పంచాయతీలకు కాసుల గలగల

15 Nov, 2016 13:19 IST|Sakshi
పంచాయతీలకు కాసుల గలగల

హైదరాబాద్‌: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సామాన్యులను అవస్థలు పెడుతున్నా... గ్రామ పంచాయతీల్లో మాత్రం పన్నుల వసూళ్లు పెరుగుతున్నాయి. పాత రూ.500, రూ.1,000 నోట్లతో పన్నుల చెల్లింపునకు అవకాశం కల్పించడమే దీనికి కారణం. కొన్నేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా చాలా గ్రామాలు, పట్టణాల్లో ఆస్తిపన్ను బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోయి ఉన్నాయి. దాంతో అభివృద్ధి పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

తాజాగా పాతనోట్లతో పన్నులు, బకాయిలు చెల్లించేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించడంతో నాలుగు రోజులుగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఖజానా కళకళలాడుతోంది. పలు గ్రామాల్లో పాత బకాయిలతో పాటు వచ్చే ఏడాది మార్చిలోగా చెల్లించా ల్సిన ఆస్తిపన్నును కూడా చెల్లిస్తుండడం గమనార్హం.

ఇంతకుముందు ఇంటింటికీ తిరిగి పన్ను కట్టాలని అడిగినా వసూళ్లు జరిగేవి కావని, ఇప్పుడు పన్ను చెల్లించేం దుకు పాతనోట్లతో జనం బారులు తీరుతు న్నారని కొందరు గ్రామ పంచాయతీల సర్పంచులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పాతనోట్లతో ఆస్తిపన్ను చెల్లించుకునే అవకా శాన్ని మారుమూల గ్రామాలు సైతం వినియోగించుకుంటున్నారని.. ముఖ్యంగా పట్టణాలకు సమీపంలో ఉండే గ్రామాల్లో ఆస్తి పన్నులు వంద శాతం వసూలయ్యే అవకాశం కనిపిస్తోందని పంచాయతీరాజ్‌ అధికారులు చెబుతున్నారు.

పంచాయతీరాజ్‌ ప్రత్యేక ఏర్పాట్లు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ ఆస్తి పన్ను చెల్లించేందుకు ప్రజలు ఆసక్తి చూపు తుండడాన్ని గమనించి పంచాయతీరాజ్‌ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి గ్రామంలో రోజువారీగా దండోరా వేయిం చడంతో పాటు మేజర్‌ గ్రామ పంచాయతీల్లో వార్డుకో పన్ను వసూలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కొన్ని గ్రామాల్లోనైతే పంచాయతీ సిబ్బందే ఇంటింటికి తిరిగి పన్ను వసూలు చేసి రసీదులు అందజేస్తున్నారు. మొత్తంగా గత 4 రోజుల్లో అనూహ్యంగా రూ.21 కోట్లకు పైగా పన్నులు వసూలు కావడం, పాత నోట్లతో పన్ను చెల్లింపునకు కేంద్రం మరింత గడువు ఇవ్వడంతో మరింత ఆదాయం వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

ఆస్తిపన్ను వసూలుకు అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలంటూ ప్రజలను చైతన్యపరిచేందుకు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా చొరవ చూపడం, కొత్త జిల్లాల్లో డీపీవోలుగా నియమితులైన అధికారులు ప్రత్యేక శ్రద్ద కనబరచడంతో పంచాయతీలకు నిధుల కొరత తీరనుంది.

పెర్ఫార్మెన్స్ గ్రాంట్‌తో అదనపు నిధులు
పాత బకాయిలతో పాటు ఈ ఏడాది వంద శాతం ఆస్తిపన్ను వసూలైన గ్రామ పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం నుంచి పెర్ఫార్మెన్స్ గ్రాంటు రూపేణా అదనపు నిధులు అందనున్నాయి. కేంద్రం ఇచ్చే ఈ పెర్ఫార్మెన్స్ గ్రాంట్‌లో 50 శాతం నిధులను గతేడాది కంటే ఐదుశాతం అధికంగా ఆస్తిపన్ను వసూలు చేసిన గ్రామ పంచాయ తీలకు, మరో 50 శాతం నిధులను ఈ ఏడాది వంద శాతం పన్నులు వసూలు చేసిన గ్రామ పంచాయతీలకు ఇవ్వనున్నారు. ఈ ఏడాది రాష్ట్రానికి రూ.105 కోట్ల పెర్ఫార్మెన్స్ గ్రాంట్‌ లభించగా.. వచ్చే ఏడాది రూ.195 కోట్లను ఇవ్వనున్నారు. సాధారణంగా వచ్చే అభివృద్ధి నిధులకు తోడుగా మంచి పనితీరు కనబర్చిన గ్రామాలకు ఈ పెర్ఫార్మెన్స్ గ్రాంట్‌ ఇస్తారు. దీంతో అభివృద్ధి పనులకు మరింత తోడ్పాటు లభిస్తుంది.

మరిన్ని వార్తలు