‘సాయం’తో సంతోషం.. 

20 Aug, 2019 10:17 IST|Sakshi

సాక్షి, కొత్తగూడెం :  ఒకప్పుడు ఆడ బిడ్డ పెళ్లి చేయాలంటే ఆ కుటుంబం అప్పులపాలయ్యే పరిస్థితి ఉండేది. దీంతో తల్లిదండ్రులకు కంటినిండా కునుకు పట్టకపోయేది. అయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ర్వాత ఏర్పడిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల పేరుతో ఆర్థిక సాయం అందిస్తూ నిరుపేద, మధ్య తరగతి కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతోంది. ఆడపిల్ల పెళ్లి భారంగా భావించిన తల్లిదండ్రులకు ఈ పథకం వరంగా మారింది. అమ్మాయిల పెళ్లిళ్లను వైభవంగా జరిపిస్తూ గౌరవ మర్యాదలను నిలుపుకుంటున్నారు. పెళ్లికి వచ్చిన వారికి ఏ లోటూ లేకుండా చూసుకోగలుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆడబిడ్డలకు ఇచ్చే కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ మొత్తాన్ని క్రమంగా పెంచుతుండడంతో దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. 

జిల్లాలో ఈ ఏడాది 5036 దరఖాస్తులు... 
2019–20 ఆర్థిక సంవత్సరంలో గడిచిన నాలుగు నెలల్లో జిల్లాలో 5036 మంది కల్యాణలక్ష్మి, షాదీముభారక్‌ పథకాలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇప్పటివరకు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల స్థాయిలో పరిశీలన జరిపి 2318 మందికి మంజూరు చేశారు. వీటిలో ఇప్పటికే 1649 మందికి పంపిణీ చేశారు. ఇంకా 669 మందికి పంపిణీ చేయాల్సి ఉంది. మరో 2718 మంది దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి.  

రూ.లక్ష దాటిన పథకం లబ్ధి... 
2014 అక్టోబర్‌లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాలను ప్రవేశపెట్టింది. మొదట     ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రూ.51 వేలు మంజూరు చేశారు. 2017 ఏప్రిల్‌ 1 నుంచి ఈ మొత్తాన్ని రూ.75,116కు పెంచారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతోపాటు బీసీ, ఈబీసీలకు సైతం పథకాన్ని వర్తింపజేశారు. 2018 ఏప్రిల్‌ 1 నుంచి రూ.1,00,116కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులకు మాత్రం ఈ పథకం కింద రూ.1, 25,140 లబ్ధి చేకూరేలా ప్రణాళిక రూపొందించింది. అంతేకాక అనాథ ఆడ పిల్లలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తోంది. వీరికి అర్బన్‌ ప్రాంతంలో అయితే రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు చెల్లిస్తున్నామని, విడాకులు తీసుకుని రెండో వివాహం చేసుకునే మహిళలు గతంలో కల్యాణలక్ష్మి పథకంతో        లబ్ధి పొందకుంటే వారికి కూడా ఈ పథకం             వర్తిస్తుందని అధికారులు వివరించారు.

మరిన్ని వార్తలు