50 మంది విద్యార్థినులు అస్వస్థత

26 Jun, 2019 11:39 IST|Sakshi
కరీంనగర్‌ ఆసుపత్రిలో చికిత్సపొందుతుతున్న మోడల్‌ స్కూల్‌ విద్యార్థినులు  

సాక్షి, శంకరపట్న(కరీంనగర్‌) : జిల్లాలోని  శంకరపట్నం మండలం కేశవపట్నం మోడల్‌ స్కూల్‌ హాస్టల్‌ విద్యార్థినులు కలుషిత భోజనం తిని 50 మంది మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి ఆలుగడ్డ కూర విద్యార్థినులకు వడ్డించారు. గంట తర్వాత కొందరు కడుపునొప్పితో విలవిలలాడారు. హాస్టల్‌ ఏఎన్‌ఎం టాబ్లెట్లు ఇవ్వగా.. రాత్రంతా ఉండిపోయారు. మంగళవారం ఉదయం అల్పాహారంలో విద్యార్థినులకు ఉప్మా వడ్డించారు. అల్పాహారం తిన్న విద్యార్థినుల్లో కొందరు వాంతులు చేసుకున్నారు. స్థానిక పీహెచ్‌సీ వైద్యులు, సిబ్బంది చికిత్స అందించారు. 32 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి పీహెచ్‌సీ వైద్యుడు షఖిల్‌ అహ్మద్‌ 108, పోలీసుల వాహనాల్లో తరలించారు. జిల్లా వైద్యాశాఖ అధికారి రాంమనోహర్‌రావు, ఆర్డీవో చెన్నయ్య, డీఐవో జువేరియా కేశవపట్నం పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. హాస్టల్‌ను సందర్శించి ఉప్మా నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు.   

అపరిశుభ్రంగా వాటర్‌ ట్యాంక్‌ 
హాస్టల్‌లో విద్యార్థినులకు తాగునీరు అందిస్తున్న వాటర్‌ట్యాంక్‌ అపరిశుభ్రంగా ఉన్నట్లు అధికారుల పరిశీలనలో వెలుగుచూసింది. ట్యాంకు నీటిని భోజనంలో వాడిన కారణంగానే సోమవారం రాత్రి భోజనం తిన్న విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.  నాచు పట్టిన నీటితో వంట చేయడంతో ఆహారం విషతుల్యమై విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నిర్ధారణకు వచ్చారు. మోడల్‌స్కూల్‌ హాస్టల్‌లో 83 మంది విద్యార్థినులు ఉన్నారు. వంటకోసం హాస్టల్‌ భవనంపై వాటర్‌ట్యాంక్‌ నుంచి నీటిని వాడుతున్నారు. వాటర్‌ట్యాంక్‌లో నాచుపట్టగా ఇప్పటివరకు శుభ్రం చేయలేదు. రాత్రి  వండిన ఆలుగడ్డ కర్రీ, ఉదయం అల్పాహారంలో చేసిన ఉప్మా, ప్యూరీపైడ్‌ వాటర్, వాటర్‌ ట్యాంక్‌ నీటి షాంపిల్‌ సేకరించి ల్యాబ్‌కు పంపించారు.   

పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం 
పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంతోనే విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని బీజేపీ మండల అధ్యక్షుడు సమ్మిరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ మండల అధ్యక్షుడు తాళ్ల సురేశ్, సీపీఎం మండల కార్యదర్శి రాజిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు జక్కని సంజయ్‌కుమార్‌ ఆరోపించారు. వీరిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

నిలకడగా ఆరోగ్యం    
కరీంనగర్‌ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 32 మంది విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి రీజినల్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ తెలిపారు. పిల్లల వార్డులో చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం వారందరి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తూ వారికి పెరుగు అన్నం తినిపించినట్లు డాక్టర్‌ తెలిపారు.    

ఆరోగ్యంగా ఉన్నారు  
విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే చేరుకొని  విద్యార్థినులను వెంటనే కరీంనగర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించాం. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నాం.  
–డీఈవో వెంకటేశ్వర్లు,  

మరిన్ని వార్తలు