బోరు.. బోరుమంది...

30 Apr, 2017 02:08 IST|Sakshi
బోరు.. బోరుమంది...

ఐదేళ్లలో 50 బోర్లు వేసిన రైతు సోదరులు
- రెండు బోర్లలోనే కొద్దిపాటి నీరు
- 60 ఎకరాలున్నా.. నీళ్లు లేవు
- మూడెకరాల్లో వరి సాగు
- మండుతున్న ఎండలకు అడుగంటుతున్న భూగర్భ జలాలు


మరికల్‌: మండుతున్న ఎండలకు వ్యవసాయ బోర్లలో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. చేతికి వచ్చిన పంటలను ఎలాగైనా కాపాడుకోవాలనే తపనతో వడ్డీలకు అప్పులు చేసి బోర్లు వేస్తున్నా.. ఎండలకు భూమి తల్లి గర్భంలోనుంచి గుక్కెడు నీటిబొట్లు రావడం లేదు. కళ్లెదుటే పంటలు ఎండుముఖం పడుతుంటే అన్నదాతల బాధలు చూసే వారికి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా మరికల్‌ మండలం కన్మనూర్‌ గ్రామానికి చెందిన లక్ష్మీకాంత్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి ముగ్గురు సోదరులు. ఈ ముగ్గురికీ కలిపి 60 ఎకరాల భూమి ఉంది.

వీరిలో గోపాల్‌రెడ్డి ఉపాధ్యాయుడు కాగా, మిగతా ఇద్దరు వ్యవసాయాన్నే నమ్ముకున్నారు. వీళ్లు వర్షాభావంతో పంటల సాగుకోసం ఐదేళ్లలో 50 బోర్లు వేశారు. వాటిలో కేవలం రెండు బోర్లలో మాత్రమే కొద్దిపాటి నీరు పడింది. ప్రతి ఏడాది ఇద్దరు సోదరులు 2 నుంచి 3 ఎకరాలలోపు వరి పంటలను సాగుచేస్తూ, మిగతా భూమిలో వర్షాధార పంటలనే నమ్ముకున్నారు. వేసవి కాలం వచ్చిందంటే చాలు.. ఉన్న రెండు బోర్లలో కూడా భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. దీంతో లక్ష్మీకాంత్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి ఒకరోజు తప్పించి ఒకరోజు పంటలకు నీళ్లు పారపెడుతున్నారు. ఈ ఏడాది ఉన్నబోర్లు కూడా ఎండిపోయాయి. దీంతో నీళ్లు లేక పొలం మొత్తం నెర్రెలుబాస్తోంది.

లక్షలు నష్టపోయాం..
మా ముగ్గురు సోదరులకు కలిపి 60 ఎకరాల భూమి ఉంది. ముందునుంచి వ్యవసాయాన్నే నమ్ముకున్నాం. నీటిజాడ కోసం లక్షల ఖర్చుతో 50 బోర్లను డ్రిల్లింగ్‌ చేశాం. కానీ కేవలం రెండు బోర్లలోనే కొద్దిపాటి నీరు రావడంతో భాగ పరిష్కారాలు చేసుకున్నాం. వచ్చే కొద్దిపాటి నీళ్లతో 3 ఎకరాల్లో వరి సాగు చేశాం. ఒకరోజు తప్పిం చి ఒకరోజు పంటలకు నీరు పెడుతూ వచ్చిన దిగుబడితోనే సంతృప్తి చెందుతున్నాం. ఈ ఏడాది బోర్లలో భూగర్భజలాలు అడుగంటిపోవడం వల్ల పంటంతా ఎండింది. నమ్ముకున్న ఎవుసం కలిసిరాక నట్టేట మునిగిపోయాం. ఏం చేయాలో, ఎక్కడికి బోవాలో తెలుస్తలేదు.      
– లక్ష్మీకాంత్‌రెడ్డి, రైతు, కన్మనూర్‌

మరిన్ని వార్తలు