. సిరిసిల్ల, మెట్‌పల్లి, కొత్తగూడెం, పీర్జాదిగూడ పురపాలికల్లో 100 శాతం.. మీర్‌పేట్, దుబ్బాక, కోరుట్ల, బోడుప్పల్, హుజూరాబాద్‌ పురపాలికల్లో 98 శాతానికి పైగా పన్ను వసూలైంది. నల్లగొండ, ఐజా, నారాయణ్‌పేట్, భూపాలపల్లి పురపాలికల్లో వసూళ్లు 50 శాతానికి మించలేదు.

మరిన్ని వార్తలు