ఆర్టీసీకి రూ.500 కోట్ల బోనస్‌?

19 Dec, 2019 01:56 IST|Sakshi

గాడిన పడుతున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ

వచ్చే ఏప్రిల్‌ నాటికి బ్రేక్‌ఈవెన్‌ దాటనున్న వైనం

లాభం కనిపించగానే బోనస్‌ ప్రకటించే చాన్స్‌

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ అనగానే అప్పులు, నష్టాలే గుర్తుకొస్తాయి.. అయితే ప్రస్తుతం పరిస్థితి మారింది. క్రమంగా ఆర్టీసీ గాడిన పడుతోంది. 20 రోజుల్లో చోటు చేసుకున్న పెనుమార్పులు బోనస్‌పై ఆశలు రేకెత్తిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే.. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం బోనస్‌ రూపంలో ఏకంగా రూ.500 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని విశ్వసనీయ సమాచారం. బడ్జెట్‌ ద్వారా ఆర్టీసీకి కేటాయించే రూ.వేయి కోట్లలో సగం మొత్తాన్ని బోనస్‌గా ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గరిష్టంగా ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున బోనస్‌ అందే అవకాశముంది.
 
మార్చి తర్వాత బ్రేక్‌ ఈవెన్‌కు.. 
వచ్చే మార్చి తర్వాత ఆర్టీసీ బ్రేక్‌ ఈవెన్‌ (లాభనష్టాలు లేని సమస్థితి)కు చేరుకుంటుందని ఆర్టీసీ అంచనా వేస్తోంది. ఆ తర్వాత మరో నాలుగైదు నెలల్లో హైదరాబాద్‌లో మినహా మిగతా ప్రాం తాల్లో లాభాలు కనిపించే అవకాశముంది. ఆర్టీసీని పునరుద్ధరించిన తర్వాత స్వయంగా సీఎం కె.చంద్రశేఖర్‌రావు పర్యవేక్షణలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆయన క్రమం తప్పకుండా అధికారులతో భేటీ అవుతూ పరిస్థితులు తెలుసుకుని సూచనలు, సలహాలు అందిస్తున్నారు. తాను రవాణాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీ నష్టాలను నివారించి రూ.14 కోట్ల లాభాలు తెచ్చానని స్వయంగా పలు సందర్భాల్లో ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఆర్టీసీని పర్యవేక్షిస్తున్నందున లాభాలను కూడా పునరుద్ధరించే అవకాశముంది. సమ్మె తర్వాత తీసుకున్న కొన్ని చర్యలు ఆర్టీసీ నష్టాలను భారీగా తగ్గించేందుకు దోహదం చేయబోతున్నాయి.  

కిలోమీటరుకు ఆదాయంలో పెరుగుదల
ఆర్టీసీలో ప్రతి కిలోమీటరుకు వచ్చే ఆదాయం (ఈపీకే)కు ఎంతో ప్రాధాన్యముంది. గతేడాది ఇదే సమయంలో ఈపీకే గరిష్టంగా రూ.30గా ఉంది. కానీ ప్రస్తుతం అది రూ.35కు చేరుకుంది. సోమవారం రోజైతే ఏకంగా రూ.38గా నమోదైంది. సమ్మెకు పూర్వం ప్రతి కిలోమీటరుకు ఆర్టీసీ రూ.7 చొప్పున నష్టాలు చవిచూస్తోంది. తాజాగా ఆదాయం పెరగటంతో ఆ నష్టం రూ.2కు పడిపోయింది. ఇక ఆ రూ.2ను కూడా తగ్గించి సున్నాకు తీసుకొస్తే బ్రేక్‌ ఈవెన్‌ సాధ్యమవుతుంది. ప్రస్తుతం రోజువారీ ఆదాయంలో రూ.1.8 కోట్ల మేర పెరుగుదల నమోదవుతోంది. ఇందులో మరో రూ.30 లక్షల వరకు చేరితే బ్రేక్‌ ఈవెన్‌కు మార్గం సుగమమవుతుంది. ప్రస్తుతం మూఢాలు మొదలైనందున శుభకార్యాలు లేవు. తిరిగి సంక్రాంతి తర్వాత శుభకార్యాలు మొదలవుతాయి. ఏకబిగిన మే వరకు ఉంటాయి. దీంతో ఫిబ్రవరి నాటికి బ్రేక్‌ ఈవెన్‌ సాధ్యమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి.
 
ఆదాయం పెరుగుదలకు కారణాలివే.. 
∙పెరిగిన బస్సు చార్జీలు సాలీనా రూ.800 కోట్ల వరకు తెచ్చి పెట్టే అవకాశముంది.  ∙సిబ్బందిలో పెరిగిన క్రమశిక్షణ వల్ల అదనంగా ఆదాయం పెరగనుంది. ∙ప్రస్తుతం వేయి బస్సుల వరకు తగ్గిస్తున్నారు. దీంతో నిర్వహణ (సిబ్బంది జీతాలు కా కుండా) ఖర్చులు ఆదా కానున్నాయి.   ∙కొత్తగా సరుకు రవాణా విభాగాన్ని ప్రారంభిస్తున్నారు. సాలీనా రూ.400 కోట్ల ఆదాయం లక్ష్యంగా అది మొదలవుతోంది. అది పూర్తిగా అదనపు ఆదాయమే.  ∙ఉన్న బస్సుల హేతుబద్ధీకరణ ద్వారా వృథా వ్యయాన్ని తగ్గించటంతో పాటు ఆదాయాన్ని పెంచుకోనున్నారు. సిబ్బంది హేతుబద్ధీకరణ ద్వారా ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని తొలగించనున్నారు. వారి జీతాల భారం తగ్గనుంది.  ∙ప్రభు త్వం బడ్జెట్‌ ద్వారా ఇచ్చే మొత్తంలోంచి కొన్ని అప్పులు తీర్చనున్నారు. వాటిపై సాలీనా చెల్లించే రూ.200 కోట్ల వడ్డీ భారం కొంత తగ్గనుంది.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా