ప్రసవం @ ప్రభుత్వ ఆస్పత్రి!

14 Jun, 2018 01:07 IST|Sakshi

కేసీఆర్‌ కిట్‌తో మారిన పరిస్థితి

రాష్ట్రంలో ప్రతినెల 52 వేల కాన్పులు

ప్రభుత్వ ఆస్పత్రిలో గత ఏప్రిల్‌లో 39 శాతం

ఈ ఏడాది ఏప్రిల్‌లో 48.60 శాతం కాన్పులు  

సాక్షి, హైదరాబాద్‌: కేసీఆర్‌ కిట్‌ పథకంతో ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాల సంఖ్యను పెంచి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, బాలింతల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్‌ కిట్‌ పథకాన్ని ప్రారంభించింది. 2017 జూన్‌ 3న సీఎం కేసీఆర్‌ ఈ పథకాన్ని ప్రారంభించారు. పేద కుటుంబాల్లోని మహిళలకు ప్రసవాల కారణంగా కలిగే ఆర్థిక భారాన్ని తగ్గించడం, క్లిష్ట సమయంలో ఆర్థిక సహాయం చేయడం ప్రధాన ఉద్దేశంగా ఈ పథకం అమలవుతోంది.

నాలుగు దశలుగా ఈ డబ్బులను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. శిశువుకు వ్యాక్సిన్‌ వేసే రోజులకు అనుగుణంగా నగదు జమ చేసేలా పథకం రూపొందించారు. కాన్పు జరిగిన వెంటనే శిశువు సంరక్షణ కోసం ప్రత్యేకంగా 15 వస్తువులతో కూడిన కిట్‌ను అందిస్తున్నారు. మొత్తంగా మాతాశిశు ఆరోగ్య రక్షణ లక్ష్యంగా ఈ పథకం అమలవుతోంది. కేసీఆర్‌ కిట్‌ పథకం మొదలై ఏడాది పూర్తయిన నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ ఈ వివరాలను వెల్లడించింది.  

- కేసీఆర్‌ కిట్‌ పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 10,14,168 మంది గర్భిణులు వైద్య పరీక్షలకోసం నమోదు చేసుకున్నారు. ఇప్పటికి 2,44,387 కాన్పులు జరిగాయి. ప్రభుత్వం ఇప్పటికి రూ.259.59 కోట్లను విడుదల చేసింది.  
రాష్ట్రంలో సగటున ప్రతి నెల 50 వేల కాన్పులు జరుగుతున్నాయి. కేసీఆర్‌ కిట్‌ పథకం అమలుకు ముందు గత ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వ ఆస్పత్రులలో 20 వేల కాన్పులు జరిగేవి. అనంతరం పరిస్థితి మారింది. 2017 అక్టోబర్‌లో ప్రైవేటు ఆస్పత్రులలో కాన్పుల సంఖ్య ఏకంగా 27 వేలకు పెరిగింది. కాస్త అటుఇటుగా ఇదే తీరు కొనసాగుతోంది. 
ప్రైవేట్‌ ఆస్పత్రులలో ఒక్కో కాన్పుకోసం సగటున రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కేసీఆర్‌ కిట్‌ పథకంతో పేద కుటుంబాలకు ఈ భారం లేకుండాపోయింది. రాష్ట్రంలోని 8.28 లక్షల కుటుంబాలకు రూ.20 వేల చొప్పున ఆదా అయ్యాయి.

మరిన్ని వార్తలు