‘పంచాయతీల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు’

14 Jun, 2018 01:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. రిజర్వేషన్ల అమలులో అన్యాయం జరిగితే హైకోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. పంచాయతీరాజ్‌ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం 31 జిల్లాల్లో బీసీ గణన నిర్వహించిందని, వారి లెక్కల ప్రకారం బీసీ జనాభా 54% ఉందని గుర్తుచేశారు.

ఈ ప్రాతిపదికను పరిగణనలోకి తీసుకోకుండా బీసీలకు ఇష్టానుసారం రిజర్వేషన్లు కేటాయించడం ఎంతవరకు సమంజసం అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రిజర్వేషన్లను నీరుగార్చే వారి ఆటలు సాగనివ్వమని, బీసీ రిజర్వేషన్లపై ఎన్నికల సంఘాన్ని కలుస్తామని తెలిపారు. దామాషా పద్ధతిన పాలనలో భాగస్వామ్యం కల్పించాలని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తుచేశారు. 2014 సమగ్ర సర్వే లెక్కలను అధికారికంగా వెల్లడించాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. 

మరిన్ని వార్తలు