20 రోజులు 519 కేసులు

22 May, 2020 08:35 IST|Sakshi

తాజాగా మరో 26 కేసులు నమోదు  

సాక్షి, సిటీబ్యూరో: కరోనా వైరస్‌ గ్రేటర్‌ వాసుల కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. గురువారం మరో 26 కేసులు వెలుగులోకి వచ్చాయి. లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపునకు తోడు కొత్త కేసులు పెరుగుతుండటంతో సిటిజన్లు బెంబెలేత్తిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1661 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా,  గ్రేటర్‌లోనే 1120 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. మే నెల ప్రారంభం నుంచి ఇప్పటివరకు కేవలం 20 రోజుల్లోనే 519 పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు 45 మంది మృతి చెందగా, వీరిలో 39 మంది సిటిజనులే. పాజిటివ్‌ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. తాజాగా కుల్సుపుర పీఎస్‌కు చెందిన కానిస్టేబుల్‌ కూడా మృతి చెందడం మరింత ఆందోళన కలిగిస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా గురువారం ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో కొత్తగా నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నెగిటివ్‌ వచ్చిన ఏడుగురిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 13 మంది అనుమానితులు ఉన్నారు.వీరి రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఫీవర్‌ ఆస్పత్రిలో 22 మందిని ఐసోలేషన్‌ వార్డులో అడ్మిట్‌ చేసుకున్నారు. వీరి రిపోర్టులు రావాల్సి ఉంది.  

కూకట్‌పల్లి జోన్‌లో6 పాజిటివ్‌లు
కూకట్‌పల్లి: కూకట్‌పల్లి జోన్‌ పరిధిలో గురువారం 6 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జోనల్‌ కమిషనర్‌ మమత తెలిపారు. మూసాపేట డివిజన్‌ బబ్బుగూడలో 1, పాండురంగానగర్‌లో  2, రెయిన్‌బో విస్తా 2, ఉషా ముళ్లపూడి రోడ్డులో 1 కేసులు వెలుగులోకి వచ్చినట్లు ఆమె వివరించారు.  

వృద్ధురాలికి పాజిటివ్‌
అమీర్‌పేట: సనత్‌నగర్‌ సుభాష్‌నగర్‌కు చెందిన ఓ వృద్ధురాలికి (65) కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు కరోనా లక్షణాలు ఉండటంతో నేచర్‌క్యూర్‌ ఆసుపత్రికి తరలించిన అధికారులు వైద్య పరీక్షలు చేయగా పాజిటివ్‌ వచ్చింది. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు గురువారం సుభాష్‌నగర్‌లోని ఆమె ఇంటి పరిసరాల్లో శానిటైజేషన్‌ చేశారు. ఆమె కుటుంబసభ్యులు 5 మందిని క్వారంటైన్‌ చేశారు.

నిమ్స్‌లో 11 మంది కరోనా అనుమానితులు
లక్డీకాపూల్‌ : నిమ్స్‌ ఆస్పత్రిలో వైద్యసేవల కోసం వచ్చిన రోగుల్లో 11 మందికి కరోనా లక్షణాలు ఉండటంతో అధికారులు గాంధీ  ఆస్పత్రికి సిఫార్సు చేశారు. గురువారం ఓపీ సేవలు పొందేందుకు మిలినియం బ్లాక్‌ వద్దకు 718 మంది వచ్చారు. వారిలో తొమ్మిది మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన హెల్త్‌కేర్‌ సిబ్బంది ఓపీ  కార్డు జారీ చేసేందుకు నిరాకరించారు. గాంధీ ఆస్పత్రికి వెళ్లి కరోనా వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించారు. నిమ్స్‌ స్పెషాలిటీ బ్లాక్‌ వద్ద నిర్వహించిన స్క్రీనింగ్‌ పరీక్షలో ఇద్దరికి కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించి గాంధీ ఆస్పత్రికి పంపారు.   

బాగ్‌లింగంపల్లిలో ముగ్గురు అనుమానితులు
చిక్కడపల్లి: బాగ్‌లింగంపల్లిలో ముగ్గురు కరోనా  అనుమానితులను అధికారులు పరీక్షలకు తరలించారు. ఈడబ్లు్యఎస్‌ క్వార్టర్స్‌లో కరోనా పాజిటివ్‌ వచ్చిన మహిళ కుటుంబ సభ్యులు ముగ్గురిని అధికారులు గురువారం కోవిడ్‌ పరీక్షల నిమిత్తం ఆమీర్‌పేటలోని నేచర్‌క్యూర్‌ ఆస్పత్రికి తరలించారు.

గోషామహల్‌లో మరో మహిళకు పాజిటివ్‌  
అబిడ్స్‌: గోషామహాల్‌ పరిధిలోని లోయర్‌ దూల్‌పేట్‌లో ఓ వృద్ధురాలు(72) జ్వరం, జలుబు, దగ్గు బాధపడుతుండటంతో ఆసుపత్రికి తరలించగా ఆమెకు కరోన పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత 3 నెలలుగా ఆమె ఇంట్లోనే ఉంటున్నప్పటికీ ఆమెకు కరోనా ఎలా సోకిందో అర్థం కావడం లేదని అధికారులు పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు